Suryaa.co.in

Political News

‘ఢిల్లీ లీకుల’తో వేడెక్కుతున్న ఏపీ రాజకీయం !

నాలుగున్నర సంవత్సరాల క్రితం విడిపోయిన టీడీపీ – బీజేపీ పార్టీలు…. మళ్ళీ సఖ్యత దిశగా అడుగులేస్తున్నాయంటూ వివిధ మీడియాల్లో వెలువడుతున్న సమాచారాన్ని…. ‘పుకారు’ అనలేము. ‘వార్త’ కూడా అనలేము. ‘ఓ తాజా సమాచారం’ అంటే… పేచీ లేదు. ఢిల్లీ నుంచి వెలువడుతున్న ఈ ‘లీకు’ లను అటు బీజేపీ ఖండించడం లేదు…. అని చెప్పి ధృవీకరించడమూ లేదు. అలాగే, తెలుగు దేశం పార్టీ కూడా.

కానీ, ఈ రెండు పార్టీల మధ్య సఖ్యత ఖాయమే అన్న ‘మానసిక వాతావరణం’ మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడిపోయింది. దీనికి – ‘రిపబ్లిక్’ అనే ఓ ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్ ప్రసారం చేసిన ఓ బ్రేకింగ్ న్యూస్ బాగా ఉపకరించింది. అది ఒక బీజేపీ 100%అనుకూల ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్ అని ఆ ఛానెల్ చూసేవారికి అనిపిస్తూ ఉంటుంది. ఈ ఛానెల్ కు మామూలుగా బీజేపీ ‘లీకులు’ అన్నిటికంటే ముందుగా చేరతాయని కూడా ఓ అభిప్రాయం ఉంది.

అటువంటి ఛానల్ లో -టీడీపీ -బీజేపీ సఖ్యత కు సంబంధించి ‘బ్రేకింగ్ న్యూస్’ ప్రసారం చేశారు . టీడీపీ – బీజేపీ పొత్తు అంశం ఇప్పుడు చర్చల దశలో ఉన్నదని ; రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నాటికి ఈ రెండు పార్టీలు చేతులు కలుపుతాయని ఈ బ్రేకింగ్ న్యూస్ సారాంశం. ఈ పొత్తు అనుకూల వర్గాలు కొన్ని ఓ అడుగు ముందుకు వేసి, కేంద్రం లోని ఎన్ డీ ఏ ( అంటే బీజేపీ అని ) ప్రభుత్వం లో టీడీపీ కూడా త్వరలోనే చేరుతుందనే సమాచారాన్ని కూడా జనం లోకి వదిలాయి.

ఏతా… వాతా…. ఈ రెండు పార్టీలు మాత్రం పొత్తు దిశగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెడుతున్నాయనే అభిప్రాయం మాత్రం జనం లోకి గట్టిగా వెళ్ళింది. నిజానికి బీజేపీ ని దూరం చేసుకోవడం వల్ల కూడా – టీడీపీకి గత ఎన్నికల్లో ఇరవై మూడు స్థానాలే వచ్చాయి అనేది పలువురి పరిశీలకుల అభిప్రాయం కూడా. ఓ నెలా…. రెండు నెలల కిందటి వరకు రాష్ట్రం లో ‘పొత్తు’అభిప్రాయం లేదు. కనీసం పుకార్లు కూడా లేవు. రాష్ట్ర బీజేపీ నేతలు కూడా టీడీపీ పై విరగదీసుకుని పడిపోతూ ఉండేవారు. కానీ, అజాదీకా అమృత్ మహోత్సవ్ పేరిట ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఓ సమావేశానికి ఏపీ నుంచి సీఎంcm-jagan-chandrababu-165997133916x9జగన్ తో పాటు, చంద్రబాబు నాయుడుకూ ఆహ్వానం రావడంతో సీను మారిపోయింది. ఆ సమావేశానికి ఆయన వెళ్లడం ( ఆయన వెడుతున్నారని జగన్ వెళ్లకపోవడం ), ఆ సమావేశం అనంతరం – చంద్రబాబు ను మోడీ ఓ పక్కకు తీసుకెళ్లి కుశల ప్రశ్నలు వేయడం తో… ఆంధ్ర లో రాజకీయ వాతావరణంలో తేడా వచ్చేసింది . రిపబ్లిక్ టీవీ ఛానెల్ ఇప్పుడు – ఈ రెండు పార్టీల మధ్య చర్చలు సాగుతున్నాయంటూ ఓ సమాచారాన్ని దేశం మీదికి వదిలింది.

