– కృష్ణంరాజు పేరిట రెండెకరాల్లో స్మృతివనం
– కృష్ణంరాజు ఇంటికెళ్లి ప్రకటించిన రోజా
– రఘురామరాజుకు అవమానం, కృష్ణంరాజుకు బహుమానమా?
– అంత ప్రేమ ఉంటే ప్రసాదరాజుకు మంత్రి పదవి ఇవ్వలేదేం?
– ఉన్న శ్రీరంగనాధరాజును మంత్రి పదవి నుంచి ఎందుకు తప్పించారు?
– కృష్ణంరాజు మృతదేహానికి నివాళులర్పించని జగన్
– ఇప్పటివరకూ ఆయన కుటుంబాన్ని పరామర్శించలేదేం?
– గోదావరి రాజులు స్మతివనం ఏర్పాటు లక్ష్యాన్ని నమ్ముతారా?
– ఇదంతా ప్రభాస్ కోసమేనన్న ప్రచారం
– రాజులు వైకాపా బుట్టలో పడతారా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీ కుల రాజకీయాల్లో భాగంగా ఇక రాజుల రాజకీయం మొదలయింది. ఉభయ గోదావరి జిల్లాల్లో రాజకీయాలను ప్రభావితం చేసే రాజులపై, వైసీపీ వల వేసినట్లు కనిపిస్తోంది. రెబెల్‌స్టార్ దివంగత కృష్ణంరాజు సంస్మరణార్ధం ఆయనకు రెండు ఎకరాల్లో స్మృతివనం ఏర్పాటుచేసేందుకు, జగనన్న సర్కారు సిద్ధమయింది. ఆ మేరకు పర్యాటక శాఖ మంత్రి రోజా, మొగల్తూరులోని కృష్ణంరాజు ఇంటికి వెళ్లి మరీ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించడంతో రాజుల రాజకీయానికి తెరలేచినట్టయింది.
దీనితో రాజుల రాజకీయానికి తెరలేచినట్టయింది. నిజానికి ఉభయ గోదావరిలో రాజుల శాతం అతి తక్కువే అయినప్పటికీ, కోస్తాలో కమ్మ-కాపు, రాయలసీమలో రెడ్డి కులం మాదిరిగా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ ప్రభావితం చేసే సామాజివర్గమన్నది బహిరంగ రహస్యం. కమ్మ వర్గం మాదిరిగా రాజులు కూడా.. వ్యవసాయ-వ్యాపార- సినిమా-ఫైనాన్స్ రంగాల్లో రాణిస్తున్నారు. అన్ని సామాజికవర్గాలతో సత్సంబంధాలున్న రాజులు ఏ పార్టీలో ఉన్నా, అంతా ఒక్కతాటిపైనే నడుస్తుంటారు. అందుకే నర్సాపురం నియోజకవర్గాల్లో అతి కొద్ది సందర్భాల్లో తప్ప, మిగిలిన ప్రతి ఎన్నికల్లోనూ రాజులే ఎంపీగా ఎన్నికవుతున్న చరిత్ర చూస్తున్నదే.
తాజాగా రెబెల్‌స్టార్ కృష్ణంరాజు స్మతివనం ఏర్పాటుద్వారా.. ఉభయ గోదావరి జిల్లాలతోపాటు, విశాఖ-విజయనగరం జిల్లాల్లోని రాజులను మెప్పించాలన్న వ్యూహం, జగన్ సర్కారులో స్పష్టంగా కనిపిస్తోంది. కృష్ణంరాజు స్మతివనం ఏర్పాటుచేయడం మంచి ఆలోచనే. కానీ దాని వెనుక ఉన్న రాజకీయ లక్ష్యమేమిటన్నది తెలియనంత అమాయకులు కాదు రాజులు. తమ వర్గీయుడి పేరిట స్మృతివనం ఏర్పాటుచేశారన్న ఆనందంతో రాజులంతా గంపగుత్తగా వైసీపీకి జై కొడతారనుకోవడం భ్రమేనంటున్నారు. కృష్ణంరాజుకు మంచిపేరే ఉన్నప్పటికీ, క్షత్రియవర్గం మొత్తాన్ని ప్రభావితం చేసేంత ఇమేజ్ ఆయన సంపాదించుకోలేకపోయారన్నది క్షత్రియుల విశ్లేషణ.

ఎందుకంటే.. ఇటీవల భీమవరంలో ప్రధాని హాజరయిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు , నర్సాపురం మాజీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి అయిన కృష్ణంరాజును కాకుండా.. ఆ తర్వాత కేంద్రమంత్రిగా చేసిన చిరంజీవిని ఆహ్వానించిన వైనంపై, క్షత్రియులు అప్పుడే అసంతృప్తి వ్యక్తం చేశారు. తర్వాత ఎమ్మెల్యే ప్రసాదరాజుకు మంత్రి పదవి ఇవ్వని వైనంపైనా, ఆ వర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది.
