ఉపాధి హామీ అమలుకు పది సూత్రాలు

Spread the love

– పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్

చిత్తశుద్ధి, ప్రణాళిక బద్ధమైన పనితీరు, పరిపూర్ణ నాయకత్వ లక్షణాలతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు పర్చి అన్ని సూచికలలో రాష్ట్రాన్ని దేశంలోనే ప్రధమ స్థానంలో నిలపాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్ పిలుపునిచ్చారు. గ్రామీణాభివృద్ధి శాఖ అధ్వర్యంలో జిల్లాల పునర్విభజన అనంతరం 26 జిల్లాల పిడి, డ్వామాల తొలి సమావేశాన్ని తాడేపల్లిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో బుధవారం అంటే 24- 8-2022 నిర్వహించారు. నూతన జిల్లాలతో పాటు అనేక జిల్లాలకు కొత్తగా పిడి, డ్వామాలు బాధ్యతలు స్వీకరించడ౦తో వారందరికి పథకంలోని వివిధ అంశాల పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ కోన శశిధర్ మాట్లాడుతూ వేతనదారుల డిమాండ్ మేరకు పనుల కేటాయింపు, పూర్తి వేతనం రూ. 257/- పొందేలా మార్కింగ్, సకాలంలో వేతన చెల్లింపు, ప్రతి పనికి సమాచార బోర్డ్ ఏర్పాటు వంటి పనికి పది సూత్రాలను నిర్దేశించుకుంటూ ఎలాంటి మొహమాటాలకు తావులేకుండా విధాన పర నిర్ణయాలు తీసుకుంటూ ప్రతిభావంత౦గా, సమర్ధవంత౦గా ఉపాధి హామీ పనులను చేపట్టాలని అన్నారు. సమయం వృధా కాకుండా నియమ నిబంధనలకు లోబడి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ క్షేత్ర స్థాయి వరకు వెళ్లి పనిచేయాలని అంటూ జిల్లా పనితీరు మెరుగైతే రాష్ట్రా పనితీరు మెరుగై దేశంలో ప్రధమ స్థానం సాధించడం సులభమని కమిషనర్ జిల్లా పిడిలకు వివరించారు.

రాష్ట్రస్థాయి నుంచి మండల స్థాయి వరకు ఉన్న అధికారులు అందరు క్షేత్ర పర్యటనలు ముమ్మరం చేయాలని, కూలీల బతుకుల్లో మార్పు తీసుకు వచ్చేలా వారి నైపుణ్యాలు పెంచే దిశగా ఆలోచనలు చేసి పిడిలు మరింత మెరుగ్గా పనిచేయాలని ఆయన చెప్పారు. పచ్చదనం పెంపు పనుల మీద దృష్టి సారించాలని, ప్రతి ఎంపిడిఓ గ్రామాలను దత్తత తీసుకుని వాటిని అభివృద్ధి పర్చేలా చర్యలు తీసుకోవాలని, చేసే ప్రతి పని ఉపయోగపడేలా ఉండాలని, గతంలో జిల్లాలో జరిగినవన్ని తెలుసుకుంటూ, ప్రతి ఆస్తి కల్పన ద్వారా లబ్దిదారునికి లాభం ఉండేలా కృషి చేయాలని, ఎప్పటికప్పుడు క్షేత్ర పర్యటనలు చేయాలని కమిషనర్ సూచించారు.

రాష్ట్రానికి గ్రామీణాభివృద్ధి శాఖ గుండెకాయ వంటిదని, గ్రామీణ నిరుపేద కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగు పర్చాలని భావించే గౌరవ ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా, ఆయన మార్గదర్శకత్వంలో 26 జిల్లాల పిడి, డ్వామాలు ఉపాధి హామీ పథకాన్ని అమలు పర్చాలని కమిషనర్ కోరారు. ఆయా సూచికల ఆధారంగా ప్రతి జిల్లా పనితీరును సమీక్షించి గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా రాష్ట్రస్థాయి అవార్డులను అందజేస్తామని ఈ సందర్భంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్ తెలిపారు.

ఈ సమావేశంలో ఇజిఎస్ సంచాలకులు పి.చినతాతయ్య మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం అమలులో దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూస్తోందని, గ్రామీణాభివృద్ధి శాఖాలో అనుభవం, నిబద్ధత ఉన్న అధికారులు ఎంతో మంది ఉన్నారని, వారందరూ నిజ శక్తితో పనిచేసినట్లయితే దేశంలోనే ప్రధమ స్థానంలో నిలుస్తామని అన్నారు.

ఇకపై ప్రతి నెలా నిర్దేశిత సూచికలకు అనుగుణంగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని, రాబోయే మూడు నెలల కాలాన్ని ఒక సవాలుగా తీసుకుని నిబద్ధతతో పనిచేసి దేశస్థాయిలో ఆదర్శంగా, మార్గదర్శకంగా నిలవాలని పిడి, డ్వామాలను కోరారు. ఉపాధి హామీ మాస్టర్ సర్క్యులర్ ను ఒక ఖురాన్, ఒక బైబిల్, ఒక భగవద్గీతలా భావించి అందులోని ప్రతి అంశాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని ఇజిఎస్ సంచాలకులు పి.చినతాతయ్య కోరారు.

ఈ సమావేశంలో ఇజిఎస్ జాయింట్ కమిషనర్లు ఎం. శివ ప్రసాద్, విజయ లాజరస్ లు ఉపాధి హామీ చట్టం, హక్కులు అనుమతించిన పనులు, వివిధ శాఖలతో అనుసంధానం, వివిధ స్థాయి అధికారుల పాత్ర- విధులు, అమలు విధానం, జిఐఎస్ సెక్యూర్ వంటి పలు అంశాలపై పిడి, డ్వామాలకు అవగాహన కల్పించారు. ఇంకా ఈ సమావేశంలో ఇజిఎస్ వివిధ స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply