-బేస్ లెస్ రిజర్వేషన్ విధానం
చట్టసభలు రూపోందించే చట్టాలను, న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులను గౌరవించాల్సిందే. అవి ఫోర్స్ లో ఉన్నంతకాలం శిరసావహించక తప్పదు. అయితే వాటిని నిర్ణయించేవారు, ఆ తీర్పులనిచ్చే వారు మనుషులేనన్న సజీవ సత్యాన్ని మనం ఒప్పుకోక తప్పదు. కాబట్టి వాటిని పరిశీలించాల్సిన అవసరం, చర్చించాల్సిన బాధ్యత, తిరగదోడే హక్కు మనకు ఉన్నది. అంతకంటే వాటిని మళ్ళీ సవరించమని డిమాండ్ చేసే భావప్రకటనా స్వేచ్చను కూడా మనకు రాజ్యాంగం ప్రసాదించిన విషయం మరువజాలము. అలాంటి ఒక స్థితిని, ఆ పరిస్థితులను అర్థం చేసుకుని స్పందిచగలిగే మానవీయత కొందరికి మాత్రమే సొంతం.
అది జరగాలంటే సమస్య పట్ల స్పష్టత ఉండాలి. ఆ సమస్య వలన అయ్యే గాయలు, నష్టాలు స్వతహాగ ఎదుర్కున్న అనుభవం ఉండాలి. లేదంటే వారికి ఒక సామాజిక పరివర్తనో, ఆ సమూహాల పట్ల సానుభూతినో, సహానుభూతినో ఉండి తీరాలి. లేదంటే తాజా పరిణామాల లోతును, విస్తృతిని, ఆ సమూహాల ఊపిరి సలపని బాధను అర్థం చేసుకోవడం కష్టం.
ఇదంతా ఎందుకంటే కేంద్రంలో ఉన్న బిజేపి ప్రభుత్వం 2019 జనవరిలో 103 వ రాజ్యాంగ సవరణ ద్వారా అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లను కల్పించింది. దాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ ఫిబ్రవరిలో 40 పిటీషన్లు ఫైల్ అయ్యాయి. వాటి వాదనలను అయిదుగురు సభ్యుల ధర్మాసనం 2022 సెప్టెంబర్ 27 న విన్నది. తీర్పును రిజర్వ్ చేసి పెట్టిన సర్వోన్నత న్యాయస్థానం నవంబర్ 7 న అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ సరైనదే అంటూ తీర్పు వెలువరించింది.
ఇది రాజ్యాంగ స్ఫూర్తికి గొడ్డలిపెట్టు. అసలు మూలసిద్ధాంతానికే విరుద్ధం. దాని మౌళిక స్వరూపాన్ని ధ్వంసం చేస్తుంది. డా.బి.ఆర్. అంబేడ్కర్ మొదటి రాజ్యాంగ సవరణ సందర్భంలో “వెనుకబడ్డ వర్గాలు అనేవీ కొన్ని కులాల సముదాయం తప్ప మరేమీ కాదు” అని చెప్పిన విషయాన్ని ప్రభుత్వాలు, కోర్టులు మర్చిపోవడం అత్యంత బాధాకరం. భారత రాజ్యాంగ పీఠిక “సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని” అందించడమే లక్ష్యమని చెప్తుంది. ఇక్కడ అత్యంత ప్రాధాన్యంగా పొందుపరిచిన “సాంఘీక” అనే పదాన్ని ఈ సవరణ, తీర్పు పరిగణలోకి తీసుకోలేదు. ఇది రాజ్యాంగానికే పెద్ద ముప్పుగా భావించాలి.
అంతే కాకుండా “షెడ్యూల్ కులాల, తెగల విద్యావసరాలను, ఆర్ధిక అవసరాలను ప్రత్యేక శ్రద్ధతో తీర్చాలి. వారిని సామాజిక అన్యాయాల నుండీ, అన్ని రకాల దోపిడీల నుండి కాపాడాలని” ఆర్టికల్ 46 చెప్తుంది. ఇక్కడ సామాజిక అన్యాయం అంటే ఈ సమాజం చేత కులం పరంగా, వృత్తి పరంగా, నివాస స్థలం పరంగా, తిండిపరంగా వివక్షకు, దోపిడికి, అన్యాయానికి గురవడం అని అర్థం.
ఇలాంటి వివరణాత్మక ఆర్టికల్ ను కూడా తుంగలో తొక్కారు. వేల ఏండ్లుగా సామాజిక అసమానతలే కాదు, విద్యా వైద్య, ఆర్ధిక, రాజకీయ, సాంస్కృతిక అసమనతలు వేళ్ళూనుకుని ఉన్న దేశం మనది. ఇక్కడ కులమే వర్గం అని పెరియకరుప్పన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు 1971 కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్నది. అలా కులం ఆధారంగానే చదువు, కొలువు, ఆస్తి, అధికారాలు, ఆయుధాలు ఇప్పటిదాక రిజర్వేషన్లు అందించబడుతున్న కులాలకు నిషేధించబడ్డాయి. తదనుగుణంగానే ఆధిపత్య కులాలు సమస్త అధికారాలను, సౌకర్యాలను తమ చేతుల్లో ఉంచుకున్నాయి. ఫలితంగా అణగారిన కులాలు కేవలం శ్రామిక భానిసత్వంలో కూరుకుపోయాయి.
ఇప్పటికీ బడిలోకి అడుగుపెట్టని కులాలు వందల సంఖ్యలో, అసెంబ్లీ పార్లమెంటుల్లోకి మాత్రమే కాదు కనీసం స్థానిక సంస్థల్లోకి అడుగుపెట్టని కులాలు కూడా వేల సంఖ్యలో ఉన్నాయి. అందుకే ఇక్కడ అన్యానికి, వెనుకబాటుతనానికి కులమే ప్రాతిపదిక. అంతే తప్ప ఆర్ధికం కాదు.
రిజర్వేషన్ అనేది ఓట్ల పథకం కాదు. వందల తరాల ఎస్సీ, ఎస్టీ, బీసీల వెట్టి చాకిరికి ఉపశమనం. వారిని బానిసల చేసి దోచుకున్నందుకు ఈ సమాజం చేత వారికి ఈ గొప్ప రాజ్యాంగం ఇస్తున్న అవకాశం. అది వారికే తప్ప తేరగా బ్రతికే అగ్రవర్ణ కులాలకు కాదు. ఒక వేళ అగ్రకులాల్లోని వారికి ఆర్ధిక వెనుకబాటును సరిజేస్తామనుకుంటే నగదు బదిలీ చేసుకోండి.
అంతే కానీ వారికి రిజర్వేషన్ ఇవ్వడం నిజమైన రిజర్వేషన్ల అవసరతను విధ్వంసం చేస్తున్నట్టే. “ఒకవేళ ఆదాయాన్ని బట్టి వెనుకబడిన వారిగా గుర్తిస్తే భూస్వాములు, ధనికులు తమ పలుకుబడితో దొంగ ఆదాయ సర్టిఫికెట్స్ పొంది ఆర్ధిక సౌకర్యాలు పొందుతున్నారో తెలుసు అని జస్టిస్ చిన్నపరెడ్డి 1990 లో వసంత్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో ఇచ్చిన జడ్జిమెంటును నెమరేసుకుంటే అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఎంత దుర్మార్గమైనవో తెలుస్తుంది.
పేదవారైనంత మాత్రాన బ్రాహ్మణులను సాంఘీకంగా, విద్యాపరంగా వెనుకబడినవారని చెప్పలేము. వారు ఆర్ధికంగా పేదవారైనా సామాజికంగా, సాంస్కృతికంగా సమాజంలో ఉన్నాస్థాయిగా గుర్తించబడ్డారు. కాబట్టి వారిలో పేదవారికి రిజర్వేషన్లు కల్పించాలనడం సబబు కాదు.” అని నొక్కి పేర్కొన్న ఆ జడ్జిమెంటును ఇప్పుడు అందరూ ఓసారి చదువుకుంటే బాగుండేదనిపిస్తుంది.
సామాజిక సమానత్వ ప్రాధాన్యతను చాటిచెప్పే ఆర్టికల్ 46 ను కేవలం కేవలం ఆర్ధిక అంతరాల రూపుమాపేవిగా చూడడం సరైంది కాదు. ఆ రకంగా చూసినప్పుడు ఓబీసీల్లో కూడా పేదలు ఉన్నారు కదా! అంతకు మిక్కిలీ ఎస్సీ ఎస్టీ మెజార్టీ ప్రజలంతా పేదలే కదా? అంతెందుకు ఈ దేశంలో ఎక్కువ పేదరికంలో మగ్గి మసైపోతున్నది ఎస్సీ ఎస్టీ బీసీలే కదా? అలాంటప్పుడు పేదరిక నిర్మూలనకిచ్చే ఈ రిజర్వేషన్ల నిజమైన అవసరం వీరికి కదా ఉన్నది! ఇవేమీ పట్టించుకోకుండా అగ్రవర్ణ పేదలకు మాత్రమే ఈ పది శాతం రిజర్వేషన్లంటూ పార్లమెంటులో తమకున్న సంఖ్యాబలంతో బిల్లు ఆమోదింపజేసుకున్నారు.
గతంలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమించిన పార్టీ, మండల్ సిఫార్సులను అమలు చేయొద్దన్న బీజేపీ పార్టీ, ఈ అగ్రవర్ణ రిజర్వేషన్ల కోసం చట్టం చేయడం ఆశ్చర్యంగా కంటే కుట్రగానే భావించాల్సి ఉన్నది. అదే విధంగా అసదుద్ధీన్, తిరుమవలన్ లాంటీ ఒకరిద్దరు మినహా ప్రాంతీయ, జాతీయ, భూర్జువా, కమ్యూనిస్టు పార్టీలన్న తేడా లేకుండా తమవంతు బాధ్యతగా భావించి అగ్రవర్ణ రిజర్వేషన్లకు గట్టిగా మద్దతు పలికారు. వారందరికీ రాజ్యాంగ స్ఫూర్తి అర్థం కాలేదేమో అని 103 రాజ్యాంగ సవరణను నిలిపివేయమని రాజ్యాంగ నిష్ణాతులుండే సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించినా ఫలితం లేకపోను, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సరైనదే అని ప్రతికూల తీర్పు రావడం నిజంగా ఈ దేశ ప్రజల దురదృష్టం. వారు ఇక్కడ పుట్టిన పాపానికి అనుభవించక తప్పదని చెప్పక తప్పని పరిస్థితి నెలకొన్నది.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ పాలనలో మురళీదర్ రావు కమిషన్ అంగీకరించి ఇచ్చిన రిజర్వేషన్లను, మండల్ సిఫార్సుల ప్రకారం విద్యా ఉద్యోగాల్లో నలభై నాలుగు శాతం రిజర్వేషన్లను ఇదే సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. కారణమేంటనంటే ఆ జనాభా లెక్కలు, స్పష్టమైన వివరాలు, సమగ్ర నివేదిక లేవని అవి సేకరించి తెచ్చేంతవరకు యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఉండరాదని చెప్పింది. ఇప్పుడు అగ్రవర్ణ పేదల సమగ్ర వివరాలు లేకున్నా, విద్యా, ఉద్యోగ, ఆర్ధిక, రాజకీయ రంగాల్లో వారి స్థితిగతులు, జనాభా, సామాజిక జీవన పరిస్థితులు తెలిపే విధంగా, ఏ రకమైన శాస్త్రీయ గణన జరపకుండా వారి రిజర్వేషన్లు సరైనవే అని చెప్పడం సహజ న్యాయానికే కాదూ, సామాజిక న్యాయానికి కూడా తూట్లు పొడవడమే.
