– ఎమ్మెల్యే కొడాలి నాని, వంశీలకు యూనివర్శిటీ లంపటం
-అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి యార్లగడ్డ రాజీనామా
– పేరు మార్పుపై బీజేపీ నేత కన్నా ఆగ్రహం
– పెదవి విప్పని జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి
– వైసీపీలోని ఎన్టీఆర్ అభిమానుల అసంతృప్తి
– ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్పు తెచ్చిన తంటా
– వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీగా మార్పు
– అసెంబ్లీ, మండలిలో నిరసన వెల్లువ
( మార్తి సుబ్రహ్మణ్యం)
మళ్లీ ఎప్పుడు పుడతావు తాతా.. ఇది ప్రతి ఏటా ఎన్టీఆర్ జయంతి రోజు దివంగత నందమూరి తారకరామారావును ఉద్దేశించి, జూనియర్ ఎన్టీఆర్ ఆర్తితో, ఆవేద నాభరితమై హృదయంతో పత్రికల్లో నిలెవెత్తు పేజీలో ఇచ్చే ప్రకటన.
ఆ మహానుభావుడు లేకపోవడం తెలుగుజాతి దురదృష్టం. కనీసం ఆ పేరును గుర్తు చేసేలా ప్రభుత్వాలు ఏదైనా కార్యక్రమాలు నిర్వహిస్తే ఆయన ఆత్మ శాంతిస్తుంది. తెలుగువారిలో ఆ రకంగా ఆయన సజీవంగా ఉండిపోతారు
– ఎన్టీఆర్ రెండవ భార్య, ఇప్పటి వైసీపీ నాయకురాలయిన లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ ఘాట్ వద్ద వినిపించే రొటీన్ డైలాగుల్లో ఒకటి.
సీన్ కట్ చేస్తే..
ఇప్పుడు ఏపీలో జగనన్న సర్కారు.. కొన్ని దశాబ్దాల నుంచి కృష్ణాజిల్లాలో కొనసాగుతున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చి, వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీగా మార్చేసింది. ఇదంతా రెండురోజుల నుంచి గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ప్రక్రియ. అది ఈరోజున ప్రపంచానికి తెలిసింది. మరి జగనన్న సర్కారు నిర్ణయాన్ని.. ‘మళ్లీ ఎప్పుడు పుడతావు తాతా’ అని ఏడాదికోసారి పత్రికల్లో రోదించే.. జూనియర్ ఎన్టీఆర్, జగనన్న సర్కారుపై యుద్ధం ప్రకటిస్తూ రోడ్డెక్కుతారా? తన రెండో భర్త పేరు తొలగించినందుకు నిరసనగా, వైసీపీలోనే సేదదీరుతున్న ఎన్టీఆర్ రెండో భార్య అయిన లక్ష్మీపార్వతి, సొంత సర్కారే భర్తను అవమానించినందుకు ఆవేదనతో కుమిలిపోతూ, తన పదవికి రాజీనామా చేస్తారా? అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ దారిలోనే లక్ష్మీపార్వతి నడుస్తురా? వీటికిమించి… రోజూ ఎన్టీఆర్ నామస్మరణ చేసే మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సర్కారు నిర్ణయాన్ని స్వాగ తిస్తారా? వ్యతిరేకిస్తారా? ఇదీ ఇప్పుడు రాజకీయ-సామాన్య వర్గాల్లో హాట్‌టాపిక్. అంటే జూనియర్ ఎన్టీఆర్‌కు ఇరకాటం. లక్ష్మీపార్వతితో పాటు ఎన్టీఆర్ భక్తులయిన కొడాలి నాని-వంశీ అండ్ అదర్స్‌కు ప్రాణసంకటమన్నమాట.
దశాబ్దాల క్రితం రైతులిచ్చిన భూముల్లో ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీగా మారుస్తూ తీసుకున్న నిర్ణయం రాజకీయ-సామాన్య వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎన్టీఆర్ హయాంలో రైతుల విరాళాలతో స్థాపించిన ఆ యూనివర్శిటీ పేరు స్థానంలో, ఎలాంటి సంబంధం లేని వైఎస్సార్ పేరు ఎలా పెడతారన్నది ఇప్పుడు జరుగుతున్న రచ్చ లాంటి చర్చ.
