-ప్రజలు ఏకమై న్యాయం కోసం న్యాయస్థానాలలో పోరాడాలి
-ఓ బీసీ నాయకుడికి మనం ఇచ్చే గౌరవం ఇదేనా?
-వి ఆర్ విత్ అయ్యన్న.. రిలీజ్ అయ్యన్న అనే నినాదం దద్దరిల్లి పోవాలి
-అయ్యన్న అక్రమ అరెస్టును ఖండించిన నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు
సివిల్ తగాదాకు, సిఐడి పోలీసులకు ఉన్న సంబంధం ఏమిటని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. సెంటు స్థల వివాదాన్ని సాకుగా చూపి
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని తెల్లవారుజామున వందమంది పోలీసులు గోడలు దూకి వచ్చి అరెస్టు చేయడం అమానుషమని మండిపడ్డారు. అయ్యన్న తో పాటు ఆయన చిన్న కుమారుడు రాజేష్ ని కూడా ఎత్తుకెళ్లడం చూస్తుంటే… వారిని పోలీసులా?, ఉన్మాదులా??, హంతకులా??? ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… సెంటు భూమి స్థల వివాదంపై కోర్టు స్టే ఉన్నప్పటికీ, అయ్యన్నను ఎలా అరెస్ట్ చేస్తారంటూ నిలదీశారు. గతంలో ప్రహరి గోడ కూల్చినప్పుడే, కోర్టును ఆశ్రయించగా… కోర్టు స్టే ఇచ్చిందన్నారు. గతం లో ప్రభుత్వ సర్వే యర్ ఇచ్చిన కాగితాలు ఉన్నాయని అయ్యన్న కుటుంబం ప్రభుత్వ అధికారులకు చూపించిందన్నారు. అయితే ఆ కాగితాలు ఫోర్జరీ వని, ఫోర్జరీ కాగితాలను చూపించడమే కాకుండా, దగ్గర పెట్టుకున్నందుకే ఐపీసీ 474 సెక్షన్ కింద అరెస్టు చేసినట్లు పేర్కొనడం దుర్మార్గమని రఘురామకృష్ణంరాజు తీవ్రంగా విరుచుకపడ్డారు. ఒకవేళ అదే నిజమని అనుకున్నా, తెల్లవారుజామున అరెస్టు చేయడం ఏమిటంటూ ప్రశ్నించారు. అయ్యన్నను చితకబాదడానికే అరెస్టు చేశారని అనుమానం వ్యక్తం చేశారు.
పతాక స్థాయికి చేరుకున్న పోలీసు ఉన్మాదం
రాష్ట్రంలో సీఐడీ పోలీసుల ఉన్మాదం పతాక స్థాయికి చేరుకుందని రఘురామ కృష్ణంరాజు నిప్పులు చెరిగారు. ఇతర కేసులు నమోదు చేయలేక, అయ్యన్నపాత్రుడుని సెంటు భూమి స్థల వివాదంలో అరెస్టు చేశారన్నారు. సెంటు భూమి స్థల వివాదాన్ని సాకుగా చూపెట్టి ఓ మాజీ మంత్రిని అరెస్టు చేయడం దారుణమన్నారు. ఈ ప్రభుత్వం ఎంతగా దిగజారిపోయిందో, అయ్యన్నను అరెస్టు చేయించడం ద్వారా స్పష్టం అయ్యిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాస్యం చేస్తుందని విమర్శించారు. ఛీ.. ఛీ అసహ్యం వేస్తుంది. ఇటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నామా?. ఇటువంటి వాడు మన పాలకుడా?., నరకాసురుడు, బకాసురుడు, హిరణ్యకశిపుడు వంటి రాక్షసులు సైతం అసూయపడే విధంగా రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని రఘురామకృష్ణం రాజు విరుచుక పడ్డారు. సిఐడి పోలీసులు అక్రమ అరెస్టులు చేసి ఒకరిద్దరు మాజీ మంత్రులను గుడ్డలు ఊడదీశారని, మరికొందరికి కరెంట్ షాక్ లు పెట్టారని, తనను కాళ్లు కట్టేసి చితకబాదారని తెలిపారు. తాను చెప్పుకుంటున్నానని, వారు చెప్పుకోవడం లేదన్నారు. ఈ ఉన్మాదాన్ని ప్రజలంతా సంఘటితమై ఖండించకపోతే, వారి అరాచకత్వానికి అడ్డు అదుపు లేకుండా పోతుందనిఆందోళన వ్యక్తం చేశారు. కళ్ళు లేని కోర్టులు దృతరాష్ట్రుని మాదిరిగానే వ్యవహరిస్తే, కోర్టులకు గట్టిగా వినిపించాలని… వినేదాకా వినిపించాలన్నారు. తన్నితే తన్నించుకోవాలి… చంపితే చంపించుకోవాలనే పాలనకు చరమగీతం పాడేందుకు వినిపించాలి న్యాయగళం అన్నారు.
