-టీ.ఆర్.ఎస్ నుంచి బీ.ఆర్.ఎస్. గా పేరు మార్చుతూ.. కేంద్ర ఎన్నికల కమిషన్ కు సమాచారాన్ని అందించిన వినోద్ కుమార్
-ఈ మేరకు పార్టీ తీర్మానం కాపీలు, సంబంధిత పత్రాలను కేంద్ర ఎన్నికల కమిషన్ కు అందజేసిన వినోద్ కుమార్
-బీ.ఆర్.ఎస్. ఎన్నికల గుర్తు ” కారు” , పార్టీ జెండా రంగు ” గులాబీ ” లు యధాతధంగా ఉంటాయి
-కొత్తగా పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు
-ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీఆర్ఎస్ గుర్తింపు పొందిన పార్టీ
-కేంద్ర ఎన్నికల కమిషన్ చట్టం ప్రకారం కేవలం పేరు మాత్రమే మార్చుకున్నాం
– న్యూ ఢిల్లీలో బోయినపల్లి వినోద్ కుమార్
టీ.ఆర్.ఎస్. నుంచి బీ.ఆర్.ఎస్. గా పేరు మార్చుతూ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధ్యక్షతన పార్టీ చేసిన తీర్మానం కాపీలు, సంబంధిత పత్రాలను కేంద్ర ఎన్నికల కమిషన్ కు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అందజేశారు.
న్యూ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్ లో ఉన్నతాధిారులతో సమావేశమై ఈ మేరకు సంబంధిత పత్రాలను వినోద్ కుమార్ అందజేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి ( టీ.ఆర్.ఎస్ ) నుంచి భారత రాష్ట్ర సమితి ( బీ.ఆర్.ఎస్ ) గా పేరు మాత్రమే మార్చామని, కొత్తగా ఎన్నికల కమిషన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.
పార్టీ పేరు మార్చుకునే హక్కు ఆయా పార్టీలకు ఉంటుందని, ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ చట్టంలోని సెక్షన్ 29 A సబ్ క్లాజ్ 9 ప్రజా ప్రాతినిధ్య చట్టం చెబుతోందని వినోద్ కుమార్ అన్నారు. పార్టీ పేరు మార్చుకున్నప్పుడు ఆ విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ కు లిఖిత పూర్వకంగా సమాచారాన్ని అందజేయాల్సి ఉంటుందని, అందులో భాగంగానే కేంద్ర ఎన్నికల కమిషన్ కు సమాచారాన్ని ఇచ్చామని వినోద్ కుమార్ తెలిపారు. బీ.ఆర్.ఎస్. పార్టీ గుర్తు ” కారు “, జెండా రంగు ” గులాబీ ” అలాగే ఉంటాయని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీ.ఆర్.ఎస్. గుర్తింపు పొందిన పార్టీ అని, ఇక నుంచి జాతీయ స్థాయిలో పార్టీ అధికారికంగా విస్తృత స్థాయిలో పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తుందని వినోద్ కుమార్ వివరించారు. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి, ప్రజా ఉద్యమాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని, ప్రజల ఆశీర్వాదాలతో సీఎం గా కేసిఆర్ బాధ్యతలను చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారని , రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్, కేంద్ర మంత్రులు అభినందించిన విషయాన్ని వినోద్ కుమార్ గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రం సాధించిన అనేక రంగాల్లో విజయాలు సాధించినట్లుగానే.. దేశాన్ని కూడా అదే మార్గంలోకి తీసుకెళ్లేందుకు సీఎం కేసిఆర్ ప్రణాళికా బద్దంగా ముందుకు సాగనున్నారని వినోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ కార్యదర్శి ప్రొఫెసర్ ఎం. శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు.