Suryaa.co.in

Andhra Pradesh

ఎస్.ఐ అర్ధనగ్నంగా డ్యాన్సులు వేయడం దేనికి నిదర్శనమో డీజీపీ సమాధానం చెప్పాలి

-టెక్కలి ఎస్.ఐ హరికృష్ణను తక్షణమే ఉద్యోగం నుండి తప్పించాలి
-టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి.మాణిక్యాలరావు

పోలీసు వ్యవస్థ పరువును దిగజార్చిన శ్రీకాకుళం జిల్లా, టెక్కలి ఎస్.ఐ చౌదరి హరికృష్ణను తక్షణమే డిస్మిస్ చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది. అశ్లీల నృత్యాలు చేసిన ఎస్.ఐ ను వీఆర్ కు పంపడం మాత్రమే కాకుండా అతన్ని ఉద్యోగం నుండి తొలగించాలి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి పోలీసు వ్యవస్థ పరువు రోజు రోజుకూ దిగజారిపోతోంది. పోలీసులంటే ప్రజలకు విసుగుపుడుతోంది.

వైసీపీ రాజ్యంలో పోలీసులంటే రక్షకులు కాదు, అధికార పార్టీకి బానిసలు అనేలా కొంతమంది కళంకిత అధికారులు ప్రవర్తిస్తున్నారు. ఓ ప్రజాప్రతినిధి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న ఎస్.ఐ అర్ధనగ్నంగా డ్యాన్సులు వేయడం దేనికి నిదర్శనమో డీజీపీ సమాధానం చెప్పాలి. పోలీసులకు రావాల్సిన భత్యాలు గురించి నిరసన తెలిపి పోలీసుల తరపున న్యాయపోరాటం చేసిన కానిస్టేబుల్ ప్రకాష్ పై కక్షగట్టి ఉద్యోగం నుండి తొలగించారు. అర్ధనగ్న ప్రదర్శనలు చేసిన ఎస్.ఐ ను ఎందుకు వెనకేసుకొస్తున్నారో డీజీపీ నోరువిప్పాలి. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటినుండి అనేక మంది పోలీసు అధికారులు అసభ్యంగా ప్రవర్తించిన తీరుపై డీజీపీకి టీడీపీ అనేక వినతులు సమర్పించింది. వారిపై నేటికీ ఎలాంటి చర్యలు లేవు. అందుకే పోలీసులు మరింత బరితెగించి వ్యవహరిస్తున్నారు.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పోలీసు వ్యవస్థ జాతీయస్థాయిలో అనేక వార్డులను కైవసం చేసుకుంది. ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థతో ప్రజలకు పోలీసు వ్యవస్థను చంద్రబాబు దగ్గర చేశారు. అధికార పార్టీ మెప్పు, వారి కళ్లల్లో ఆనందం చూడడమే పోలీసు వ్యవస్థ గొప్ప అవార్డులా భావిస్తోంది. సుప్రీంకోర్టు సాక్షిగా ఏపీ పోలీసు పరువు మంటగలిసింది. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ అధికారులపైనే కేసులు పెట్టిన ఘనత ఏపీ పోలీసులకే దక్కింది.

హంతకులతో పోలీసు వ్యవస్థ కుమ్మక్కైందని సాక్షాత్తూ సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. డీజీపీ దీనికి నేటి వరకు సమాధానం చెప్పకుండా మౌన రుషిలా వ్యవహరించడం సిగ్గుచేటు. ఇప్పటికైనా పోలీసు వ్యవస్థను దిగజారుస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ కోరుతోంది. టెక్కలి ఎస్.ఐ హరికృష్ణను తక్షణమే ఉద్యోగం నుండి తప్పించాలని డిమాండ్ చేస్తోంది. ఏపీ పోలీస్ వ్యవస్థకు గతంలో ఉన్న వైభవాన్ని తీసుకురావాలని, ప్రజలకు న్యాయం చేకూర్చేలా వ్యవహరించే విధంగా చర్యలు తీసుకోవాలని డీజీపీ ని కోరుతున్నాం.

LEAVE A RESPONSE