ఈ రచ్చ అటు తిరిగి ఇటు తిరిగి జూనియర్ ఎన్టీఆర్- లక్ష్మీపార్వతికి ప్రాణసంకటంలా పరిణమించింది. ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రతిస్పందన కోసం, ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాస్ వైసీపీలో ఉన్నందునే, ఎన్టీఆర్ తనన తాతకు అవమానం జరిగినా మౌనంగా ఉంటున్నారన్న చర్చ జరగుతోంది. మరోవైపు ఆశ్చర్యకరరీతిలో.. వైసీపీ సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, అధికారభాషా సంఘం అధ్యక్షుడయిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తన పదవికి రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది.
ఎన్టీఆర్‌కు బంధువు, రక్తసంబంధీకుడు కాకపోయినా.. ఎన్టీఆర్ వల్ల లబ్థిపొందిన కృతజ్ఞతతో యార్లగడ్డ తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశమయింది. అసలు ఎన్టీఆర్‌తో ఎలాంటి సంబంధం లేని, అధికారపార్టీలో ఉన్న యార్లగడ్డ లాంటి వ్యక్తి స్పందించి తన పదవికి రాజీనామా చేస్తే.. ఎన్టీఆర్‌కు భార్య అయిన లక్ష్మీపార్వతి, ఆయన మనుమడు జూనియర్ ఎన్టీఆర్ గానీ ఇప్పటిదాకా స్పందించకపోవడమే ఎన్టీఆర్ అభిమానులను వేధిస్తోంది.
ప్రధానంగా.. అటు ఎన్టీఆర్ అభిమానులలో గానీ, ఇటు టీడీపీ అభిమానులలో గానీ జూనియర్ ఎన్టీఆర్‌కు క్రేజ్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ కూడా, తానే ఎన్టీఆర్‌కు అసలైన వారసుడిని అన్నట్లు.. ఈ కట్టె కాలేవరకూ తెలుగుదేశం పార్టీలోనే ఉంటానన్నట్లు ప్రకటనలు ఇస్తుంటారు. అయితే.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చి, దాని స్థానంలో వైఎస్ పేరు పెట్టినా.. అటు ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి గానీ- ఇటు మనుమడయిన జూనియర్ ఎన్టీఆర్ గానీ ఖండించకపోవడాన్ని ఎన్టీఆర్ అభిమానులు మండిపడుతున్నారు. ఎన్టీఆర్‌పై అభిమానంతో యార్లగడ్డ ఏకంగా, తన నామినేటెడ్ పోస్టుకూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తే… అదే జగన్ ప్రభుత్వంలో, అదే స్థాయి నామినేటెడ్ పోస్టు అనుభ విస్తున్న.. దివంగత ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి, ఇప్పటిదాకా తన పదవికి రాజీనామా చేయకపోవడంపై.. ఇంటా-బయటా విస్మయం వ్యక్తమవుతోంది.
ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఎన్టీఆర్ జీవించినంతకాలం ఆయన విధానాలపై అసెంబ్లీలో విరుచుకుపడిన మాజీ మంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడయిన కన్నా లక్ష్మీనారాయణ కూడా.. హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పును వ్యతిరేకించారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పేర్లు మారుస్తారా? అని జగన్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా తాతంటే ప్రాణమని చెప్పే జూనియర్ ఎన్టీఆర్.. హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై మీడియా ముందుకు రాకపోయినా, ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తున్నట్లు కనీసం పత్రికాప్రకటన కూడా ఇవ్వకపోవడం, ఎన్టీఆర్ అభిమానులను నివ్వెరపరుస్తోంది. నిజానికి ఈ నిర్ణయం వెలువడిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్, జనంలోకి వెళ్లి రోడ్డెక్కుతారని ఆయన అభిమానులు భావించారు. కానీ ఆయనలో ఎలాంటి చలనం లేకపోవడం, ట్విట్టర్లో కూడా ఎక్కడా ఖండన కనిపించకపోవడం బట్టి.. ఆయనకు తాత ఎన్టీఆర్‌పై ఉన్నదంతా ఉత్తుత్తి పబ్లిసిటీ ప్రేమ తప్ప, నిజంగా ఎన్టీఆర్ ప్రతిష్ఠపై ఆయనకెలాంటి చిత్తశుద్ధి లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాతా..మళ్లీ ఎప్పుడు పుడతావు అని ప్రశ్నించే జూనియర్ ఎన్టీఆర్.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు తొలగించి మా తాతను ఎందుకు అవమానిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడమే ఇక్కడ వింత!
