Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఆనారోగ్యశ్రీగా మారిన ఆరోగ్యశ్రీ

– ఆరోగ్యశ్రీ అమలుపై జగన్ రెడ్డి నోట అబద్ధాల మూట
– టిడిపి అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ

జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పథకం అనారోగ్యశ్రీ గా మారిందని టిడిపి అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ తెలిపారు. శనివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని కోట్ల రూపాయలతో ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకంపై ప్రకటనలు చేసింది. మాటలు కొండంత చేతలు గోరంత అనే రీతిలో జగన్ రెడ్డి ప్రభుత్వం ఉంది. సాక్షి కి పెద్ద ఎత్తున ప్రకటనలు ఇవ్వడానికే ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. రాష్ట్రంలో సామాన్యులకు వైద్యం అందని ద్రాక్షలా మారింది. ఏ ఆసుపత్రికి వెళ్లినా డాక్టర్లు ఉండరు. డాక్టర్లు ఉంటే మందులు ఉండవు. మందులుంటే వైద్య పరికరాలుండవు. కొన్నిచోట్ల వైద్యపరికరాలు మూలన పడ్డాయి.

జగన్ ప్రభుత్వం సామాన్యులను ప్రభుత్వ వైద్యశాలలకు వెళ్లకుండా చేసింది. ప్రభుత్వం ఈ మూడున్నర సంవత్సరాల్లో వైద్యం మీద నిర్లక్ష్యం చేసింది. ఆపరేషన్ లు చేయడం అనేది ఒక కలగా మారింది. ఇక్విప్ మెంట్లు, మందులు లేనప్పుడు ఆపరేషన్లు ఎలా చేస్తారు? ప్రసవాలే చేయడంలేదు. కుటుంబ నియంత్రణ చికిత్సలు లేవు. మందు బిళ్లలు ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్ర ఆసుపత్రులుంటే వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని జగన్ చెబుతున్నారు. ఈ పథకం పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.
జగన్ రెడ్డి పాలనలో ఆరోగ్యం పడకేసింది. ఆరోగ్యశ్రీ కింద వేలాది కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పటం పచ్చి మోసం. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయబోమని నెట్ వర్క్ ఆసుపత్రులు బోర్డు పెట్టాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కోల్పోయారు. ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం లేక, ప్రైవేటు ఆసుప్రతులను ఆశ్రయించి నగలు, ఆస్తులు కోల్పోతున్నారు, అప్పులపాలౌతున్నారు.

ఒకపక్క నిరుద్యోగం, మరో పక్క ఇసుక దొరక్క. పనులు లేక, కట్టడాలు లేక, ఉపాధి లేక ప్రజలు బాధపడుతున్నారు. కనీసం వైద్యం అందించలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆరోగ్యశ్రీలో కొత్త చికిత్సలు చేరుస్తున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అవి అమలు లేక కట్టుకథలుగా మారాయి.ఆరోగ్యశ్రీ కింద కోట్లు ఖర్చు పెడుతున్నామనేది శుద్ధ అబద్ధం. ఆరోగ్యశ్రీ కింద యేడాదికి రూ.2,900 కోట్లు, ఆరోగ్య ఆసరా కింద రూ.400 కోట్లు ఖర్చు పెట్టినట్లు సీఎం జగన్ చెబుతుంటే అందుకు భిన్నంగా ఆరోగ్యమంత్రి విడదల రజని మూడేళ్లకుగాను రూ.5,900 కోట్లు ఖర్చు పెట్టామని అసెంబ్లీ వేదికగా చెప్పారు, ఇందులో ఎవరు నిజం చెప్పారు?

ఎవరు అబద్ధం చెప్పారు? రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. ఆరోగ్యశ్రీ నిధుల్ని మెడికల్ కాలేజీల నిర్మాణం పేరుతో మళ్లించడం ఆరోగ్యశ్రీకి తూట్లు పొడవటమే. . మూడేళ్లల్లో వైద్యరంగంలో 46 వేల ఉద్యోగాలిచ్చామని ప్రకటనలివ్వడం పచ్చి అబద్ధం. అందులో రెగ్యులర్ ఉద్యోగులు 1,532 మందికి మాత్రమే ఉద్యోగాలిచ్చారు. 10,341 కాంట్రాక్టు ఉద్యోగులకు, 2,114 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలిచ్చి 46 వేల ఉద్యోగాలిచ్చామనడం ప్రజల్ని మోసం చేయడమే. ప్రభుత్వ ఆసుప్రతుల్లో మౌలిక సదుపాయాలు లేవు, అనేకచోట్ల అత్యాచార కేంద్రాలుగా మారాయి.

రోగులకు వ్యాధి నిర్ధారణ పరీక్ష కిట్లు లేవు, మందులు లేవు, ఆసుపత్రుల్లో కరెంటు కోతలతో టార్చిలైట్లు, సెల్ ఫోన్ల వెలుతురులో ఆపరేషన్లు చేసే దుస్థితి ఉంది. 108, 104 సేవలు కరువై కన్నబిడ్డల శవాల్ని తండ్రులే భుజాలపై మోసుకెళ్లిన హృదయ విదారక సంఘటనలు జరిగాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రసవ వేదన పడుతున్న మహిళలకి అంబులెన్సు రాక మంచాలపై పెట్టి కిలోమీటర్ల దూరం పట్టణ ఆసుపత్రులకు మోసుకొస్తున్న సంఘటనలు నిత్యం చూస్తున్నాం. ఆరోగ్యశ్రీ కార్డులు తీసుకొని నెట్ వర్క్ ఆసుపత్రుల వద్దకు వెళితే అసలు మా వద్దకు రావద్దంటున్నారు.

