Suryaa.co.in

Andhra Pradesh

రామోజీకి మంత్రి పెద్దిరెడ్డి సవాల్

– దమ్ముంటే స్మార్ట్ మీటర్ల టెండర్లలో ఈనాడు రామోజీ పాల్గొనాలి
– “రైతు చేనుకు కడప మీటరు” అంటూ రద్దు చేసిన టెండర్లపై ఈనాడు తప్పుడు రాతలు
– సీఎం జగన్ టార్గెట్ గా.. రోజూ ఈనాడు అబద్ధపు రాతలు
– రైతులను తప్పుదారి పట్టించేందుకే ఈనాడు రాతలు
– ఉరితాళ్ళు అంటూ రైతుల ముసుగులో టీడీపీ దుష్ప్రచారం
– స్మార్ట్ మీటర్ల వైపే రాష్ట్ర రైతాంగం మొగ్గు
– పచ్చి అబద్ధాలను వండి వార్చడమే ఈనాడు రామోజీ విధానం
– వయసు పెరిగినా.. కుట్రలు, కుతంత్రాలను రామోజీ మానలేదు
– టీడీపీ హయాంలో ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోయినా దిక్కూమొక్కూ ఉండేది కాదు
– అదే మా ప్రభుత్వ హయాంలో 48 గంటల్లోనే ట్రాన్స్ ఫార్మర్లు మారుస్తున్నాం
– రైతుల ఆత్మహత్యలను హేళన చేసింది చంద్రబాబే
– రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

పనికట్టుకుని అబద్ధపు రాతలు
వైయస్ఆర్ సిపి ప్రభుత్వంపైనా, సీఎం వైయస్ జగన్ పైన పనికట్టుకుని బురదచల్లే కార్యక్రమంలో భాగంగానే ఈనాడు రామోజీరావు “రైతు చేనుకు కడప మీటరు” అనే హెడ్డింగ్ తో మరో తప్పుడు కథనాన్ని రాయించారని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్రసాంకేతిక, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. తిరుపతిలోని క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ఈ ప్రభుత్వంపై అక్కసుతో నిత్యం అబద్దపు కథనాలను ప్రచారంలోకి తీసుకువస్తున్న ఈనాడు పత్రిక మరోసారి స్మార్ట్ మీటర్ల పై వక్రీకరణ కథనాన్ని వండి వార్చిందని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. “రాష్ట్రంలో ఒక్కో స్మార్ట్ మీటరుకు రూ.35 వేలు వెచ్చించి, మొత్తంగా మూడు డిస్కంల పరిధిలో 18.61 లక్షల స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు రూ. 6,173 కోట్లు వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని, ఇదో భారీ స్కామ్ ” అంటూ గతంలోనే రద్దు చేసిన టెండర్లపై ఈనాడు తప్పుడు రాతలను మంత్రి పెద్దిరెడ్డి తీవ్రంగా ఖండించారు. కోవిడ్ సమయంలో రూపొందించిన ఈ టెండర్ అంచనాలను తరువాత సమీక్షించుకుని, వాటిల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయని గ్రహించి గతంలోనే వాటిని రద్దు చేశామని స్పష్టం చేశారు. ఈ విషయం ఈనాడు రామోజీరావుకు కూడా తెలుసునని, అయినా రైతుల్లో ఒక గందరగోళం సృష్టించాలనే ఇటువంటి కథనాలను రాసి, తద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకురావాలనే తన విధానంలో భాగంగా, రోజుకో అబద్ధాన్ని స్టోరీగా రాస్తున్నారు. అందులో భాగంగానే ఈ స్టోరీ కూడా రాశారని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు.