ధరిత్రి ఎరుగని చరిత్ర ఇది
బ్రిటిష్ పాలనలో సైతం ఇంతటి రాక్షస పాలన కొనసాగలేదని, ఇది ధరిత్రి ఎరుగని చరిత్ర అంటూ రఘురామకృష్ణం రాజు ఆవేదన వ్యక్తం చేశారు. అయ్యన్నపాత్రుడిని అరెస్టు చేసి ఎక్కడకు తీసుకువెళ్లారో చెప్పకపోవడం దారుణం అన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించి రాత్రికి ఆయనని గుడ్డలు విప్పించాలన్నదే పోలీసుల పథకమని పేర్కొన్నారు. ఇది ఒక చిన్న కేస్ అని స్టేషన్ బెయిల్ ఇవ్వకపోతే, కోర్టు బెయిల్ ఇస్తుందన్న ఆశాభావాన్ని రఘురామకృష్ణం రాజు వ్యక్తం చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డిని న్యాయంగానే అరెస్టు చేస్తే ఆయన తల్లి, చెల్లి, భార్య రోడ్డెక్కి ఆందోళన చేశారని, అయ్యన్నపాత్రుడిని అక్రమంగా అరెస్టు చేసినందుకు యావత్ మహిళా లోకం వారి కుటుంబ సభ్యులకు అండగా రోడ్డెక్కి ఆందోళనలు చేయాలన్నారు. అయినా ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుందన్న నమ్మకం లేదని చెప్పారు. సిఐడి పోలీసులు అక్రమ అరెస్టులను చేస్తున్నారని, సాధారణ పోలీసులు ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడడం లేదన్నారు. డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి మంచి చెడు అనే విచక్షణ ఉన్న వ్యక్తి అని తెలిపారు. సిఐడి చీఫ్ గా వ్యవహరిస్తున్న సునీల్ కుమార్ ను బదిలీ చేయమని ఎన్నోసార్లు కోరినప్పటికీ, వ్యవస్థలను తమ ప్రభుత్వ పెద్దలు మేనేజ్ చేస్తున్నారని మండిపడ్డారు.
లోకేష్ ను కూడా అరెస్టు చేసే అవకాశం లేకపోలేదు
రాష్ట్రంలో ఈ ఉన్మాద చర్యలను ఇలాగే కొనసాగిస్తే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ను కూడా అరెస్టు చేసే అవకాశాలు లేకపోలేదని రఘురామకృష్ణం రాజు అన్నారు. తనకు గతంలో బెయిల్ రావడం ఇంకా వారం రోజులు ఆలస్యం జరిగి ఉంటే, లోకేష్ ను కూడా అరెస్ట్ చేసే వారన్నా ఖచ్చితమైన సమాచారం తనకు తెలిసిందన్నారు. రాజ్యాంగం స్వేచ్ఛగా బ్రతికే హక్కును మనకు కల్పించిందన్న ఆయన, ప్రజలంతా ఏకమై న్యాయం కోసం న్యాయస్థానాలలో పోరాడాలని పిలుపునిచ్చారు. ఫోర్జరీ డాక్యుమెంట్ అభియోగం పెట్టినంత మాత్రాన అయ్యన్నపాత్రుడును అక్రమ అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించిన రఘురామకృష్ణం రాజు, అక్రమ అరెస్టులకు పాల్పడుతున్న పోలీసు అధికారులను కోర్టులు వదిలివేయడం వల్లే ఈ దారుణాలకు తెగబడుతున్నారని అన్నారు. అక్రమ అరెస్టులు చేస్తున్న పోలీసులపై న్యాయస్థానాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. అయ్యన్నపాత్రుడిని అక్రమ అరెస్టు చేసిన పోలీసులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇదే విషయమై ఈ న్యాయస్థానంలో న్యాయం జరగకపోతే, సుప్రీంకోర్టును ఆశ్రయించి అయినా సరే వారికి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అయ్యన్నపాత్రుడితోపాటు ఆయన న్యాయవాదిని ఎందుకు అనుమతించలేదని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. అసలు