పై పెచ్చు ఎలాంటి ప్రాతిపదికలు, సమానతా సమస్యలు, సామాజిక వివక్షలు, అసమంజస రుగ్మతలు ఎదుర్కోని కొందరికీ ప్రత్యేక రిజర్వేషన్లివ్వడం మెజార్టీ ప్రజలను చిన్నచూపు చూసే రుగ్మతగా బహుజన విద్యావంతులు భావిస్తున్నారు. సుప్రీంకోర్ట్ ప్రొసీడింగ్ టెక్నికాలిటీస్ ప్రకారంగా తాజాగా ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు అహేతుకంగానే చూడాల్సివస్తుంది. ఎందుకంటే రిజర్వేషన్లకు యాభై శాతం పరిమితి విధిస్తూ తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం తీర్పు చెప్పింది. దాన్ని మించిన సంఖ్యత కూడిన ధర్మాసనమే దానిపై వ్యాఖ్యానించగలదు. లేదంటే ఆ తీర్పును సమీక్షించగలదు. కానీ ఇది కేవలం అయిదుగురు సభ్యుల ధర్మాసనమే. కనుక ఈ తీర్పు హేతుబద్దమైనది కాదు.
అదేంటో యాభై శాతానికి మించిన రిజర్వేషన్లను బహుజనులకు ఇస్తే రాజ్యాంగ మూలసిద్దాంతానికి భంగకరమని, అగ్రవర్ణాలకిస్తే రిజర్వేషన్లు అరవై శాతానికి చేరుకున్నా కూడా మూలసిద్దాంతానికి నష్టం వాటిల్లదనడం బహుజనులకు న్యాయవ్యవస్థ పట్ల విశ్వాసం సన్నగిల్లేలా ఉందని న్యాయ నిపుణులు కూడా చర్చించుకుంటున్నారు. కోర్టు తీర్పు రాగానే అధికార, ప్రతిపక్ష, వివిధ రాజకీయపార్టీలు నిజంగా క్రెడిట్ మాదంటే మాది అని ప్రకటించుకోవడం సిగ్గుచేటు. బహుజనుల భవిష్యత్తును హత్య చేసిన ఘనత మాకే రావాలనే వారి వెంపర్లాట దురదృష్టంగా ఉన్నది. ఇటు పార్టీలు కానీ, అటు సర్వోన్నత న్యాయస్థానం కానీ, అగ్రవర్ణ రిజర్వేషన్లను ఆమోదించేవారు కానీ ఈ దేశాభివృద్ధికి వ్యతిరేకులుగానే చూడాల్సి ఉంటది.
అలాగే జస్టిస్ ఇ.ఎస్. వెంకట్రామయ్య ఎప్పుడో చెప్పినట్టు సుప్రీంకోర్టు రిజర్వేషన్లపై ఇచ్చిన తీర్పులలో భారత సామాజిక వ్యవస్థ చరిత్రను గుర్తించ నిరాకరించిందనేది మళ్ళీ ప్రస్పుటమైంది. కాబట్టి ఈ దేశంలో బహుజన, మైనార్టీ, మహిళల ఆశలు నెరవేరాలంటే, సమాన హక్కులు రావాలంటే, రాజ్యాంగం ప్రసాదించిన అవకాశాలను పొందాలంటే పోరాటమే దిక్కు. సమానత్వం సాధించాలంటే, రూపం మార్చుకుంటున్న ఈ అంటారానితనం రూపుమాలంటే పూలే, అంబేడ్కర్ లు నిర్ధేశించిన బహుజన రాజ్యాధికారమే అంతిమ పరిష్కారం తప్ప మరొక మార్గం లేదన్న విషయాన్ని ఈ తీర్పు నుంచి గుణపాఠంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది.
– భాగ్యారావు మేళం