బెడ్లు లేవని, ఇక్విప్ మెంట్లు లేవని, డాక్టర్లు లేరని తప్పించుకుంటూ రోగుల్ని వెనక్కి పంపిస్తున్నారు. కరోనా సమయంలో ముఖ్యమంత్రి ఏ ఒక్క ఆసుపత్రిని సందర్శించడంకానీ, ఏ ఒక్క క్వారంటైన్ సెంటర్ ను తనిఖీ చేయడంగానీ జరగలేదు. కేవలం తాడేపల్లి ప్యాలెస్ కే అంకితమై మీడియా ప్రకటనలకే పరిమితమయ్యారు.కరోనా సమయంలో ఆరోగ్య శ్రీ మీద నెట్ వర్క్ ఆసుపత్రలకు పోతే మా వద్ద కు రావద్దని బోర్డులు పెట్టారు. అది ఎక్కడో కాదు ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే జరిగింది. ముఖ్యమంత్రికి చీమ కుట్టినట్లు గా కూడా అనిపించడంలేదు. ఆక్సిజన్ అందక చనిపోయిన వారి సంఖ్య బోలెడు.

ఆక్సిజన్ ఇవ్వాల్సిన సమయంలో ఆక్సిజన్ ఇవ్వకుండా అనేక మంది ప్రాణాలు తీశారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక చనిపోయిన వారి సంఖ్యను బాగా కుదించి చెప్పారు. బ్యాంకులు రాష్ట్ర ప్రభుత్వ అప్పుల కుప్పను చూసి ఏ జాతీయ బ్యాంకు రాష్ట్ర ప్రభుత్వానికి రుణం ఇవ్వడంలేదు. ఆరోగ్యశ్రీ డబ్బుల్ని ఆసుపత్రులకు కట్టడానికి డైవర్ట్ చేశారు. ఏపీ మెర్క్ ద్వారా నిధులు మళ్లించి ఆరోగ్యశ్రీని కుప్పకూల్చారు. కొత్తగా ఆసుపత్రులను కడతారా అంటే అదీ లేదు. ఇటు ఆసుపత్రులను కట్టక, అటు ఆరోగ్యశ్రీని నిర్వహించలేక రెంటికీ చెడిన రేవడిలా ప్రభుత్వ విధానాలున్నాయి.

ప్రజా ఆరోగ్యమనేది పడకేసింది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలవైపు ప్రజలు చూసే పరిస్థితి లేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరిస్తితి దారుణం. మొబైల్ వాహనాల్లో డాక్టర్ లను ఇండ్ల వద్దకు పంపిస్తున్నామని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, సామాజిక కేంద్రాల్లో పనిచేసే సగం మంది డక్టర్లను మొబైల్ ఆరోగ్య కేంద్రాల్లోకి డైవర్ట్ చేశారు. వారు వెళ్లక, ఆసుప్రతుల్లో డాక్టర్లు ఉండక పరిస్థితి దారుణంగా మారింది. ప్రజలు చాలా ఇక్కట్లు పడుతున్నారు. గతంలో ఆరోగ్యశ్రీకి చేసిన కేటాయింపుల్లో రోగి చికిత్సకు 45 శాతం ఖర్చు చేసి వైద్యం చేసిన డాక్టర్లకు 35 శాతం ప్రోత్సాహకాలు అందించి మిగిలిన 20 శాతం నిధులను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఖాతాలో వేసేశారు.

కానీ జగన్ రెడ్డి మెడికల్ కాలేజీల పేరుతో ఆరోగ్యశ్రీ నిధులను ఏపీ మెర్క్ కు బదలాయించడం పథకం లక్ష్యం నీరుగార్చింది. టీడీపీ హయాంలో ఈ పధకం కింద వైద్యం ఖర్చు రూ. 5 లక్షలు పెంచడమే కాకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద కోరినంత ఆర్థిక సహాయం చేసేవారు. నేడు ఆ పరిస్థితులు లేవు. విజయవాడ గవర్నమెంట్ ఆసుపత్రిలో అత్యాచారం జరిగితే హోం మినిష్టర్ వచ్చి ఏం జరిగింది అని విలేకరులను అడగం విడ్డూరం.

చంద్రబాబు ఆ మహిళను అప్పటికే పరామర్శించారు. అనేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు లేకపోతే సెక్యురిటీ గార్డులు, స్వీపర్లే వైద్యం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 108, 104 వచ్చే పరిస్థితులు లేవు. పరిస్థితులు ఇలావుంటే రాష్ట్రంలో ప్రజలు ఏవిధంగా వైద్యం పొందగలరు? ఇప్పటికైనా జగన్ అబద్ధాలు కట్టబెట్టి వాస్తవాల్ని చెబితే ప్రజలు నమ్ముతారని టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫి చెప్పారు.

LEAVE A RESPONSE