అయ్యన్నను అరెస్టు చేసే ముందు నోటీసులు ఎందుకు ఇవ్వలేదని పోలీసులను నిలదీశారు. తనని సిఐడి పోలీసులు అక్రమ అరెస్టు చేసినప్పుడే స్పందించి న్యాయస్థానాలు పోలీసులపై చర్యలు తీసుకొని ఉంటే, ఇప్పుడు ఈ పరిస్థితి నెలకొని ఉండేది కాదన్నారు. పోలీసుల దుర్మార్గాలకు అడ్డుకట్ట వేయలేకపోతే లోకేష్ తో పాటు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కూడా అరెస్టు చేసే అవకాశాలు లేకపోలేదన్నారు. పొద్దున లేచింది మొదలు బ్యాక్ బోన్ కమ్యూనిటీ అంటూ బీసీ జపం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, ఉత్తరాంధ్రకు చెందిన ఒక బీసీ నాయకుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు. అయ్యన్నపాత్రుడు షుగర్ పేషెంట్ అని ఆయన్ని తెల్లవారుజామున అరెస్టు చేయవలసిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. నిష్కల్మషంగమైన వ్యక్తి నిక్కచ్చిగా మాట్లాడే అయ్యన్న అరెస్టును ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని పిలుపునిచ్చారు. జీవచ్ఛవాల బతికి ఉందామా?, మానవుల తప్పుని తప్పని ఎలుగెత్తి చాటుదామా అన్న రఘురామకృష్ణం రాజు, ఈ ఉన్మాదులకు బుద్ధి వచ్చేలా సోషల్ మీడియాలో వి ఆర్ విత్ అయ్యన్న… అయ్యన్నను వెంటనే రిలీజ్ చేయండి అనే స్లోగన్ తో దద్దరిల్లగొట్టాలని పిలుపునిచ్చారు.
షర్మిలపై కేసు నమోదు చేస్తారా?
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి ని ఔను… ఆ వాళ్ళిద్దరే చంపారని జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల సిబిఐ కి వాంగ్మూలం ఇచ్చారన్నారు. కడప ఎంపీ టికెట్ తనకు కానీ వైఎస్ విజయమ్మకు, షర్మిలకు ఇవ్వాలని వైఎస్ వివేకానంద రెడ్డి కోరడం వల్లే అది నచ్చని ఆ ఇద్దరు ఆయన్ని హత్య చేసినట్లుగా షర్మిల చెప్పిందన్నారు. షర్మిల చేసిన వ్యాఖ్యలకు తమ పార్టీ నాయకత్వం సమాధానం చెప్పాలని రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. తాను కూడా ఇదే పార్టీలో ఉన్నాను కాబట్టి, తనని కూడా సమాధానం అడిగే అవకాశం ఉందన్నారు. షర్మిల వ్యాఖ్యలకు ఏమని సమాధానం చెప్పాలో పార్టీ నాయకత్వం వివరించాలనికోరారు. ఔను… వాళ్ళిద్దరి హత్య చేశారని అన్నందుకు షర్మిలపై కేసు పెడతారా అంటూ ప్రశ్నించారు. షర్మిల చిన్నపిల్ల ఆమెకు ఏమీ తెలియదని అంటారా?, ఆమె మాటలను పట్టించుకోవలసిన అవసరం లేదని అంటారా?? అంటూ అపహాస్యం చేశారు. షర్మిల ఎంతోమంది ఓటర్లను ప్రభావితం చేసిన నాయకురాలని, తమ పార్టీ అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువగానే షర్మిల శ్రమించారన్నారు. షర్మిల వ్యాఖ్యలను ప్రజల్లోకి వెళ్లకుండా దారి మళ్ళించడానికి అయ్యన్నపాత్రుడును అరెస్టు చేశారన్న వాదన సరైంది కాదని పేర్కొన్నారు. విజయమ్మ భయస్తురాలని, అన్యాయం జరుగుతుందని తెలిసి కూడా బేలతనంతో వ్యవహరిస్తున్నారన్నారు. ఒకపక్క కుమారుడు మరొక పక్క కుమార్తె, ఏదో ఒక రోజు ఆమె కూడా నిజాలను