అటు నిత్యం ఎన్టీఆర్ పేరు జపించే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వంశీ కూడా ఎన్టీఆర్ హెల్త్‌వర్శిటీ పేరు మార్పుపై ఇప్పటిదాకా స్పందించిన దాఖలాలు లేవు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగించాలని డిమాండ్ చేసే కొడాలి నాని.. ఇప్పుడు తన ప్రభుత్వం ఏకంగా ఎన్టీఆర్ పేరునే తొలగించినా నాని కిమ్మనకపోవడమే విచిత్రం.
ఇప్పుడు అందరి చూపూ ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతిపైనే ఉన్నాయి. తన భర్త ఎన్టీఆర్‌కు జరిగిన అవమానానికి నిరసనగా, ఆమె పార్టీ-ప్రభుత్వ పదవికి రాజీనామా చేస్తారా? లేక అక్కడే ఉండి జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆమోదిస్తారా? అన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. అయితే ఎన్టీఆర్ అభిమానులు మాత్రం.. ఆమె తన పదవికి-పార్టీకి రాజీనామా చేసి, యార్లగడ్డ బాటలో నడవాలని డిమాండ్ చేస్తున్నారు. చూడాలి.. ఆమె ఎలా స్పందిస్తారో?!
మరోవైపు మాజీ మంత్రి ఆలపాటి రాజా సంధించిన విమర్శనాస్త్రం ఆసక్తికరంగా మారింది. ‘జగన్‌రెడ్డి సేవలో తరిస్తున్న లక్ష్మీపార్వతి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, జాస్తి చలమేశ్వర్, లావు రత్తయ్య ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్పుపై స్పందించాల’ని రాజా చేసిన ట్వీట్ పరిశీలిస్తే.. వారిపై ఏ స్థాయిలో ఒత్తిళ్లు ఉన్నాయన్నది స్పష్టమవుతుంది.
అది రైతుల స్థలం, సర్కారుది కాదు: వెలగపూడి
‘‘అసలు ఆ యూనివర్శిటీ స్థాపనలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. తమ లాంటి రైతులంతా సిద్ధార్థ అకాడెమీకి భూమి విరాళంగా ఇచ్చాం. కొంత భూమి కొని, బిల్డింగులు కూడా కట్టించాం. అప్పట్లో అంతా కలసి దాదాపు 3 ఎకరాల్లో నిర్మించినట్లు గుర్తు. ఎన్టీఆర్ సీఎం కాగానే అక్కడి వచ్చారు. ఆ సందర్భంగా ఆయన మాతో ఒక్కమాట కూడా చెప్పకుండా, దీనిని ప్రభుత్వం తీసుకుంటుందని ప్రకటించారు. అప్పుడు మేమంతా ఆయనతో దెబ్బలాడాం. వెంటనే ఆయన దీనికి మెడికల్ కాలేజీ కూడా ఇస్తున్నాం అని చెప్పారు. ఆరకంగా దానిని ప్రభుత్వపరం చేసి, యూనవర్శిటీ స్టేటస్ ఇచ్చారు. తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ పేరు పెట్టారు. ఇప్పుడేమో ఆ యూనివర్శిటీతో ఎలాంటి సంబంధం లేని సీఎం జగన్, ఆయన తండ్రి పేరు పెట్టడం అభ్యంతకరం. మాకు వైఎస్‌పై ఎలాంటి వ్యతిరేకత లేదు. నేనూ ఆయనతో సన్నిహితంగా ఉండేవాడిని. కానీ మహానుభావుడు ఎన్టీఆర్ పేరు తొలగించడాన్నే వ్యతిరేకిస్తున్నాం. వైఎస్ పేరు కావాలంటే మరొక చోట పెట్టుకునే వీలుంది కదా’ అని అమరావతి జేఏసీ నేత, హిందూమహాసభ రాష్ట్ర అధ్యక్షుడు వెలగపూడి గోపాలకృష్ణ వ్యాఖ్యానించారు.