Suryaa.co.in

Editorial

సినిమాకు జగ’న్యాయం’!

– వైసీపీలో ‘తారా’తోరణం
– టీడీపీకి పోటీగా సినీగ్లామర్‌
– ఇప్పటికే చిరంజీవి, నాగార్జున తో జగన్‌ దోస్తీ
– రాంగోపాల్‌వర్మ తో ఎలక్షన్‌ సినిమాల నిర్మాణం
– చిరంజీవితో దోస్తీ- పవన్‌తో కుస్తీ
– ఎన్నికలకు ముందే టీడీపీపై రెండు ఆర్జీవీ సినిమా అస్త్రాలు
– మోహన్‌బాబుతో బంధుత్వం
– వైసీపీలో చేరిన గిరిబాబు, కృష్ణుడు
– రోజాకు మంత్రి పదవి
– ఆలీకి ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారు పదవి
– పోసాని మురళీకృష్ణకి ఎఫ్‌డీసీ చైర్మన్‌ పదవి
– నిర్మాత నిరంజన్‌రెడ్డికి రాజ్యసభ
– విజయచందర్‌, పృధ్వీకి గతంలో నామినేటెడ్‌ పదవులు
– సినీరంగంపై పట్టు బిగించడమే వైసీపీ లక్ష్యం
– ఎన్నికల్లో టీడీపీ సినీగ్లామర్‌కు జగన్ చెక్
– కమ్మవర్గంపై ‘పోసాని’ అస్త్రాల ప్రయోగం
– వైసీపీలో సినిమా సందడి
(మార్తి సుబ్రహ్మణ్యం)

సినిమాకు-రాజకీయాలకు ఉన్న విభజనరేఖ చెరిగి చాలాకాలమయింది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపనతో, తెలుగుసినీ తారాతోరణం టీడీపీకి ‘మానసిక మద్దతుదారు’గా మారిపోయింది. ప్రధానంగా సినీరంగాన్ని శాసిస్తోన్న కమ్మ వర్గం.. టీడీపీకి రాజకీయంగా-మాన సికంగా ఎప్పుడో చేరువయిపోయింది. రావుగోపాలరావు, కైకాల సత్యనారాయణ, శారద, జయప్రద, జయసుధ, మోహన్‌బాబు, మురళీమోహన్ వంటి ప్రముఖులు టీడీపీ గూటిలో సేదదీరిన వారే. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. సినీగ్లామర్ లేని లోటును కృష్ణ, జమునతో భర్తీ చేసుకుంది. ఇప్పుడు తర్వాతి వంతు వైసీపీది.

సినిమా రంగంపై అధిపత్యం కోసం, వైసీపీ తొలిసారి దృష్టి పెట్టింది. తొలినుంచీ సినీరంగంపై తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తున్న తెలుగుదేశం పార్టీకి, వైసీపీ తొలిసారి ఆ రంగంలో సవాల్ విసరడం ఆసక్తికరంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, వైసీపీ కూడా తారాతోరణాన్ని బరిలోకి దించడం కొత్త పరిణామం. తెలుగు సినీ రంగ ప్రముఖులకు నామినేటెడ్ పదవులివ్వటం ద్వారా, ప్రజాకర్షణ విషయంలో తానేమీ తెలుగుదేశం పార్టీకి తీసిపోనన్న సంకేతాలు పంపింది. ఫలితంగా టీడీపీ అంటే సినిమా. సినిమా అంటే టీడీపీ అన్న మానసిక భావన-ప్రచారానికి జగన్ తెరవేశారని చెప్పవచ్చు.

ఇప్పటివరకూ తెలుగుదేశం పార్టీపై.. రాజకీయ ఆధిపత్యం మాత్రమే సంపాదించిన వైసీపీ, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి తిరుగులేని పట్టున్న సినీరంగంపైనా, పట్టు బిగించేందుకు రంగంలో దిగింది. అందులో భాగంగా ప్రముఖ కమెడియన్ ఆలీని, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించింది.

నిజానికి జగన్‌తో సన్నిహిత సంబంధాలున్న ఆలీకి.. ఎమ్మెల్సీ ఇస్తారని ఒకసారి, వక్స్‌బోర్డు చైర్మన్ ఇస్తారని మరోసారి, రాజ్యసభ సభ్యత్వం ఇస్తారన్న ప్రచారం ఇంకోసారి జరిగింది. చివరకు ఆయన ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమితులయ్యారు. నిజానికి ఈ పదవికి పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా, ప్రజలకు సుపరిచితుడైన ఆలీ, వైసీపీలో ఉన్నారన్న సంకేతాలిచ్చేందుకే, ఆయనకు ఈ పదవి ఇచ్చినట్లు కనిపించింది.

