మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా అక్షరంతో పోరాడిన యోధుడు..
గురజాడ
దిగజారుతున్న విలువలు..
పతనమైపోతున్న సంప్రదాయాలను
ప్రవచనాలతో పునరుజ్జీవింపచేసేందుకు
పాటు పడుతున్న కృషీవలుడు
చాగంటి..
అప్పుడు కొన్ని అవకరాలు..
ఇప్పుడు ఇంకొన్ని అవకరాలు..
అవి అపకారాలు కూడా..
వాటిని సరిదిద్దడం
అవసరం..
నాడు గురజాడ ఎన్నుకున్న మార్గం రచన..
నేడు చాగంటి అనుసరిస్తున్న బాట ప్రవచన..
గురజాడ బోధించింది సంస్కరణ…
చాగంటి ప్రబోధిస్తున్నది
సంస్కారం..
మహాకవి కోరింది మార్పు..
ఈ ప్రవచనకర్త కోరుతున్నదీ
మార్పే..చెబుతున్నది మారమనే..!
ఆనాడు మూఢాచారాలతో
బిగుసుకుపోయిన సమాజాన్ని జాగృతం చేసి కొన్ని దురాచారాలను రూపుమాపేందుకు నడుం కట్టిన మహాత్ముడు అప్పారావు..!
అది అప్పటి సమాజం తీరు..!
నేడు పెద్దల మాటలు పట్టించుకోక..పెడత్రోవలు తొక్కుతూ..దుర్వ్యసనాల
కోరల్లో తమకు తాముగా చిక్కుకుంటూ పతనమైపోతున్న యువతను సన్మార్గంలో పెట్టేందుకు పాటుపడుతున్న
రుషి కోటేశ్వరరావు..!
ఇది నేటి సమాజం అవసరం..
అప్పుడు గురజాడ సంస్కర్త అయితే ఇప్పుడు చాగంటీ
సంస్కర్త కారా..
ఒకరకంగా చెప్పాలంటే గురజాడ కాలం నాటి
సమాజంలోని కొన్ని అవకరాలు
ఇప్పుడు లేవు..కాని అంతకుమించిన అవకతవకలు ప్రస్తుత సమాజంలో విశృంఖల విహారం చేస్తున్నాయి..
ఇప్పటి యువతతో గురజాడ రచనలు చదివించగలమా..
చదివినా కూడా నేటి యువతలో చాలామంది కన్యాశుల్కం..బాల్య వివాహాలు వంటివి విని ఉండరు కూడా..!?
ఇప్పటి యువతకు తెలిసింది ..బుర్రకు ఎక్కుతున్నది పాశ్చాత్య సంస్కృతి..పోకడలు..
మత్తుపదార్థాల సేవనం..సహజీవనం..
చిత్రవిచిత్ర వేషధారణ..
విచ్చలవిడితనం..వివాహసంబందాలపై గౌరవం లేకపోవడం..పెద్దలు చెప్పే నీతులను..రీతులను అపహాస్యం చెయ్యడం..
ఇలాంటి ఎన్నో అవకరాలు..
మరిప్పుడు వారికి ఏమిటి అవసరం ..గురజాడ రచనలా.. సన్మార్గం వైపు నడిపే బోధనలా..
సందేహం లేదు..గురజాడ రచనల్లో చాలామటుకు ఏ కాలం నాటి సమాజానికైనా ఉపయోగపడేవే…అప్పారావు గొప్ప దార్శనికుడు..
తన కాలానికంటే ఎంతో ముందు ఏర్పడబోయే సమాజ స్థితిగతులను కూడా ఊహించి వాటిని కూడా తన రచనల్లో పొందుపరచిన గొప్ప వ్యక్తి ఆయన..
అయితే చదివే అలవాటుకే
దూరమైపోతూ పూర్తిగా పెడత్రోవ పడుతున్న నేటి యువతను మళ్లీ సన్మార్గంలో పెట్టడం అనేది ఇప్పుడు తక్షణ కర్తవ్యం..ఆ బృహత్తర బాధ్యతనే భుజానికి ఎత్తుకున్న మహనీయుడు
చాగంటి కోటేశ్వరరావు..
ఆయనేమీ వితంతు వ్యవస్ధను.. కన్యాశుల్క దురాచారాన్ని ప్రోత్సహించలేదే..
ఇప్పుడు పురి విప్పి ఉన్న భయంకర పోకడలు మారాలని ఉద్భోధిస్తున్నారు.
అందుకు ప్రాతిపదికగా పురాణాలను ఎన్నుకుని ఉండవచ్చు గాక..రాముడు దేవుడైనా.. కాకపోయినా
రాముడిలా జీవించమని చెబితే అది ఛాందసవాదం అవుతుందా..అప్పుడు మన ప్రస్తుత సమాజంలో పాటిస్తున్న నాటి వివాహ సంప్రదాయాలు కూడా ఛాందస విధానాలే అవ్వవా..
ఈరోజున పెద్దగా గొంతెత్తి సంప్రదాయాలను గురించి మాట్లాడే పెద్దమనుషుల్లో ఎందరు ఆధునిక పద్ధతుల్లో వివాహాలు చేస్తున్నారు చెప్పండి.. వారిలో ఎందరు గుళ్ళు.. గోపురాలకు వెళ్లకుండా ఉంటున్నారు..
ఇంట్లో పిల్లలు చెడు మార్గాలు పట్టేస్తుంటే చూస్తూ ఊరుకుంటున్నారా.. అది వారి ఇష్టం..మనం చెప్పకూడదు..అని మిన్నకుండిపోతున్నారా…
తోచిన మార్గంలో బాగుపడమనే కదా చెబుతాము…చాగంటి చెప్పేది కూడా అదే..
ఆయన చేసేది సంస్కరణ…
అది నిర్వివాదం..!
సురేష్ కుమార్ ఇ
జర్నలిస్ట్