చెబుతారేమోననిఅన్నారు. దేవుడున్నాడన్నది ఎంత నిజమో… వైఎస్ వివేకా హత్య ఎవరు చేశారో అందరికీ తెలుసు అన్నది అంతే నిజమని అన్నారు. అసెంబ్లీలో చాలా ఎక్కువగా మాట్లాడేశాము కాబట్టి షర్మిల వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య లో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రమేయంలో లేదని, నిర్దోషి అయితే నిర్దోషి అని ఒకవేళ ప్రమేయం ఉండి ఉంటే దోషి అని తేల్చివేయాలన్నారు. ఈ వ్యవహారం ఎక్కువ రోజులు జనాల్లో కొనసాగడం పార్టీకి మంచిది కాదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి హితవు పలికారు.
మూడెకరాల్లోనే గుండు కొట్టారట..!
ఋషికొండ పై కేవలం మూడు ఎకరాలలోనే గుండు కొట్టిన మాట వాస్తవమేనని ప్రభుత్వ తరుపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఋషికొండపై 20 ఎకరాలలో ప్రకృతి విధ్వంసానికి పాల్పడి, కేవలం మూడు ఎకరాలలోనే చదును చేసినట్లుగా పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. సుప్రీం కోర్టు ఉత్తర్వులలో పాత కాటేజీలను మాత్రమే కూల్చి అక్కడే నిర్మాణాలను చేపట్టాలని స్పష్టంగా పేర్కొనడం జరిగిందన్నారు. జనసేన నాయకుడు మూర్తి యాదవ్ తరఫున వాదనలు వినిపించిన కె ఎస్ మూర్తి అనే న్యాయవాది అద్భుతమైన వాదనతో ఆకట్టుకున్నారన్నారు. ఋషికొండపై జరుగుతున్న అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని కోర్టు స్టే ఇవ్వకపోయినాప్పటికీ, ఋషికొండపై ఎంత మేరకు ప్రకృతి విధ్వంసం జరిగిందో లెక్కలు వేయాలని ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ విభాగం అధికారులను కోర్టు ఆదేశించిందని తెలిపారు. ఒకవేళ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ విభాగం అధికారులు కోర్టుకు తప్పుడు నివేదికలను అందజేస్తే, సరైన నివేదికతో న్యాయస్థానాన్ని ఆశ్రయించి వారిని బొక్కలో వేయించే వరకు విశ్రమించేది లేదని రఘురామకృష్ణం రాజు తెలిపారు. తమ ప్రభుత్వ పెద్దలు ఎంతటి వారినైనా వశీకరణ చేసుకోవడంలో సిద్ధహస్తులన్న ఆయన, ఇకనైనా ఋషికొండపై జరుగుతున్న ఉన్మాదాన్ని ఆపాలన్నారు. ఋషికొండపై కొనసాగుతున్న ప్రకృతి విధ్వంసం గురించి కోర్టు ఆదేశాలను వివరించేందుకు ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ విభాగం కేంద్ర మంత్రిని కలుస్తానని తెలిపారు. రిషి కొండపై జరిగిన ప్రకృతి విధ్వంసం గురించి మీడియా సమక్షంలో ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ విభాగం అధికారులు వెరిఫై చేయాలన్నారు. లెక్కలలో గోల్మాల్ జరిగితే, గుండు కొట్టినట్లుగా రుషికొండను చెరబట్టిన వారికి పట్టిన గతే అధికారులకు పడుతుందన్నారు. విశాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండి గతంలో ఋషికొండ ఫోటోలు, ప్రస్తుత ఋషికొండ ఫోటోలను ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ విభాగం అధికారులకు అందజేయాలన్నారు. అలాగే కోర్టులకు నివేదించాలని సూచించారు.