మీటర్ల ఖర్చు రూ. 1150 కోట్లే..
గతంలో రద్దు చేసిన టెండర్ అంచనాలతో ఇప్పుడు టెండర్లు నిర్వహిస్తున్నారంటూ, వాస్తవాలు తెలిసి కూడా ఈనాడు ప్రతిక తప్పుడు కథనాన్ని ప్రచురించిందని మండిపడ్డారు. స్మార్ట్ మీటర్ల కోసం కొత్త అంచనాల ప్రకారం.. ఒక్కో మీటరు రూ. 6వేలతో మొత్తం రూ.1150 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నాం అని స్పష్టం చేశారు. స్మార్ట్ మీటర్ కు అనుబంధ పరికరాలు, నిర్వహణకు రూ.29వేలు ఖర్చుఅవుతోందంటూ ఈనాడు రాసిన వార్తలో ఎటువంటి నిజం లేదు అన్నారు. బాబు చేయలేకపోయినది జగన్ గారి హయాంలో జరుగుతుంటే, రైతులకు తప్పుడు సమాచారం ఇచ్చి, వారిని గందరగోళానికి గురిచేసేందుకు చంద్రబాబు తరఫున వకాల్తా పుచ్చుకుని ఈనాడు రామోజీ ప్రభుత్వంపై తప్పుడు రాతలు రాస్తున్నారని ధ్వజమెత్తారు.

రైతులకు మేలు చేస్తున్నామనే అక్కసుతోనే..
ఏటా రైతన్నకు తోడుగా, రైతు భరోసా ద్వారా కానివ్వండీ, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు ద్వారా కానివ్వండీ, ఎటువంటి అవకతవకలు, లంచాలు లేకుండా, రైతుకు అందాల్సిన నష్టపరిహారం కానివ్వండీ, ఒక్క రూపాయి కూడా ప్రీమియంగా కట్టించుకోకుండా, మొత్తం ప్రభుత్వమే భరించి ఇస్తున్న పంటల బీమా కానివ్వండీ, నిరంతరాయంగా 9 గంటలు కొత్త ఫీడర్లు ఏర్పాటు చేసి ఇస్తోన్న ఉచిత విద్యుత్ కానివ్వండీ, వీటన్నింటితోపాటు రైతు కుటుంబాలకు అందుతున్న నవరత్నాలు కానివ్వండీ… ఇవన్నీ చంద్రబాబు హయాంలో లేవన్న విషయం రైతు గమనించాడు. ఈనాడు కూడా గమనించింది. రామోజీరావు అసలు బాధ అంతా ఇక్కడే ఉంది. తాను మద్దతు ఇస్తున్న చంద్రబాబు చేయలేకపోయింది వైయస్ జగన్ గారి హయాంలో జరుగుతుంటే రామోజీరావు భరించలేక పోతున్నాడు. వయస్సు మీద పడుతున్నా రామోజీరావులో కుట్రలు, కుతంత్రాలు చేసే నైజం మాత్రం మారడం లేదు.

రామోజీకి సవాల్..
నేను మంత్రిగా సవాల్ చేస్తున్నాను. స్మార్ట్ మీటర్లకు సంబంధించిన టెండరును మరో వారం పొడిగిస్తున్నాం. జ్యుడీషియల్ ప్రివ్యూ తరువాత మీ పత్రికలోనే తేదీలను కూడా ప్రకటిస్తాం. రామోజీరావు, నేరుగా ఈ టెండర్ లో పాల్గోవాలని అడుగుతున్నాం. వారం రోజులు గడువు ఇస్తున్నాం. రామోజీరావు, లేదా ఆయన బలపరుస్తున్న చంద్రబాబు, ఆయన అనుచరులు ఈ టెండర్లలో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాం. దమ్ముంటే టెండర్లలో పాల్గొనండి. తక్కువ ధరకు మీరు బిడ్ వేస్తే.. మీకే టెండర్ సొంతమవుతుంది. అబద్ధపు రాతలతో ప్రజలను ఎంతోకాలం మోసం చేయలేరు.

48 గంటల్లోనే ట్రాన్స్ ఫార్మర్లను రీప్లేస్ చేస్తున్నాం
గతంలో, టీడీపీ ప్రభుత్వంలో ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోయాయని రైతుల నుంచి ఎడాపెడా కంప్లైంట్లు ఉండేవి. చంద్రబాబు హయాంలో వేల ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోయినా, వాటిని మార్పించే దిక్కు ఉండేది కాదు. ఇప్పుడు మా ప్రభుత్వం, ట్రాన్స్ ఫార్మర్లు కాలితే.. 48 గంటల్లోనే ట్రాన్స్ ఫార్మర్లను రీప్లేస్ చేయాలని షరతు విధించాం. దానిని నిక్కచ్ఛిగా అమలు చేస్తున్నాం. అన్ని డిస్కమ్ ల వద్ద రిజర్వు స్టాక్ ఉంచుతున్నాం. రైతుకు ఎక్కడా ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.