ఇక జగన్‌తో తొలినుంచీ.. అత్యంత సన్నిహిత సంబంధాలున్న రచయిత, సినీ నటుడు పోసాని మురళీకృష్ణ , ఫిలిం డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులయ్యారు. సినీ రంగం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న పోసాని మురళీకృష్ణ, నేరుగా తెలుగుదేశం పార్టీపై దాడి చేయటంలో ముందువరసలో ఉన్నారు. ప్రెస్‌మీట్ల ద్వారా ఆయన టీడీపీపై ఎదురుదాడి చేస్తున్నారు.

ప్రధానంగా కమ్మ సామాజికవర్గానికి చెందిన పోసానిని ముందుపెట్టి, టీడీపీలోని కమ్మ నేతలను, ఆయనతో విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టించడంలో వైసీపీ విజయం సాధించింది. టీడీపీలో ఉంటేనే కమ్మవాళ్లా? ఇతర పార్టీలో ఉండేవాళ్లు కమ్మవాళ్లు కాదా అని ప్రశ్నించిన పోసాని కమ్మకులంలో కలకలం రేపారు. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా, టీడీపీని ప్రేమించే కమ్మవర్గం పోసానిపై నిప్పులు కురిపించింది. ఒకదశలో ఆయన వారికి భయపడి, అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది.

నిజానికి పోసానికి గతంలో చైర్మన్ పదవి ప్రతిపాదించినా, ఆయన తిరస్కరించారు. ఇప్పుడు మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో, ఆయన ఆ పదవి తీసుకోవడం అనివార్యమయింది. ఇకపై ఆయనతో.. టీడీపీ కమ్మ వర్గ నేతలపై, మరింత ఎదురుదాడి చేయించే అవకాశాలు లేకపోలేదు.

గ తంలో బ్రాహ్మణ వర్గానికి చెందిన విజయచందర్, ైవె సీపీకి ఇతోధిక సేవలందించారు. ఎన్నికల ప్రచారంలో పనిచేశారు. ప్రతిఫలంగా జగన్ ఆయనకు, ఎఫ్‌డీసీ చైర్మన్ పదవి ఇచ్చారు. విజయచందర్ పదవీకాలం ముగిసిన నేపధ్యంలో, ఆ పదవిని కమ్మవర్గానికి చెందిన పోసానికి ఇచ్చారు. కమ్మ వర్గాన్ని జగన్ పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి నేపథ్యంలో, పోసానికి ఆ పదవి ఇచ్చినట్లు కనిపిస్తోంది. తాజాగా కమ్మ వర్గానికే చెందిన, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి ఇచ్చిన విషయం తెలిసిందే.

గతంలో కాపు వర్గానికి చెందిన కామెడీ నటుడు పృధ్వీరాజ్‌కు, ఎస్వీబీసీ చైర్మన్ పదవి ఇచ్చారు. ఆయన కూడా జగన్ పాదయాత్రలో కలసి నడిచారు. అయితే, తన వివాదాస్పద ప్రవర్తనతో, పృధ్వీ తన పదవి పోగొట్టుకున్నారు. ఆ తర్వాత వైసీపీలో చేరి తప్పు చేశానంటూ, పృధ్వీ పశ్చాత్తాపం వ్యక్తం చేయడం తెలిసిందే.

కాగా తాజాగా కాపు వర్గానికే చెందిన సీనియర్ జర్నలిస్టు, విజయ్‌బాబుకు అధికార భాషా సంఘం అధ్యక్ష పదవి ఇచ్చారు. వైసీపీ అధికార మీడియా చర్చలో చురుకుగా పాల్గొని, పవన్-చంద్రబాబుపై విమర్శలు కురిపించిన విజయ్‌బాబుకు, తగిన ప్రతిఫలం దక్కినట్టయింది. కాపు వర్గానికి చెందిన పృధ్వీ రాజీనామా నేపథ్యంలో, మరో కాపును నియమించడం ద్వారా, జగన్ కాపులను మెప్పించినట్లయింది.

