Suryaa.co.in

Political News

“ఈ” వాదోపవాదాలు సాంకేతికమే !

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇటీవల ఒక మహిళతో మాట్లాడినట్టుగా వెలుగు లోకి వచ్చిన ఒక వీడియొ తెలుగు ప్రపంచం లో బాగా సర్క్యూలేట్ అయింది . టీడీపీ నేతలు , దీనిని రచ్చ రచ్చ చేశారు . వారితో పాటు , ఈ వీడియొ కు మరింత ప్రచారం కల్పించడానికి -ఏ బీ ఎన్ ఆంధ్రజ్యోతి , టీవీ 5 , ఆంధ్రజ్యోతి దినపత్రిక కూడా యధాశక్తి తమ వంతు ప్రయత్నం చేశాయి . చేస్తున్నాయి.

దీని అథేన్టిసిటీ పై అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు . కానీ , ఆయన స్వరం బలంగా వినపడలేదు . గోరంట్ల మాధవ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ , అందులో లాజిక్ కనపడలేదు . పచ్చి బూతులు ఉన్నాయి . ‘ మరి , ఆయన మాజీ పోలీస్ కదా ! కర్ణుడి కవచ కుండలాల్లాగా ఆ భాష ఆయనకు సహజమే గదా ‘ అని ఆ భాష విన్నవారు సరిపెట్టుకున్నారు .

అనంతపురం ఎస్పీ ఫకీరప్ప కూడా ఈ వీడియో ఒరిజినల్ కాదని చెప్పడానికి ఓ మానవ ప్రయత్నం చేశారు. దానితో , వైసీపీ ప్రత్యర్థుల విమర్శలు ఇంకా పెరిగి పోయాయి. వారు ఇంకో అడుగు ముందుకు వేసి, ఇది ఒరిజినల్లో … కాదో చెప్పమని అమెరికా లోని ఓ ప్రైవేట్ ఫోరెన్సిక్ ల్యాబ్ ను అడిగారు . ‘డౌటేముంది ? ఒరిజినల్లే ‘ అని వారు ఇచ్చినట్టుగా భావిస్తున్న ఒక నివేదిక ను కూడా తెలుగు ప్రపంచం లైవ్ లో చూసేసింది .

మొత్తం మీద వైసీపీ పెద్దలు కొంత ఆత్మ రక్షణలో పడిపోవడం తో , వారి రక్షణకు సీ ఐ డీ చీఫ్ సునీల్ కుమార్ మీడియా ముందుకు సాంకేతి విషయాన్ని -వీలైనంతగా సాంకేతిక మలుపులు తిప్పారు.
టీడీపీయులు ఆయనపై మళ్ళీ విరుచుకు పడ్డారు. అవును ….కాదు వివాదంతో , విషయం మాత్రం జనం లోకి దూసుకు వెళ్ళింది . వైసీపీ కి జరగవలసిన డామేజ్ ఏదో జరిగిపోయింది. ఎంత జరగడానికి అవకాశం ఉన్నదో …అంతా జరిగిపోయింది . పనిలో పనిగా మరి కొంత మంది పేర్లు కూడా బయటకు వచ్చాయి . వారికీ యధాశక్తి. ఫ్రీ పబ్లిసిటీ లభించింది . ఈ మొత్తం ఎపిసోడ్ లో ఓ విశేషం ఉన్నట్టు కనపడుతున్నది.

వైసీపీ నాయకులు గానీ, గోరంట్ల మాధవ్ గానీ , అనంతపురం ఎస్పీ గానీ , సీ ఐ డీ బాస్ గానీ -ఆ వీడియొ లో కనపడిన శరీరం మాధవ్ ది కాదు అని చెప్పడం లేదు . ఆయన తలకు , వేరే వారి మొండెం తగిలించి చూపించారు అని చెప్పడం లేదు . ఆ గొంతు మాధవ్ ది కాదు అని చెప్పడం లేదు . ఇటువంటి వీడియోలు వాట్సాప్ వీడియొ కాల్ లో మాట్లాడడానికే వీలవుతుంది కానీ , వాటిని రికార్డు చేయడం కుదరదు . మరో కెమెరా తో రికార్డు చేయాల్సిందే. మరొకరు రికార్డు చేస్తే ; ఆ ‘ మరొకరు ‘ అసలు వారి అనుమతి లేకుండా రికార్డు చేయలేరు కదా ! అంటే – ఆ కొసరు వారు , అసలు వారికి , ‘అంత’ ఆత్మీయులైతే తప్ప , ఈ సత్కార్యానికి అనుమతి ఇవ్వరు కదా !

ఇది ప్యూర్ గా ప్రైవేట్ యవ్వారమే గానీ , పదిమంది లో పడి , పబ్లిక్ యవ్వారం అయిపొయింది .
ఆ వీడియొ ఫేక్ అని ఎంత సమర్ధించినా , కుదరడం లేదు . అభ్యంతరాలు ‘సాంకేతికమే ‘ గానీ, విషయం మాత్రం విదితమే గదా! ‘ ధర్మజుడు తన్నోడి నన్నోడెనా …. లేక , నన్నోడి తన్నోడెనా ?’అనేది కేవలం సాంకేతికమే కదా ! మొత్తం మీద ద్రౌపది ని కూడా జూదం లో పెట్టి , ధర్మ రాజు ఓడిపోయాడు , అనేది పాయింట్ . ఇంకా , ‘ఇలాటి’ రసవత్తరమైన వీడియొ ల కోసం ఇరుపార్టీల వారు తీవ్రమైన వెదుకులాట లో ఉన్నారనే వార్తలు – ఈ ఎపిసోడ్ లో కొసమెరుపు .

– భోగాది వేంకట రాయుడు
@venkata _rayudu

LEAVE A RESPONSE