– రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ
– జివో 40ను పటిష్టంగా అమలు చేయాలంటూ సిఎస్ కు యార్లగడ్డ వినతి
పాలనా భాషగా తెలుగును అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని , కాలానుగుణంగా తగిన ఆదేశాలు జారీ చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ తెలిపారు. తెలుగు భాష పరిరక్షణ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే అన్ని చర్యలు తీసుకుందని వివరించారు. జివో 40లో నిర్దేశించిన విధంగా తెలుగు భాషను పాలనా భాషగా అమలు చేసేవిషయంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ అధికార భాషా సంఘం అధ్యక్షుడు అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ బుధవారం వెలగపూడి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా సమీర్ శర్మ మాట్లాడుతూ తెలుగు భాష పరిరక్షణ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టిందని, రానున్న రోజుల్లో మరింత మెరుగ్గా వ్యవహరిస్తామని వివరించారు. ఈ సందర్భంగా అచార్య యార్లగడ్డ మాట్లాడుతూ బోధన భాషకు, పాలన భాషకు తేడా ఉందని, ఇకపై ‘ఏపీ తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ’ ద్వారా తెలుగు అధికార భాషగా అమలు జరుగుతున్న తీరును డివిజనల్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రమం తప్పకుండా సమీక్షిస్తామన్నారు. శాస్త్ర, సాంకేతిక, న్యాయ, పరిపాలనా రంగాల్లో, ఇతర భాషల్లో వస్తున్న పారిభాషిక పదాలకు తెలుగులో ప్రత్యామ్నాయ పదాలను తయారు చేసుకోవటానికి అవసరమైన కార్యాచరణను సిద్ధం చేస్తున్నామని, ఇందుకోసం ‘పద నిధి’ని కూడా ఏర్పాటు చేయనున్నామన్నారు.
గత ప్రభుత్వ హయాంలో మూసేసిన తెలుగు అకాడమీ, ఏపీ అధికార భాషా సంఘాన్ని తిరిగి ఏర్పాటు చేయడంతో పాటు, మైసూర్‌లోని తెలుగు భాష ప్రాచీన అధ్యయన కేంద్రాన్ని నెల్లూరుకు తరలించి, ఆ సంస్థ కోసం ఐదెకరాల స్థలాన్ని సైతం ముఖ్యమంత్రి కేటాయించారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని బడుగు, బలహీన వర్గాల పిల్లలకు కార్పొరేట్ స్థాయిలో ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉండాలనే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన ప్రవేశపెట్టారని, అయితే తెలుగు భాష ఒక పాఠ్యాంశంగా ఉంటుందని యార్లగడ్డ పేర్కొన్నారు.
ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు, నామ ఫలకాలు, బోర్డులు, ఫ్లెక్సీలు, ప్రారంభోత్సవ శిలాఫలకాలన్నీ తెలుగులోనే ఉండాలని వాటిని ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత తెలుగు భాష పట్ల మక్కువ పెంచేలా వివిధ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు, ఇంటర్, తత్సమాన తరగతుల్లో తెలుగును మొదటి భాషగా అమలు జరిగేలా చూస్తామని యార్లగడ్డ అన్నారు.
భారత ప్రభుత్వ ప్రాచీన తెలుగు భాషా కేంద్రం నిర్వహించే ప్రాజెక్టు వర్కులను సమన్వయం చేసుకుంటూ, ప్రభుత్వ ఆదేశాలకు లోబడి తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ అజమాయిషి, పాలనా వినియోగం కోసం రూ.25 కోట మూలధనంతో ఏర్పాటు చేసిన నిధి ఇకపై ‘తెలుగు భాషాభివృద్ధి నిధి’గా వ్యవహరించబడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఏదైనా సంస్థ యజమాని తమ నామఫలకాన్ని తెలుగులో ప్రదర్శించకపోతే రూ.50వేల జరిమానాతో పాటు జైలు శిక్ష ఉంటుందని, అలాగే ప్రభుత్వ శంకుస్థాపన, ప్రభుత్వ శాఖల ఉత్తర ప్రత్యుత్తరాల్లోనూ తెలుగులో లేకపోయినా, ప్రారంభోత్సవాల్లో కూడా శిలాఫలకాలు తెలుగులో లేకపోతే రూ.10వేల జరిమానా అమలులో ఉందన్నారు.
శాఖాధిపతి అధికారభాషగా తెలుగు అమలును సమీక్షించని ఎడల రూ.5వేల జరిమానా, ప్రభుత్వ ఉద్యోగి తెలుగు భాష ఉపయోగించకపోతే రూ.10వేల జరిమానా, ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలుగు పాఠ్యాంశంగా అమలు చేయకపోతే రూ.50 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించవచ్చని , ఇంతవరకు ఏ అధికార భాషా సంఘానికీ లేనటువంటి విశేష అధికారాలను ముఖ్యమంత్రి జగన్ మెహన్ రెడ్డి ఈ సంస్థకు ఇచ్చారని యార్లగడ్డ తెలిపారు.