Suryaa.co.in

Andhra Pradesh

హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడం తెలుగుజాతికే తీరని అవమానం

-ఈ విశ్వవిద్యాలయం నెలకొల్పి 36ఏళ్లు, దానికి ఎన్టీఆర్ పేరుపెట్టి 24ఏళ్లు
-ఇప్పుడు కొత్తగా యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయం తుగ్లక్ చర్య
-హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాలి
– తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపి కంభంపాటి రామమోహన రావు డిమాండ్

ఏపి హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడం హేయమైన చర్య, మరో తుగ్లక్ నిర్ణయం. పిచ్చి ముదిరింది రోకలి తలకు చుట్టండన్నట్లుగా పాలకుల దుశ్చర్యలు ఉన్నాయి. చూడబోతే జేఎన్ టియూకి జవహర్ లాల్ నెహ్రూ పేరు, అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఎన్ జి రంగా పేరు, మహిళా విశ్వవిద్యాలయానికి పద్మావతి అమ్మవారి పేర్లు కూడా మార్చేట్లున్నారు.

తెలుగుజాతి శకపురుషుడు ఎన్టీఆర్. కుల,మతాలకు అతీతంగా అన్నివర్గాలకు ఆరాధ్యుడు. అజాతశత్రువైన ఎన్టీఆర్ పేరు మార్చాలని ఏ ముఖ్యమంత్రి చేయని దుస్సాహసానికి జగన్మోహన్ రెడ్డి తెగించడం తెలుగుజాతికే తీరని అవమానం.

ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యరంగంలో ఎన్టీఆర్ తెచ్చిన సంస్కరణలకు నిదర్శనం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ. వైద్యవిద్యా రంగాన్ని ఆధునీకరించి, అన్ని మెడికల్ కళాశాలలను ఒక గొడుగు కిందకు తేవాలన్న ఎన్టీఆర్ సత్సంకల్పానికి నిలువెత్తు సాక్ష్యం. ఆయన కృషిని చరితార్ధం చేసేందుకే నారా చంద్రబాబు నాయుడు హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరుపెట్టి గౌరవించారు.

ఈ విశ్వవిద్యాలయం నెలకొల్పి 36ఏళ్లు, దానికి ఎన్టీఆర్ పేరుపెట్టి 24ఏళ్లు. అలాంటిది ఇప్పుడు కొత్తగా యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయం గర్హనీయం, వైకాపా ప్రభుత్వ మరో తుగ్లక్ చర్య.
తక్షణమే ఈ పేరుమార్పు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం.

LEAVE A RESPONSE