విశ్వహిందూ పరిషత్ హిత చింతక్ అభియాన్ (సభ్యత్వ నమోదు) కార్యక్రమం ఈనెల ఆరవ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు సంస్థ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి తెలిపారు. ప్రతి హిందువు VHP లో చేరాలని కోరారు. విశ్వహిందూ పరిషత్ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి “హితచింతక్ అభియాన్” నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. అందులో భాగంగానే నవంబర్ ఆరవ తేదీ నుంచి 20వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రం తో పాటు ప్రపంచవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నట్లు ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.
ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో యువతను విశ్వహిందూ పరిషత్ వైపు ఆకర్షిస్తున్నట్లు వివారించారు. ఇప్పటికే నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం రాష్ట్రంలోని 6000 గ్రామాలకు వెళ్లి సభ్యత్వ నమోదు చేయిస్తామన్నారు. ప్రత్యేకంగా 30 వేల మంది కార్యకర్తలు ఈ పనిలో ఉన్నారని.. మొత్తంగా 10 లక్షల మందిని విశ్వహిందూ పరిషత్ లో కొత్తగా సభ్యులుగా చేర్చుకుంటామని బాలస్వామి తెలియజేశారు.