పోలవరం, పోతిరెడ్డిపాడుకు తొలగిన అడ్డంకి..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తన కార్య క్షేత్రాన్ని తెలంగాణ నుంచి దేశ స్థాయికి విస్తృత పరుచు కోవడం తో పోలవరం ప్రాజెక్ట్ కు తలనొప్పి తగ్గినట్టుగా భావించవచ్చు. పోలవరం ముంపు ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని, ఆంధ్ర లో కలిపిన ఏడు తెలంగాణ రెవిన్యూ మండలాలను తిరిగి తెలంగాణ లో కలపాలని టీ ఆర్ ఎస్ నేతలు డిమాండ్ చేస్తూ వచ్చారు. ఇక, ఇప్పుడు డిమాండ్ చేయక పోవచ్చు. ఆంధ్ర కూడా కేసీఆర్ చెబుతున్న భారత్ లోదే కనుక, ఆ ప్రాంత రైతుల క్షేమం కూడా తన క్షేమమే కనుక, ఈ విషయం లో టీ ఆర్ ఎస్ నేతలు మౌనం పాటించ వచ్చు.

అలాగే, పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ కు శ్రీ శైలం బ్యాక్ వాటర్స్ నుంచి నీరు తీసుకెళ్లడాన్ని కూడా ఆయన గతం లో లాగా వ్యతిరేకంచక పోవచ్చు. రాయలసీమ కూడా భారత్ లోదే కనుక. అలాగే, నీళ్లు… నిధులు… ఉద్యోగాలు ఆంధ్ర వాళ్ళు తన్నుకు పోయారంటూ ఏకపక్ష ప్రచారానికి టీ ఆర్ ఎస్ తెగబడక పోవచ్చు. అందరూ భరత్ మాత ముద్దు బిడ్డలే గనుక.

అలాగే, వైసీపీ… టీడీపీ ల పై ‘ ఆంధ్ర పార్టీలు ‘ అని ముద్ర వేసే అవకాశం లేదు. బీ ఆర్ ఎస్ ఆంధ్ర వెళ్ళాలి అనుకుంటున్నట్టే ; వైసీపీ, టీడీపీ కూడా స్వేచ్ఛగా, దర్జాగా తెలంగాణ లోకి అడుగు పెట్టవచ్చు. ఓపిక కొద్దీ చెలరేగి పోవచ్చు. అలాగే, తెలంగాణ లో తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న డాక్టర్ వై ఎస్ కుమార్తె షర్మిలను ప్రాంతీయత ప్రాతిపదికగా విమర్శించడానికి ఎవరూ సరిపోరు.

ఈ సారి తెలంగాణ లో 2023 లో జరగవలసి ఉన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పాటు ; టీడీపీ -బీజేపీ, వైసీపీ, వైటీపీ, కమ్యూనిస్టు పార్టీలు కూడా పోటీ చేస్తాయి. ఈ ఎన్నికల్లో ఇంత మంది ప్రత్యర్ధ పార్టీలను ఎదుర్కొంటూ బీఆర్ఎస్ విజయం సాధించాల్సి ఉంటుంది.

– భోగాది వేంకట రాయుడు
@venkata _rayudu

Leave a Reply