ప్రముఖ న్యాయవాది- నిర్మాత నిరంజన్‌రెడ్డికి రాజ్యసభ దక్కింది. నాగార్జునతో ఢమరుకం, చిరంజీవితో ఆచార్య సినిమా తీసిన నిరంజన్‌రెడ్డి, సీఎం జగన్‌కు న్యాయసలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ఏపీ తరఫున సుప్రీంకోర్టులో కేసులు కూడా వాదిస్తున్న విషయం తెలిసిందే.

వీరికంటే ముందుగానే.. నాటి హీరోయిన్ రోజాకు నగరి టికెట్‌తోపాటు, మంత్రి పదవి కూడా ఇవ్వడం ద్వారా, వైసీపీ నాయకత్వం సినిమా బంధానికి తెరలేపింది. టీడీపీపై రోజాను బ్రహ్మాస్త్రంగా సంధించడంలో, వైసీపీ సక్సెస్ అయింది. అసెంబ్లీ-బయట టీడీపీని తూర్పారపట్టే వైసీపీ నేతల్లో రోజా ముందువసరలో ఉన్నారు.

ఇక జనసేనాధిపతి పవన్ కల్యాణ్‌తో.. సీఎం జగన్ యుద్ధం చే స్తున్న్పటికీ, ఆయన అన్నయ్య చిరంజీవితో మాత్రం, సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నారన్నది బహిరంగ రహస్యం. పవన్ కల్యాణ్ సినిమాలకు, రాయితీ-మినహాయింపులు ఇవ్వని జగన్.. ఆయన అన్నయ్య చిరంజీవి-రాంచరణ్ సినిమాలకు మాత్రం, వాటిని కొనసాగించడం విశేషం. ఇటీవల నాగార్జున, మహేష్, ప్రభాస్ వంటి ప్రముఖులతో సీఎం భేటీ వెనుక, చిరంజీవి చొరవ ఉందన్నది తెలిసిందే. చిరంజీవి సతీసమేతంగా జగన్ ఇంటికి భోజనానికి వెళ్లడంతోపాటు, జగన్ ప్రతిపాదిత మూడురాజధానుల విధానానికి చిరంజీవి జైకొట్టారు.

కమ్మ వర్గానికి చెందిన నాగార్జున, చాలాకాలం నుంచి జగన్‌కు సన్నిహితుడతేనన్నది తెలిసిందే. ఒకదశలో నాగార్జున.. విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా, బరిలోకి దిగనున్నారన్న ప్రచారం జరిగింది. జగన్‌కు సమీప బంధువయిన మాజీ ఎంపీ మోహన్‌బాబు, చాలాకాలం క్రితమే వైసీపీలో చేరి ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు.ఒకప్పటి హీరో భానుచందర్‌తోపాటు, హాస్యనటుడు కృష్ణుడు, గిరిబాబు కూడా వైసీపీలో చేరిన వారిలో ఉన్నారు.

లేటెస్టుగా సంచలన దర్శక నిర్మాత రాంగోపాల్‌వర్మ, రహస్యంగా జగన్‌తో భేటీ కావడం సంచలనం సృష్టించింది. స్వతహాగా చిరంజీవి కుటుంబాన్ని, టీడీపీని వ్యతిరేకించే రాంగోపాల్‌వర్మతో.. ఎన్నికల్లోగా రెండు-మూడు సినిమాలు తీయాలన్నది, జగన్ లక్ష ్యమన్న ప్రచారం జరుగుతోంది. ఆ మేరకు వాటిపై ఇద్దరూ చర్చించినట్లు చెబుతున్నారు. ఏదేమైనా జగన్ సినిమారంగానికి న్యాయం చేశారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఈవిధంగా ఒకప్పడు తెలుగుదేశం మాదిరిగా, ఇప్పుడు వైసీపీలోనూ సినిమా సందడి కనిపిస్తోంది. సినిమా అంటే టీడీపీ. టీడీపీ అంటే సినిమా అన్న భావనను జగన్, విజయవంతంగా బ్రేక్ చేశారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రేపటి ఎన్నికల ప్రచారపర్వంలో… వీరిని బరిలోకి దించడం ద్వారా, టీడీపీ సినీగ్లామర్‌కు బ్రేకులు వేయాలన్నది, జగన్ అసలు వ్యూహమని స్పష్టమవుతోంది.

LEAVE A RESPONSE