– తప్పుడు రాతలు రాసిన పత్రికలపై పరువు నష్టం కేసు వేస్తా..
– రేడియంట్ ఒప్పందంలో ఈ ప్రభుత్వానికి ఇసుమంతైనా సంబంధం లేదు
– అది రెండు ప్రైవేటు సంస్థల మధ్య జరిగిన ఒప్పందం.. స్కాంకు ఆస్కారమే లేదు
– కోర్టు తీర్పుతో చంద్రబాబు హయాంలోనే భూముల అప్పగింత నిజం కాదా?
– వైఎస్ఆర్సీపీలో ఉంటే మేం వ్యాపారాలు చేయకూడదా..?
– టీడీపీ వాళ్ళే వ్యాపారం చేయాలని రూల్స్ ఏమైనా ఉన్నాయా..?
– ప్రభుత్వ సాయం తీసుకున్నట్లు అయితే.. ప్రాజెక్టు ఇంత ఆలస్యమయ్యేది కాదు
– ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎందుకు టార్గెట్ చేస్తున్నాయ్.. తప్పుడు రాతలతో బ్లాక్ మెయిల్ చేస్తారా..?
– వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
నెల్లూరు : ఇద్దరు ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి జరిగిన రియల్ ఎస్టేట్ లావాదేవీలను భూ కుంభకోణం అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ఎలా తప్పుడు రాతలు రాస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఇది అసలు జర్నలిజమేనా అని రామోజీ, రాధాకృష్ణలను నిలదీశారు. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమిటి సంబంధం అని ప్రశ్నించారు. ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు, కోర్టు తీర్పు తరవాత తమది అయిన ఆస్తికి సంబంధించి మరో ప్రైవేటు వ్యక్తి లేదా సంస్థతో అగ్రిమెంట్ కుదుర్చుకోవటంలో ఏం తప్పు ఉందో చెప్పాలని ఈనాడు, ఆంధ్రజ్యోతి యాజమాన్యంతోపాటు, మాపై విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలు చెప్పాలని ప్రశ్నించారు.
కోర్టు తీర్పుతో 2019కు ముందే ఆ భూములను చంద్రబాబు హయాంలోనే రేడియంట్ సంస్థకు(GO NO:77,తేది : 14-02-2019 నందు 50 ఎకరాల భూమి కేటాయించడం జరిగింది) అప్పగించింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఈ అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పాత్ర ఇసుమంతైనా లేకపోయినా… దానిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి కుటుంబానికి, ఆయన భార్య భారతమ్మకు చుట్టడాన్ని ఏమనాలని నిలదీశారు. మీ రాజకీయ స్వలాభం కోసం కుటుంబాలను ఎందుకు బయటకు లాగుతున్నారని ప్రశ్నించారు. ఏ రాజకీయ పార్టీ అయినా, రాజకీయాలను రాజకీయంగా చూడాలే తప్పితే.. ఇంట్లో కుటుంబ సభ్యులను, మహిళలను బయటకు లాగి, వారిపై ఆరోపణలు చేయడం ఎంతమాత్రం తగదని హితవు పలికారు.
ఎన్నో ఏళ్ళుగా వ్యాపారం చేస్తున్న తన ఇమేజ్ ను కూడా దెబ్బతీసేలా, వెయ్యి కోట్ల కుంభకోణం అంటూ అబద్ధపు వార్తలతో కథనాలు రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా యాజమాన్యాలపైన, అసత్య ఆరోపణలు చేసిన ప్రతిపక్ష నేతలపైనా పరువు నష్టం దావా వేయనున్నట్లు వేమిరెడ్డి తెలిపారు. విశాఖపట్నంలోగానీ, బెంగుళూరులోగానీ, హైదరాబాద్ లోగానీ హైరైజ్ 50–50 రేషియా ప్రకారం ఇస్తామంటే వందలు కాదు… వేల ఎకరాలు ఇప్పిస్తాను. ఈనాడు రామోజీకానీ, ఏబీఎన్ రాధాకృష్ణ కానీ నా సవాలును స్వీకరిస్తారా? అని వేమిరెడ్డి ఛాలెంజ్ విసిరారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
ఆ వెంచర్ తో ప్రభుత్వానికి ఏం సంబంధం?
విశాఖ పట్టణంలో ఉన్న రేడియంట్ సంస్థతో నాకు వ్యక్తిగతంగా గత 30 ఏళ్లుగా పరిచయం. సంస్థకు కోర్టు తీర్పుతో భూములు దక్కాయి. ఆ భూముల్ని కోర్టు తీర్పుతో సంస్థకు అప్పగించినది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే. 2019 ఫిబ్రవరిలోనే. భూములు అప్పగించినది కూడా చంద్రబాబు పాలనలోనే. ఇది ప్రైవేటు ఆస్తి. ఆ ఆస్తి వారికి ఇవ్వకూడదు అనుకుంటే రామోజీరావు, ఈనాడు… 2019కి ముందే ఇలాంటి వార్త ఎందుకు రాయలేదు?. మేం ఆ సంస్థతో, వారు సుప్రీం కోర్టులో కూడా కేసు గెలుచుకుని, ట్రిబ్యునల్‌లో కూడా వారికి అనుకూలంగా తీర్పు తెచ్చుకుని, డబ్బు కట్టి స్థలం వారి స్వాధీనం అయిన తరవాత, ఒక ఒప్పందం చేసుకున్నాం.
రేడియంట్ డెవలపర్స్ మరియు వి.పి.ఆర్ ప్రాజెక్ట్స్ మధ్య తేది : 23-02-2021 ఒప్పందం జరిగినది. ఇలా ఎన్నో సంస్థలతో ఒక బిజినెస్ సంస్థగా మేం లావాదేవీలు జరుపుతాం. ఇందులో తప్పు ఏముందో టీడీపీ, రామోజీ, రాధాకృష్ణలు చెప్పాలి. ఇలా ఎన్నో సంస్థలతో ఒక బిజినెస్ సంస్థగా మేం లావాదేవీలు జరుపుతాం. ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ గురించి పత్రిక ఉంది కదా అని వెయ్యి కోట్ల కుంభకోణం అంటూ అబద్ధపు వార్తలు రాయటం ఎంతవరకు సమంజసం? . ఇలాంటి రాతలు రాయడం వల్ల మీకు కలిగే ప్రయోజనం ఏమిటి.?
మేము వ్యాపారస్తులం. అదే వృత్తి మాది. ప్రభుత్వాన్ని నా చేతిలో పెట్టుకుని, ప్రభుత్వం ద్వారా ఏదో లబ్ధి పొందినట్టుగా వార్తలు. ఇందులో అసలు కుంభకోణం ఎక్కడ ఉంది.?. గుడ్ విల్ అనేది ప్రభుత్వానికి సంబంధించినది కాదు. అది వీపీఆర్ గా బిజినెస్ లో నాకు ఉన్న గుడ్ విల్. రేడియంట్ సంస్థ వాళ్ళను ఈ వెంచర్ చేయడానికి చాలామంది అడిగి ఉండొచ్చు. నా దగ్గరకే ఎందుకు వాళ్ళు వచ్చారంటే.. కేవలం బిజినెస్ లో నా గుడ్ విల్ వల్ల.
మీడియాను అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తారా.. పరువు నష్టం కేసు వేస్తా..
విశాఖలో టీడీపీ వాళ్ళు కూడా వెంచర్లు చేసి ఉంటారు. విశాఖలోగానీ, బెంగుళూరు, హైదరాబాద్ లోగానీ.. ఎక్కడైనా 70-30 రేషియో కాకుండా, 50-50 రేషియో ఉంటే చెప్పండి. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలో కూడా హై రైజ్ బిల్డింగులకు సంబంధించి 70–30 వాటా ఇవ్వటం అందరికీ తెలియదా?. చాలా అన్యాయంగా ప్రతిపక్ష టీడీపీ నేతలు మాట్లాడటం, వాటిని మీ పత్రికల్లో భూ కుంభకోణం అంటూ అచ్చేయడం చాలా పెద్ద తప్పు. ప్రభుత్వాన్ని వాడుకునే వాడినే అయితే.. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎప్పుడో నాకు అనుమతులు వచ్చేవి.
2021 ఫిబ్రవరి నుంచి 2022 నవంబరు వరకు ప్రాజెక్టు ఆలస్యమైందంటే.. నాకు ఎంత నష్టం. రెరా పర్మిషన్ రావడానికే మాకు ఏడాది పట్టింది. ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వాన్ని మేము అసలు టచ్ చేయలేదు. ఎందుకంటే అది ఈ ప్రభుత్వం ఇచ్చిన భూమి కాదు. ఇదంతా గత ప్రభుత్వ హయాంలో మంజూరైన భూములు. సుప్రీంకోర్టు దాకా.. అన్ని కోర్టుల్లో తిరిగి పక్కా డాక్యుమెంటు ఉన్న భూమి. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల యాజమాన్యాలు.. వాస్తవాలు తెలుసుకుని, ల్యాండ్ ఓనర్స్ ను కూడా విచారించి, నిజాలు తెలుసుకోండి. ప్రైవేటు వ్యవహారాన్ని ప్రభుత్వానికి లంకె పెట్టి, మీ ఎల్లో పత్రికల్లో తప్పుడు కథనాలు రాసి బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తారా..?.
ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి. ఇది అసలు ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగే వ్యాపారమైతే… మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. దీనిని జర్నలిజం అనరు. ఒక పార్టీని డ్యామేజీ చేయడానికి, ఒక వ్యక్తిని డ్యామేజ్ చేయడానికి చేసేది జర్నలిజం కాదు. నాలాంటి వాడిని ఎందుకు మీడియాకు ఎక్కించారో ఆ పత్రికల యాజమాన్యాలు చెప్పాలి. తప్పుడు వార్తలు రాసినందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల యాజమాన్యాలపైన, తప్పుడు ఆరోపణలు చేసిన టీడీపీ నేతలపైనా న్యాయ సలహా తీసుకుని పరువునష్టం కేసు వేస్తాను. న్యాయం ఎప్పుడూ గెలుస్తుంది. న్యాయాన్ని నమ్ముకున్నవాళ్ళను ఎవరూ ఏమీ చేయలేరు. అంటే, వైఎస్ఆర్సీపీలో నాయకులుగా ఉంటే మేం వ్యాపారాలు చేయకూడదా..? టీడీపీ వాళ్ళు మాత్రమే వ్యాపారాలు చేయాలనే రూల్ ఏమైనా ఉందా..?.
భారతమ్మకు ఏమిటి సంబంధం..?
వైయస్ అనిల్ రెడ్డి తల్లి, అనిల్ రెడ్డి తండ్రి జార్జి రెడ్డి భార్య పేరు కూడా వైయస్ భారతి . ఆ విషయం రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్(ఆర్ వో సీ)నుంచి వివరాలు తీసుకున్నప్పుడు కచ్చితంగా వారికి తెలిసే ఉంటాయి. భారతి అని ఉంటే ఆమె ఎవరో కూడా అందులో ఉంటుంది. ఆమె వయసూ ఉంటుంది. అయినా ముఖ్యమంత్రి భార్యను టార్గెట్ చేసి రాయటం పరమ దుర్మార్గం కాక మరేమిటి?. ఎవరిని టార్గెట్ చేయటానికి అయినా సిగ్గు, బుద్ధి ఉండాలి కదా?. ఇంట్లో వాళ్ళ పేర్లు ఎందుకు లాగుతున్నారు?. సీఎం కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగి, వారి కుటుంబ సభ్యుల మీద బురదచల్లాలన్నదే టీడీపీ ప్రయత్నం. భారతమ్మ చాలా మర్యాదస్తురాలు, సంస్కారం ఉన్న మహిళ.
ఒక ఫ్యామిలీ మెంబరుగా.. ఎప్పుడు ఇంటికి వెళినా అన్నా బాగున్నారా, అక్క బాగున్నారా.. కాఫీ తీసుకుంటారా.. అని మూడే మూడు మాటలు అభిమానంతో మాట్లాడతారు. అంతకుమించి రాజకీయ విషయాల్లో అసలు జోక్యం చేసుకోరు. అటువంటి మహిళ మీద బురదచల్లాలని చూడటానికి మీకు అసలు సిగ్గుందా..?. ఏ రాజకీయ పార్టీ అయినా, కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగకూడదు. అది చాలా తప్పు. భారతమ్మ తన భర్త, తన కూతుళ్ళ చదువుల విషయాల్లో తప్పితే.. వేరే విషయాల్లో జోక్యం చేసుకోరు. రాజకీయంగా ఎక్కడా ఒక్క మాట కూడా ఆమె మాట్లాడరు. కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లొగొద్దు అని అన్ని పార్టీలకు చెబుతున్నాను.
విశాఖ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీయాలనే ఈ కుట్రలు
విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయాలని, అక్కడ పరిపాలనా రాజధాని రాకుండా చేయాలనే కుట్రలో భాగంగా ఇదంతా చేస్తున్నారు. చంద్రబాబు మీద ఈనాడు, ఆంధ్రజ్యోతి యాజమాన్యాలకు ప్రేమ ఉంటే, చివరికి మా బిజినెస్ వ్యవహారాలను కూడా వక్రీకరించి మీ పత్రికలో రాసి బ్లాక్ మెయిల్ చేస్తారా?. మీ ప్రైవేట్ లావాదేవీల మీద ఇలాగే వార్తలు రాయవచ్చా. ఇదే నేను టీడిపి, ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోండి. రాజకీయాలను రాజకీయంగా చూడండి. వ్యాపారాలను కూడా రాజకీయం చేయొద్దు. విశాఖపట్నంలో ఈ ప్రాజెక్టును దెబ్బ తీయాలని, అభివృద్ధిని కుంటు పరచాలనే దురుద్దేశంతో టీడీపీ నాయకులు, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని మరోసారి ఖండిస్తున్నాను.