కులాభిమానాన్ని కాదని, ఎంపీ రఘురామకృష్ణంరాజును విమర్శించినప్పటికీ ప్రసాదరాజు సేవలకు ప్రతిఫలం దక్కకపోవడం, అప్పటివరకూ ఉన్న ఒకే ఒక్క శ్రీరంగనాధరాజును కూడా మంత్రివర్గం నుంచి తొలగించి, ఒక్క రాజుకూ మంత్రివర్గంలో చోటు ఇవ్వని వైనంపై క్షత్రియ సామాజికవర్గం ఇప్పటికీ అసంతృప్తితో రగిలిపోతోంది. నిజంగా క్షత్రియులపై అంత అభిమానం ఉంటే, మంత్రివర్గంలో తమకు ఎందుకు చోటు కల్పించలేదని క్షత్రియవర్గం ఇప్పటికీ ప్రశ్నిస్తోంది.
ప్రధానంగా.. కృష్ణంరాజు మృతి చెందినప్పుడు, సీఎం జగన్ హైదరాబాద్ వెళ్లి ఆయన భౌతికకాయానికి నివాళి అర్పించని వైనాన్ని క్షత్రియ వర్గం ప్రశ్నిస్తోంది. కృష్ణంరాజు కోసం రెండెకరాల్లో స్మృతివనం ఏర్పాటు చేస్తానంటున్న ప్రభుత్వం.. ఆయన మృతి చెందినప్పుడు హైదరాబాద్‌కు వెళ్లకపోవడంతో పాటు.. ఇప్పటివరకూ కనీసం ఆయన కుటుంబాన్ని పరామర్శించని వైనాన్ని క్షత్రియ వర్గం గుర్తుచేస్తోంది. ఇవన్నీ ప్రభాస్‌ను దరికి తీసుకువచ్చే రాజకీయ ఎత్తుగడేనన్నది వారి అనుమానం.
ఇక నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును నియోజకవర్గానికి రానీయకుండా, ఆయనను వేధిస్తున్న వైనంపై ఇప్పటికీ క్షత్రియ సమావేశాల్లో ఆగ్రహం వ్యక్తనమవుతూనే ఉంది. ప్రధానంగా ఆయనను అరెస్టు చేసి, కొట్టిన ఘటనపై రాజులు ఆగ్రహంతో రగిలిపోయారు. ఒకవైపు రఘురామకృష్ణంరాజును అవమానిస్తూ, మరో వైపు కృష్ణంరాజును ఆకాశానికెత్తి స్మతివనం ఏర్పాటుచేస్తామనడాన్ని క్షత్రియ వర్గం నమ్మలేకపోతోంది.
ప్రధానంగా రఘురామకృష్ణంరాజును వైసీపీ లక్ష్యంగా చేసుకున్న తర్వాత జరుగుతున్న ప్రతి క్షత్రియవర్గ అంతర్గత సమావేశాల్లో, ప్రభుత్వ తీరును క్షత్రియ పెద్దలు నిరసిస్తూనే ఉన్నారు. అయితే వైసీపీ అధికారంలో ఉన్నందున, తామేమీ చేయలేకపోతున్నామని, ఆ పార్టీలో ఉన్న క్షత్రియ నేతలు కూడా తమ నిస్సహాయత వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
వెలమ వర్గం మాదిరిగానే.. జనాభా సంఖ్య తక్కువ ఉండే రాజుల్లో ఐకమత్యం ఎక్కువ. తెలంగాణలో కూడా వెలమ సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, అన్ని పార్టీల్లో ఉండే వారంతా ఒకేమాట మీదుంటారు.
వారంతా ఏ పార్టీల్లో ఉన్నప్పటికీ, ప్రధానమైన అంశాల్లో మాత్రం ఒక్కమాట మీద ఉంటారు. వైసీపీపై తిరుగుబాటు బావుటా ఎగరవేసిన తర్వాత.. హైదరాబాద్, ఢిల్లీలోని రఘురామకృష్ణంరాజు నివాసాలకు భారీ స్ధాయిలో తరలివెళ్లారు.
అక్కడ గోదావరి జిల్లాల రాజులు ఆయనకు మద్దతు ప్రకటించారంటే, రాజుల రాజకీయం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. మళ్లీ వీరిలోనే చాలామంది రాజులు, రఘురామకృష్ణంరాజును విమర్శిస్తూ ప్రెస్మీట్లు పెట్టడం మరో ఆశ్చర్యం. ఇప్పటికీ ఉభయ గోదావరి జిల్లాల్లో చాలామంది క్షత్రియు యువకులు, తమ సెల్ఫోన్లలో రఘురామకృష్ణంరాజు ఫొటోను డీపీగా పెట్టుకోవడం ప్రస్తావనార్హం.