– “అడుగడుగున గుడి ఉంది” పుస్తక ఆవిష్కరణ
“ఇన్ని విదేశీ ఆక్రమణలు జరిగినా, అంతులేని దోపిడీలు జరిగినా ఈ దేశం ఇలా నిలబడి ఉంది అంటే అందుకు కారణం దేవాలయమే” అని ప్రముఖ పాత్రికేయులు రాకాలోకం – కస్తూరి రాకా సుధాకర్ రావు అన్నారు. సంవిత్ ప్రకాశన్ ప్రచురణలో కస్తూరి రాకాసుధాకర్ రచించిన “అడుగడుగున గుడి ఉంది” పుస్తకావిష్కరణ కార్యక్రమంలో హైదరాబాద్‌లోని డా.ఎ.ఎస్ రావు నగర్‌లోని ఒక సమావేశ మందిరంలో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ సంస్కృత శాఖధిపతి డా. పి. శశిరేఖ పుస్తకాన్నిసమీక్షిస్తూ రచయిత పుస్తకాన్ని వదలకుండా చదివేటట్లు రాశారని, ఇలా అపకుండా చదివి చాలా సంవత్సరాలు అయిందని ఆనందం వెలిబుచ్చారు.
రచయిత శైలి చాలా హృద్యంగా ఉన్నదని, ఈ పుస్తకం చదివిస్తుంది, ఆలోచింపజేస్తుందని ఒక్కో చోట మనస్సుని కుదిపేస్తుందని అన్నారు. స్థాలీపులాక న్యాయంగా కొన్ని అంశాలు ప్రేక్షకులతో పంచుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు. కవితాత్మకంగా రచన ఉన్నదనీ అంటూ కొన్ని పదాల ప్రయోగం చాలా కవితాత్మకంగా భావ స్పూరకంగా ఉందని తెలిపారు.
శైలజ పుస్తక పరిచయం చేస్తూ 25 వ్యాసాలుగా మనకు బాగా తెలిసిన అంతగా తెలియని, ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఆలయాలపై ఒక భక్తుని వ్యక్తిగత ట్రావెలాగ్ రూపంలో ఉందని వెంటనే బయలుదేరి మనమూ ఇలా పర్యటన చేద్దాం అనిపిస్తుందని అభిప్రాయపడ్డారు.
అనంతరం పుస్తక రచయిత కస్తూరి రాకాసుధాకర్ మాట్లాడుతూ ఈ దేశం ఆత్మ ఆలయంలోనే ఉందని “విద్యాలయం, దేవాలయం, తల్లిఒడి, మన సంస్కృతికి కీలకమైన అంశాలని ఆలయం అంటే గోడలు కలిగిన పెద్ద కట్టడాలే అవసరం లేదని ఒక వేపచెట్టు కింద ఉండే ఒక బొడ్రాయి కూడా అంతటి మహాత్తు కలుగజేస్తుందని ఒరిస్సా ప్రాంతంలోని “లూరి” గ్రామాన్ని ఉదహరించారు. ఇలాంటి అనేకమైన అంశాలు తనను ప్రేరేపించాయని, అలాగే అనేక మంది మహత్ముల జీవితాలు ఎలా మహితాత్మకంగా ఉంటాయో ఉదహరిస్తూ భద్రచలంలోని అంబసత్రం గురించి ప్రస్తావించారు.
ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. సంవిత్ ప్రకాశన్ డైరెక్టర్ నడింపల్లి పరిమళ మాట్లాడుతూ ఇంతటి విద్వత్తు గల రచనలు ప్రచురిచడం ఎంతో ఆనందంగా ఉన్నదని, భవిష్యత్తులో ఇలాంటి మంచి పుస్తకాలను ప్రచురిస్తామని ప్రకటించారు. మహతి వ్యాఖ్యతగా వ్యవహరించారు. సంవిత్ ప్రకాశన్ తరుపున డైరెక్టర్ ఆయుష్ నడింపల్లి , ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. వారణాసి సందీప్ వందన సమర్ఫణతో కార్యక్రమం ముగిసింది.