ఇటువంటి పొత్తుకుదురుతుందనే ప్రచారం వల్ల ….; (కుదరడానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ), టీడీపీ కి కొన్ని రాజకీయం గా ‘మానసిక ప్రయోజనాలు’ ఉన్నాయి.
* స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినట్టుగా…. అసెంబ్లీ, లోకసభ ఎన్నికలు ఏక పక్షంగా జరగడానికి అవకాశం ఉండదు అనే భావన టీడీపీయులకు వేయి ఏనుగుల బలాన్ని ఇస్తుంది. వారి కార్యకర్తల్లో లో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.
* గత ఎన్నికల్లో ఈవీఎం ల మేజిక్ కూడా కొంత పని చేసింది అనే విమర్శలు గట్టిగానే వినిపించాయి. ఈ సారి అలా విమర్శలు వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోతాయనే భావన టీడీపీ కి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది.
*ఈ ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యం లో జరుగుతాయి కాబట్టి, పోలీసులు కొంత నియంత్రణ పాటించాల్సి ఉంటుందనే అభిప్రాయం ఒకటి వ్యక్తమవుతున్నది.
* టీడీపీ + పవన్ కళ్యాణ్ + బీజేపీ అనేది విన్నింగ్ కాంబినేషన్ అనే ప్రచారం ఎప్పటి నుంచో ఉన్నందున…. ఆ అభిప్రాయం ఓటర్ల లో బాగా బలపడుతుంది.
* ఇటువంటి అభిప్రాయం – ఓటింగ్ సరళిని గట్టిగానే ప్రభావితం చేస్తుంది. ఎవరికి ఓటు వేద్దామా అని సంధిగ్దం లో ఉన్నవారు… విన్నింగ్ కాంబినేషన్ వైపు మొగ్గే అవకాశం ఉంటుంది. గత ఎన్నికల్లో అయిదొందలు… వెయ్యి ఓట్ల తేడాలో ఓడిపోయిన టీడీపీ స్థానాలు ఓ పాతిక వరకు ఉన్నాయి అంటున్నారు.
*ఇక, తటస్థ ఓటర్లు ఒక నిర్ణయానికి రావడానికి పొత్తు ప్రచారం బాగా ఉపకరిస్తుంది.వారిలో స్పష్టత వస్తుంది.
*ఈ పొత్తు వార్తలు వైస్సార్సీపీ మైండ్ పై ఒత్తిడి పెంచుతాయానడం లో సందేహం లేదు. ఆ ‘ఒత్తిడి’ ప్రభావం లో మరిన్ని అనుచిత ట్వీట్లు, మాటలు, చేతలు చోటుచేసుకోవడం సహజం.

ఇవన్నీ టీడీపీ కి లాభించే మానసిక ప్రయోజనాలే ( సైకాలాజికల్ యాడ్వాంటేజస్ ). ఎటువంటి పొత్తు ప్రస్తావనలూ లేకుండానే…. వైసీపీ లో చాలామంది ఎం ఎల్ ఏ ల ప్రోగ్రెస్ కార్డు లు బాగాలేవని వార్తలు వెలువడుతున్నాయి. గడప గడప కూ… అనే కార్యక్రమం – ప్రభుత్వ పెద్దలు ఆశించినంతగా విజయవంతం కాకపోవడానికి…. ఎం ఎల్ ఏ ల పై ఉన్న వ్యతిరేకతే కారణమనే సూత్రీకరణలు కూడా చూశాం.

