-మహానేత వైయస్‌ఆర్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాలను
ఆవిష్కరించిన సీఎం వైయస్ జగన్
-ఇద్దరు మహానుభావుల విగ్రహాలను ఆవిష్కరించడం సంతోషంగా ఉంది
-పేదలు, రైతుల సంక్షేమం అంటే గుర్తుకొచ్చే పేరు మహానేత వైయస్‌ఆర్
-మంచి చేసిన వైయస్‌ఆర్ ఒక్క అడుగు వేస్తే.. మీ బిడ్డగా నాలుగు అడుగులు ముందుకు వేయగలిగా..
-ఏప్రిల్ 14న విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ
-రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత వైయస్‌ఆర్‌కే దక్కుతుంది
-గ్రానైట్ పరిశ్రమలకు కొత్త శ్లాబ్ సిస్టమ్
-చిన్న గ్రానైట్ పరిశ్రమలకు కరెంటు చార్జీల్లో యూనిట్‌కు రూ.2 తగ్గింపు
-ప్రాజెక్టు వెలిగొండను 2023 సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తా
-మొగిలిగుండ్ల చెరువుకు బూచేపల్లి సుబ్బారెడ్డి పేరు
దర్శి: పేదల సంక్షేమం అంటే ముందుగా గుర్తొచ్చే పేరు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి అని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. రైతుల సంక్షేమం, ఉచిత విద్యుత్, ఫీజు రీయంబర్స్‌మెంట్, ఆరోగ్యం.. ఇలా ఎంతో మంచి చేశారన్నారు. ఆయన ఒక అడుగు వేస్తే.. వైయస్ఆర్ బిడ్డగా తాను నాలుగు అడుగులు ముందుకు వేస్తానని సీఎం వైయస్ జగన్ మరోసారి వేదిక సాక్షిగా ప్రకటించారు. ఇచ్చినమాట ప్రకారం.. 95 శాతం మేనిఫెస్టో హామీలను ఇప్పటికే నెరవేర్చామని, దేవుడి దయ.. ప్రజల ఆశీస్సులతో మరింత మంచి చేస్తామని మాటిచ్చారు. మంచి చేస్తే మనిషికి మరణం ఉండదని, ప్రతీ గుండెలోనూ సజీవంగా నిలిచే ఉంటారనడానికి నిదర్శనం ఇవాళ జరిగిన విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమమే అని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం చీమకుర్తిలో మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం.. బహిరంగ సభలో సీఎం వైయస్ జగన్ ప్రసంగించారు.
చెరగని చిరునవ్వులతో ఆప్యాయతలు పంచిపెడుతున్న ప్రతి ఒక్కరికీ ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఇద్దరు మహానుబావుల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాలుపంచుకున్నాను. ఇవాళ ఒక మనిషి మంచి చేస్తే ఆ మనిషికి చావు ఉండదని, ఆ మనిషి చనిపోయిన తరువాత కూడా ప్రతి గుండెలో కూడా బ్రతికే ఉంటాడని చెప్పడానికి ఈ రోజు జరిగిన రెండు విగ్రహ ఆవిష్కరణలే. నిజంగా పేదల సంక్షేమంటే రైతు సంక్షేమం అంటే ఈ పదాలు చెప్పినప్పుడు తెలుగు నేలపై ఎప్పుడు కూడా గుర్తుండే ఒక శిఖరంగా దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి పేరు గుర్తుకు వస్తుంది. రైతులకు ఉచిత విద్యుత్ అయినా సరే..వైయస్‌ఆర్ పేరు గుర్తుకు వస్తుంది. ఆ రోజు విద్యుత్ తీగలు చూపించి బట్టలు ఆరవేసుకోవడానికి పనికి వస్తాయని హేళనగా మాట్లాడారు. ముఖ్యమంత్రి కాగానే వైయస్ రాజశేఖరరెడ్డి మొట్ట మొదటి సంతకం ఉచిత విద్యుత్ ఫైల్‌పై చేశారు.
నిజంగా పేదవాడు పేదరికం నుంచి బయటకు రావాలంటే..ఆ పిల్లలు గొప్పగా చదువుకోవాలి. గతంలో రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని తీసుకువచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అట్టడుగున ఉన్న పేదవారికి నిజంగా జీవితంలో పైకి రావాలంటే చదువు అనే ఒక ఆస్తిని పంచిపెట్టిన వైయస్ రాజశేఖరరెడ్డి గుర్తుకు వస్తారు. పేదవాడికి ఆరోగ్యం బాగోలేనప్పుడు, కుయ్ కుయ్ అని సైరన్ మోగినప్పుడు గుర్తుకు వచ్చే ఆరోగ్యశ్రీ దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి గుర్తుకు వస్తారు.
లక్షల కొద్ది ఇళ్ల నిర్మాణాలు, జల యజ్ఞం ఇలా చెప్పుకుంటూ పోతే ఆ దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి వేసిన అడుగులు ఇప్పటికీ, ఎప్పటికీ మరిచిపోలేం. మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి అంత మంచి చేశారు. ఆయన ఒక్క అడుగు వేస్తే..మహానేత కొడుకుగా వైయస్ జగన్ అనే నేను నాలుగు అడుగులు ముందుకు వేస్తాడని మాట ఇవ్వడమే కాకుండా, దేవుడి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులతో ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నాను. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తూ అడుగులు ముందుకు వేయగలిగామని మీ బిడ్డగా సగర్వంగా చెబుతున్నాను.
ఈ రోజు నాన్నగారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించాల్సిందిగా ఎప్పటి నుంచో నా తమ్ముడు బూచేపల్లి శివ ప్రసాద్‌రెడ్డి చాలా సందర్భాల్లో అడిగారు. ఈ రోజు నాన్నగారి విగ్రహంతో పాటు ఆయనతో కలిసి అడుగులు వేసిన బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ప్రజల గుండెల్లో కలకాలం ఉండే నాయకులు, వారి మంచి పనులకు మద్దతుగా వారి మనస్తత్వం కనిపిస్తుంది. ఇలాంటి నాయకులను ఎప్పుడు మరచిపోలేం. ఒకవైపు నాన్నగారు. మరోవైపు సుబ్బారెడ్డి అన్నా..ఇంకో వైపు విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఏప్రిల్ 24న ఆవిష్కరిస్తాం. గాంధీజీ, అంబేద్కర్, పూలే, జగ్జీవన్‌రావు, మౌలానా, అల్లూరి సీతారామరాజు, ప్రకాశం పంతులు, మహానేత వైయస్‌ఆర్‌ను కలకాలం తలుచుకుంటేనే ఉంటాం. వీరి శరీరాలకు మరణం ఉంటుందేమో కానీ, వీరు చేసిన మంచి పనులకు, వీరి భావాలకు ఎప్పుడు కూడా మరణం ఉండదన్నది అంతే వాస్తవం.
ఈ రోజు మరో విషయం కూడా మీతో అందరితో పంచుకోవాలి. నా పాదయాత్ర సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు స్టోన్ కట్టింగ్ అండ్ పాలిషింగ్‌కు సంబంధించి చిన్న చిన్న యాజమాన్యాలతో పాటు అక్కడ పని చేస్తున్న కార్మికులు కలిశారు. గత ప్రభుత్వంలో వారికి జరుగుతున్న అన్యాయాన్ని నా దృష్టికి తీసుకువచ్చారు. గ్రానైట్ పరిశ్రమకు మంచి రోజులు వస్తాయని ఆ రోజు నేను వారికి ఇచ్చిన మాట నాకు గుర్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు ఏదైతే చెప్పానో మీ అందరికీ మాట ఇస్తున్నాను. ఈ రోజు ఇక్కడికి రాకముందే ..ఈ రోజే జీవో కూడా విడుదల చేశామని చెబుతున్నాను.
నాన్నగారి హాయంలో తీసుకువచ్చిన శ్లాబ్‌ను 2016లో చంద్రబాబు ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఫలితంగా అప్పటికే అంతంత మాత్రంగా నడుస్తున్న చిన్న చిన్న గ్రానైట్ పరిశ్రమలు కష్టాల్లో కూరుకుపోయాయి. దాదాపు 7 వేల యూనిట్లకు లబ్ధి చేకూర్చేలా కొత్త విధానాన్ని మనందరి ప్రభుత్వం జీవో నంబర్ 58ను విడుదల చేసి ఇక్కడికి వచ్చాను. ప్రకాశం జిల్లాలో 22 క్యూబిక్ మీటర్ల వరకు ముడి గ్రానైట్‌ను ప్రాసెస్ చేసే యూనిట్లకు సింగిల్ బ్లేడ్‌కు రూ.27 వేలు, మల్టీబ్లేడ్‌కు రూ.54 వేలు ఇచ్చేలా శ్లాబ్ సిస్టమ్‌ను తీర్చిదిద్దాం.
శ్రీకాకుళం, రాయలసీమ జిల్లాల్లో సింగిల్ బ్లేడ్‌కు రూ. 22 వేలు, మల్టీబ్లేడ్‌కు రూ.44 వేలు సీనరేజ్ శ్లాబ్‌గా నిర్ణయించాం. ఇలా శ్లాబ్ విధానం అమలు చేయడం వల్ల మన ప్రభుత్వానికి అక్షరాల రూ.135 కోట్ల నష్టం వాటిల్లుతుందని తెలిసీ కూడా అడుగులు ముందుకు వేస్తున్నాం. ఈ రూ.135 కోట్ల కన్నా మీ కడుపు నిండటం అవసరం అని భావించి మళ్లీ శ్లాబ్ విధానం తీసుకువచ్చాం.