స్మార్ట్ మీటర్లపై రైతుల ముసుగులో టీడీపీ దుష్ప్రచారం
నాణ్యమైన విద్యుత్ సరఫరా, పారదర్శకత, జవాబుదారీతనం కోసమే స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎంత విద్యుత్ వాడుతున్నారో కచ్చితంగా తెలియడం వల్ల దీనికి అవసరమైన కెపాసిటీ ఉన్న ట్రాన్స్ ఫార్మర్లు పెట్టేందుకు అవకాశం ఉంటుంది. మీటర్లు ఏర్పాటు వల్ల రైతులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. వ్యవసాయానికి వినియోగించే విద్యుత్ చార్జీలను డిబిటి ద్వారా నేరుగా రైతు ఖాతాలకే జమ చేయాలని సీఎం వైయస్ జగన్ నిర్ణయించారు. దీనివల్ల రైతులు నేరుగా తమ ఖాతాలో జమ అయిన డబ్బును రైతులు డిస్కం లకు చెల్లిస్తారు. ఫలితంగా డిస్కంలు రైతుకు జవాబుదారీతనంగా ఉంటాయి. నాణ్యమైన విద్యుత్ కోసం రైతుకు ప్రశ్నించే అధికారం ఉంటుంది. నిరంతరాయంగా విద్యుత్ కోసం డిస్కంలను డిమాండ్ చేసే హక్కు రైతు పొందుతారు. అలాగే డిస్కంలపై కూడా బాధ్యత, జవాబుదారీతనం పెరుగుతుంది. పైలెట్ ప్రాజెక్ట్ గా శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ కనెక్షన్ లకు విద్యుత్ మీటర్లు బిగించడం వల్ల 33శాతం వరకు విద్యుత్ ఆదా జరిగినట్లు గుర్తించాం. దీనిని రాష్ట్రం అంతా అమలు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందుకు రైతుల నుంచి కూడా స్వచ్ఛందంగా మద్దతు లభిస్తోంది. ఈ మంచి పనిని కూడా ఓర్వలేక రైతుసంఘాల ముసుగులో తెలుగుదేశం నాయకులు స్మార్ట్ మీటర్లు రైతులకు నష్టం చేస్తాయంటూ, ఉరితాళ్ళు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీటర్లకు రైతాంగం నుంచి సానుకూలత వ్యక్తమవుతోంది. 95 శాతం మంది రైతులు అకౌంట్లను ఏర్పాటు చేసుకున్నారు. మిగిలినవారు కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వారు, అదికూడా ఇక్కడ భూములు ఉండి విదేశాల్లో స్థిరపడిన రైతులే.

రైతుల ఆత్మహత్యలను ఎగతాళి చేసింది బాబే
ఇటువంటి పరిపాలన ఇంతకుముందు చంద్రబాబు ఏనాడైనా అందించాడా.. ?. గతంలో చంద్రబాబు పాలన వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. అవన్నీ మానసిక రుగ్మతల వల్లే జరిగాయని ఆనాడు సిగ్గు లేకుండా రైతుల మరణాలను కూడా ఎగతాళి చేశాడు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో అందుతున్నట్టు, రైతుకు తోడ్పాటు ఇంతగా గతంలో ఎప్పుడైనా అందిందా..? అని ప్రశ్నించారు. ఇలాంటి అంశాలను మరుగునపరచడమే కాకుండా, నాలుగేళ్ళుగా పడుతున్న వర్షాలు కూడా చంద్రబాబుకి, రామోజీరావుకి చాలా బాధను కలిగిస్తున్నాయి. కాబట్టే ఈ తప్పుడు రాతలు రాస్తున్నారన్నారు.
చివరిగా మరోసారి సవాల్ చేస్తున్నాను. పారదర్శకంగా, ఎటువంటి అవినీతి లేకుండా, కరెంటు మీటర్లకు, ఆ మీటర్ల మెయింటనెన్స్ కు టెండర్లు పిలుస్తున్నాం. రామోజీరావునే నేరుగా టెండర్ వేయాల్సిందిగా కోరుతున్నాము. దమ్ముంటే, మా సవాల్ ను స్వీకరించాలని అని మంత్రి పెద్దిరెడ్డి ఛాలెంజ్ విసిరారు.

LEAVE A RESPONSE