వ్యతిరేకత అనేది ఎవరిమీద ఉన్నప్పటికీ, ప్రజల్లోకి స్వేచ్ఛగా వెళ్ళ లేని పరిస్థితి అయితే వైసీపీ లో కొందరికి ఉన్నది కదా! అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది… ఏడాదిన్నర సమయం ఉన్నప్పుడే ఇటువంటి పరిస్థితి ఉండడం నిజంగా ఆశ్చర్యకరమే.

ఇప్పటివరకు – కేంద్రం లోని బీజేపీ పాలకులు… మన రాష్ట్రం లోని వైసీపీ పాలకులకు బాగా అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్నారనే అభిప్రాయమే జనం లో ఉంది. అందువల్ల టీడీపీ ఎంత హడావుడి చేస్తున్నప్పటికీ ; వైసీపీయే మళ్ళీ గెలుస్తుందని, చంద్రబాబు – జన్మ లో సీఎం కాలేరని వైసీపీ ద్వితీయ, తృతీయ, చతుర్ధ స్థాయి నేతలు కూడా వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ఇప్పుడు, బీజేపీ – టీడీపీ పొత్తు పెట్టుకుంటే ; వారి ధైర్యం సడలే అవకాశం ఉంది. అది కూడా టీడీపీ కి పరోక్ష లాభమే!

అసలు – టీడీపీ తో బీజేపీ పొత్తు పెట్టుకోవడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి? తమతో పని లేకుండానే టీడీపీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని కేంద్ర బీజేపీ నేతలు అభిప్రాయ పడుతున్నారా? బీజేపీ తో పొత్తుకు టీడీపీ ముందుగా ప్రయత్నించిందా…. లేక, టీడీపీ తో పొత్తుకు బీజేపీయే ప్రయత్నించిందా? ఎందుకు? వైసీపీ పై బీజేపీ కి ఎందుకు మొహం మొత్తింది? ఏం తక్కువ చేసిందని ? గత మూడేళ్లగా రాష్ట్రం లోని బీజేపీ నేతలు వైసీపీ ప్రభుత్వాన్ని అసలు కింద నడవనివ్వడం లేదుకదా! ఇప్పుడు నానా యాగి చేస్తున్నారెందుకు? ఎక్కడ తేడా వచ్చింది? సీ ఎం జగన్ లో లేనిది ఏమిటి….? చంద్రబాబు లో ఉన్నదేమిటి? ఈ పొత్తేదో వైసీపీ తో ‘అధికారికం’ గా పెట్టేసుకుంటే…. తాను గెలిచి, బీజేపీ ని కూడా వైసీపీ గెలిపించి పెడతుందిగా …. బీజేపీకి రూపాయి ఖర్చు లేకుండా?

అయినా, బీజేపీ నేతలు – చంద్రబాబు చెయ్యి పట్టుకుని ఓ పక్కకు ఎందుకు తీసుకు వెడుతున్నారు? ఒక వేళ టీడీపీ తో పొత్తు పెట్టుకుంటే…. ఈ పొత్తు నుంచి బీజేపీ ఏమి ఆశిస్తున్నది? ఇవే కాదు. ఇలాంటి ప్రశ్నలు మరో పాతిక వరకు ఈ లీకుల చుట్టూ తిరుగుతున్నాయి. దేనికీ సమాధానం లభించడం లేదు. అన్నీ ఊహగానాలే.

ఇప్పటికి ‘సమాచారం’ స్థాయిలోనే ఉన్న ఈ పొత్తు లీకులు – ఒక్కసారి ధ్రువ పడితే మాత్రం ; ఆంధ్ర రాజకీయాలలో పెను మార్పులు చోటు చేసుకోవచ్చు. అవి ఏమిటి… ఎలా… ఎప్పుడు…. ఎందుకు అనేవి తెలియనివారెవ్వరున్నారు రాష్ట్రం లో? తెలియని వారికి ఇప్పుడు చెప్పినా తెలియదు….. రాజకీయ తెర పై చూడడం తప్ప.

– భోగాది వేంకట రాయుడు
@venkata _rayudu

LEAVE A RESPONSE