ఏపీ లో శాసనసభకు ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీడీపీ విజయం సాధించడం ఖాయమన్న మైండ్ సెట్ లోకి టీడీపీ వెళ్ళిపోయింది. ఇందుకు అనేక కారణాలు కనపడుతున్నాయి. సమాజం లోని వివిధ వర్గాలలో వైసీపీ ప్రభుత్వం పట్ల వ్యక్తమవుతున్న అసహనం మొదటి కారణం. ఏ వర్గాలకు తో ఉద్యోగులు, సీపీఎస్ ఉద్యోగులు, నిరుద్యోగుల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తి వంటి పలు కారణాలతో, ఏ సారి అధికారం ఖాయమనే ధీమా టీడీపీ లో కింది నుంచి పైకి కనిపిస్తున్నది.
అనేక అంశాల్లో ఇప్పటికీ క్లారిటీ రావలసి ఉంది. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు. మామూలుగా 2024 ఏప్రిల్, మే వరకు ప్రస్తుత శాసన సభ కాల పరిమితి ఉంది. ‘ముందస్తు’ కు వైసీపీ సుముఖంగా లేదని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గతం లో ‘ ముందస్తు’ కు వెళ్లి, అధికారాన్ని ఆరు నెలలు ముందుగా పోగొట్టుకున్నారు. ఆ సందర్భానికి, ఇప్పటి సందర్భానికి పోలిక లేకపోయినప్పటికీ ; మబ్బుల్లో ఉన్న నీళ్లను చూసి…. చేతిలో ఉన్న చెంబుడు నీళ్లను ముందుగానే ఒలకబోసుకోవడం దేనికి అనే భావన వైసీపీ నేతలు కొందరిలో ఉంది. దానితో పాటు, కేంద్ర బీజేపీ అండదండలు గానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం గానీ 2019 నాటి స్థాయిలో వైసీపీ కి ఏ సారి లభించక పోవచ్చునని టీడీపీ భావిస్తున్నది. ఇలాటి – కొన్ని పైకి చెప్పగలిగిన…. కొన్ని చెప్పడానికి కుదరని కారణాల వల్ల ; తమకు విజయం తధ్యమని టీడీపీ వర్గాల వారు నమ్ముతున్నారు. జగన్ స్వంత నియోజకవర్గం అయినా పులివెందుల లో సైతం టీడీపీ విజయం గురించి చంద్రబాబు నాయుడు ప్రస్థావించే స్థాయిలో టీడీపీ ‘కాంఫిడెన్స్ లెవెల్స్ ‘ ఉన్నాయి.
అయితే, గెలిచాక – మొదటి ప్రాధాన్యం ఏమిటి అనే దానిపై నారా లోకేష్ అంతర్గతంగా సన్నిహితులతో ప్రస్థావిస్తున్నట్టు సమాచారం. వైసీపీ పాలనా కాలంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులపై జరిగిన ‘వివిధ రకాల’ దాడులను విచారించడానికి గానూ జిల్లాకో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ను డిజిగ్నేట్ చేయాలనే ఆలోచనలో లోకేష్ ఉన్నట్టు చెబుతున్నారు. అలాగే, పోలీస్ స్టేషన్ ను ఒక యూనిట్ గా తీసుకుని – ఆ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనల పై విచారణ జరిపించాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇదే అంశాన్ని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో లో సైతం గట్టిగా ప్రస్థావిస్తే, ఓటర్లు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారని కూడా లోకేష్ అభిప్రాయంగా ఉన్నదని అంటున్నారు.
తాను తన తండ్రి అంత మంచివాడిని కాదని ; తమను ఇబ్బంది పెడుతున్న వారిపై ‘దెబ్బకు దెబ్బ’ అన్నట్టుగా తమ ప్రతీకారం తీర్చుకుంటానని లోకేష్ పదే పదే పేర్కొంటున్నారు. ‘టీడీపీ అధికారంలోకి రావడం…. చంద్రబాబు సీ ఎం కావడం…. లోకేష్ ఏదో చేసేస్తాననడం అయ్యే పనులు కావు. మా వ్యూహాలు మాకు ఉండవా ఏంటి?’ అని వైసీపీ నేత ఒకరు… టీడీపీ అంచనాలను తేలిగ్గా తీసిపారేశారు. చూడాలి మరి, ఏపీ కి ఏమి రాసిపెట్టి ఉన్నదో…!

@venkata _rayudu