ఇప్పుడు ప్రకటించిన కొత్త విధానం వల్ల చిన్న చిన్న గ్రానైట్ పాలీష్ యూనిట్లు స్పీడ్ అందుకుంటాయి. రవాణా రంగంలో అవకాశాలు మెరుగుపడుతాయి. ఈ చిన్న చిన్న పరిశ్రమల ద్వారా కార్మికులకు మేలు జరుగుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం.
ఈ రోజు మరో కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా..చిన్న చిన్న పరిశ్రమలకు కరెంటు చార్జీలు హెచ్‌టీకే రూ.6.33 ఉంది. ఆ చార్జీల్లో రూ.2 తగ్గిస్తున్నాం. కరెంటు చార్జీలు రూ.2 తగ్గించడం వల్ల ఏకంగా రూ.210 కోట్లు ప్రభుత్వంపై భారం పడుతుందని తెలిసీ కూడా ఈ రెండు కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. ప్రభుత్వానికి ఈ మేరకు నష్టం వాటిల్లినా కూడా చిన్న చిన్న పరిశ్రమలపై ఆధారపడిన పారిశ్రామికవేత్తలు, లక్షల్లో ఉన్న కార్మికులకు మంచి జరుగుతుందని మనసారా భావిస్తూ..దేవుడి దయతో ఇంకా మంచి జరగాలని ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాను. ఈ రోజు నుంచి ఈ రెండు కార్యక్రమాలు అమలులోకి వస్తాయి.
ఒకవైపు చిన్న చిన్న గ్రానైట్ పరిశ్రమలకు మేలు చేయడంతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రైతులందరికీ కూడా మేలు చేసే గొప్ప ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు. ఈప్రాజెక్టు గురించి చెప్పాల్సి వస్తే..
వెలుగొండ ప్రాజెక్టు మొదటి టన్నల్ 18.8 కిలోమీటర్లు, రెండో టన్నల్ 18.78 కిలోమీటర్లు, ఈ టన్నళ్ల పురోగతిని చూస్తే దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఉరుకులు పరుగులు పెట్టించారు. మహానేత హయాంలో మొదటి టన్నల్‌లో 11.58 కిలోమీటర్లు పూర్తి చేశారు. రెండో టన్నల్‌లో 8.74 కిలోమీటర్లు 2014 నాటికి పురోగతి సాధించింది. చంద్రబాబు సీఎం అయ్యాక మొదటి టన్నల్‌లో కేవలం 4.33 కిలోమీటర్లు , రెండో టన్నల్‌లో 2.35 కిలోమీటర్లు పూర్తి చేసి చేతులు దులుపుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మీ బిడ్డగా ఈ రోజు మొదటి టన్నల్‌లో మిగిలిపోయిన 2.9 కిలోమీటర్లు ఇప్పటికే పూర్తి చేశాం. ఈ టన్నల్ నుంచి యాక్సెస్ తీసుకొని రెండో టన్నల్ పనులు కూడా వేగవంతం చేశాం. రెండో టన్నల్‌లో 3.7 కిలోమీటర్లు పూర్తి చేశాం. మిగిలిన పనులు కూడా రేపు సెప్టెంబర్ 2023 నాటికి పూర్తి చేసి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాను. ఈ ప్రాజెక్టును ప్రారంభించి ఎన్నికలకు వెళ్తానని చెబుతున్నాను. ఈప్రాజెక్టు వల్ల ప్రకాశం జిల్లా రూపురేఖలు సమూలంగా మారుతాయని, మంచి జరగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.
ఇక్కడికి వచ్చేటప్పుడు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ వెంకాయమ్మ రెండు పనులు అడిగారు. ఒంగోల్‌లో కొత్తగా జిల్లా పరిషత్ కార్యాలయానికి భవనం నిర్మాణానికి రూ.20 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరారు. అమ్మకు మాటిస్తున్నాను. రూ.20 కోట్లు మంజూరు చేస్తున్నాను. తుళ్లూరు మండలంలోని శివరామపురంలోని చెరువును మినీ రిజర్వాయర్‌గా మార్చి, ఆ రిజర్వాయర్‌కు బూచేపల్లి సుబ్బారెడ్డి పేరు పెడుతూ ఆ అమ్మకు హామీ ఇస్తున్నాను. ఇక్కడే ఆదేశాలు ఇస్తున్నాను. మనస్పూర్తిగా మంచి జరగాలని, ఈ ప్రాంతానికి ఇంకా మంచి చేసేలా దేవుడు నాకు అవకాశం ఇవ్వాలని, ఈ రోజు తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల చాలా మంది జీవితాల్లో చిరునవ్వులు ఇంకా అధికం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..మీ అందరి చల్లని దీవెనలకు ,ఆశీస్సులకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.