Suryaa.co.in

Editorial

కృష్ణాతీరంలో పేకాటపర్వం!

– పడవలేసి మరీ పేకాట నిర్వహణ
– ఇతర జిల్లాల నుంచి పేకాటరాయుళ్లు
– గతంలో పోలీసులు దాడి చేసినా ఆగని జూదం
– కోట్లలో కోత-మూడు ముక్కలాట, కోడిపందాలు
– అంతా అధికార పార్టీ ప్రముఖుడిదే హవా
– అన్న అండతో తమ్ముడి దందా
– చక్రం తిప్పుతున్న ‘తమ్ముడన్నయ్య’
– రేపల్లె పేకాట రూటే సెప‘రేటు’
– బంకిని రూపంలో వైసీపీ ప్రముఖుడికి కోట్ల ఆదాయం
– సీఎంకు లేఖ రాసిన ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్
– గుంటూరు జిల్లా మాచర్ల, రేపల్లె, గుంటూరు సిటీలో అనధికార పేకాట క్లబ్బులు
– గతంలో దాడులకు ధైర్యం చేసిన నాటి ఎస్‌ఈబీ
– ఎస్‌ఈబీపై సీఎం జగన్‌కు ఫిర్యాదు చేసినా ఖాతరు చేయని సీఎం
– సదరు వైసీపీ నేతను సీఎం మందలించినా అదే బేఖాతరిజం
– ఇప్పుడు దాడులకు పోలీసులు భయపడుతున్నారన్న విమర్శలు
– నిద్రపోతున్న ‘నిఘా’ నేత్రం
( మార్తి సుబ్రహ్మణ్యం)

అది గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం. పక్కనే గలగలపారే కృష్ణానది పరవళ్లు. మధ్యలో చిన్న చిన్న పడవలు. పెద్ద పెద్ద తాటి చెట్లు. ఎవరూ వచ్చే ధైర్యం చేయని ప్రాంతం అది. దూరంగా విసిరేసినట్లు కనిపించే శిబిరాలు. చూస్తే అందమైన దృశ్యం ఆవిష్కృతమవుతుంది. కానీ ఆ అందమైన దృశ్యం వెనుక.. ‘అందరికీ తెలిసిన’ సుందరమైన ‘క్రీడాదృశ్యకావ్యం’ మరొకటుంది. అదే పేకాట పర్వం! పడవలెక్కి వెళ్లి మరీ, డజన్ల మంది ఆడే చతుర్ముఖ పారాయణం!!

ఈ దృశ్యం ఇప్పుడు రేపల్లె పరిసర గ్రామాలు, ప్రధానంగా తీరగ్రామాల్లో కను‘విందు’ చేస్తోంది. చుట్టుపక్కల జిల్లాల నుంచి తరలివచ్చే పేకాట క్రీడాకారులకు.. కోరినంత మందు. తిన్నంత విందు. అలాగని వాటికి జీఎస్టీ వేస్తారనుకుంటే ‘జోకర్’లో కాలేసినట్లే. అన్నీ ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ. కాకపోతే అంతా కలిపే వసూలు చేస్తారక్కడ. అదే అధికార పార్టీ ‘తమ్ముడన్నయ్య’ల సారథ్యంలోని, రేపల్లె పేకాట క్లబ్బుల స్పెషాలిటీ.

జోకర్.. ఆటిన్ రాణి.. ఇస్పేట్ రాజా.. కళావర్ కింగ్.. డైమండ్ రాణి. పచ్చటి పల్లెపొలాల మధ్య.. గలగల పారే కృష్ణమ్మ పరవళ్ల మధ్య.. గలగలమని మోగే మందు గ్లాసుల మధ్య.. పేకాట పర్వం విజయవంతంగా కొనసాగుతున్న బేఖాతరిజం ఇది. అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఆశీస్సులతో, ఆయన తమ్ముడి సారథ్యంలో.. ‘పేకాట తపోవనం’గా మారిన వైనం, రేపల్లె వాసులకు మొత్తం తెలిసినా, నిఘా నేత్రాలకు కనిపించకపోవడమే విచిత్రం. ఆ ‘తమ్ముడన్నయ్య’ సాక్షిగా నడుస్తున్న, ఆ పేకాట పాపారావుల కథేమిటో చూద్దాం రండి.

అది రేపల్లె నియోజకవర్గం. చుట్టూ కృష్ణానది. కొన్ని గ్రామాలకు వెళ్లాలంటే పడవలే మార్గం. ఇప్పుడా పడవలే అక్రమార్కులకు ఆదాయ మార్గాలవుతున్నాయి. నిఘా నిద్ర ఫలితంగా.. నగరం, చెరుకుపల్లి, నిజాంపట్నం మండలాల్లో పేకాట పర్వం, మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతోంది. మైనేనివారి పాలెం, మోర్తోట, అడవులదీవి, ఈదుపల్లి, నగరంలో కోతముక్క- పేకాట జోరుగా సాగుతోందన్న ఆరోపణలు వస్తున్నా, ఇప్పటిదాకా పోలీసులు అటు వెళ్లిన దాఖలాలు లేవన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా నిజాంపట్నం ప్రాంతంలో నడుస్తున్న క్లబ్బుకు బాగా గిరాకీ ఉందంటున్నారు.

తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి వచ్చే పేకాట రాయుళ్లతో.. ఇప్పుడు ఈ ప్రాంతం కళకళలాడుతోంది. వారిని పేకాట శిబిరాలకు తీసుకువెళ్లేందుకు, ప్రత్యేకంగా పడవలు ఏర్పాటుచేయటం అధికారపార్టీ నేతల ప్రత్యేకత. గతంలో ఇలాంటి పద్ధతి హైదరాబాద్ క్లబ్బు నిర్వహకులు పాటించేవారు. రోడ్డు చివర ఆటోలు ఏర్పాటుచేసి, వాటిలో పేకాటరాయుళ్లను తీసుకువచ్చేవి. ఇప్పుడు అదే పద్ధతిని రేపల్లె పేకాట క్లబ్బు నిర్వహకులు అమలుచేస్తున్నారు. కాకపోతే ఆటోలకు బదులు, పడవలు. అదొక్కటే తేడా. మిగిలినవన్నీ సేమ్ టు సేమ్!

కరోనా సమయంలో.. మునిరేడు గ్రామంలో ఏర్పాటుచేసిన పేకాట శిబిరాలపై దాడి చేసిన పోలీసులు.. నగదు, భారీ సంఖ్యలో వాహనాలు స్వాధీనం చేసుకున్న వైనం సంచలనం సృష్టించింది. అప్పుడే ఈ పేకాట శిబిరాల నిర్వహణ తెరపైకి వచ్చింది. అంతకుముందు దానిపై మీడియాలో విమర్శలు వచ్చినా, ఎవరూ స్పందించలేదు. పోలీసుల దాడి తర్వాత కూడా, పేకాట జోరు ఏమాత్రం తగ్గలేదు. ఎందుకంటే .. అక్కడి అధికార పార్టీ ‘తమ్ముడన్నయ్య’లదే హవా మరి! ఎందుకంటే రేపల్లెకు కర్త, కర్మ, క్రియ అంతా అన్నయ్య ‘తమ్ముడే’ మరి!! ఎలాంటి అధికారం లేకపోయినా ఆయనే అనధికార ప్రజాప్రతినిధి!!!

కృష్ణా నది మధ్య దిబ్బకు పడవలు వేసి మరీ.. పేకాటరాయుళ్లను తరలిస్తున్న దృశ్యాలు మీడియాలో హల్‌చల్ చేస్తూనే ఉన్నాయి. కానీ పోలీసులకు మాత్రం, అవి కనిపించకపోవడమే విచిత్రం. రేపల్లె నియోజకవర్గంలో విస్తృతంగా జరుగుతున్న అనధికార పేకాట క్లబ్బులపై, కరోనా తర్వాత ఇప్పటిదాకా దాడులు జరిగిన దాఖలాలు లేవన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా మోర్తోట మట్టిదిబ్బల మధ్యలో.. పడవలు ఏర్పాటుచేసి మరీ, పేకాట నిర్వహిస్తున్నారన్నది బహిరంగ రహస్యం. కానీ పోలీసులకు మాత్రం తెలియకపోవడం, నిఘా విభాగం కూడా నిద్ర పోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

రాజధాని గుంటూరు జిల్లా.. అనధికార పేకాట క్లబ్బులకు, కేరాఫ్ అడ్రసుగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా గుంటూరు జిల్లాలో పేకాట క్లబ్బులను మూసివేయించారు. దానితో పేకాట క్లబ్బులపై ఉక్కుపాదం మోపాలని జగన్ ఆదేశించారు. దానితో అధికార పార్టీ నేతలు ఊరికి దూరంగా, చిన్న చిన్న పేకాట శిబిరాలు ఏర్పాటుచేసుకుని లక్షల్లో సంపాదిస్తున్నారు. నగరాల్లో అయితే అపార్టుమెంట్లు అద్దెకు తీసుకుని అనధికార క్లబ్బులు నిర్వహిస్తున్నారు. మాచర్ల ప్రాంతం తెలంగాణకు సమీపంగా ఉండటంతో, ఆ రాష్ట్రం నుంచి కూడా పేకాట రాయుళ్లు తరలివస్తున్న పరిస్థితి.

ప్రధానంగా మాచర్ల, రేపల్లె, గుంటూరు సిటీలో…విచ్చలవిడిగా పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారన్న విమర్శలు, చాలాకాలం నుంచి వినిపిస్తున్నాయి. గతంలో చిలకలూరిపేట, గుంటూరు సిటీలోని పేకాట శిబిరాలపై , దాడులు కూడా జరిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

ప్రధానంగా తాడేపల్లి ప్రాంతం.. ఇటీవలి కాలంలో అనధికార పేకాట క్లబ్బులకు నిలయంగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో కొందరు మహిళలు, పురుషులు కలసి పేకాట ఆడుతున్న సమయంలో, పోలీసులు దాడి చేసిన వైనం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత మంగళగిరి సమీపంలో కేవలం మహిళలే ఒక అపార్టుమెంట్‌లో పేకాట ఆడుతూ పట్టుబడిన వైనంపై చర్చ జరిగింది. అయితే ఇవన్నీ వ్యవస్థీకృతం కాదని పోలీసువర్గాలు చెబుతున్నాయి.

ఇప్పుడు రేపల్లెలో బంకిని పేరుతో.. నెలకు కోట్లాదిరూపాయలు సంపాదిస్తున్న వైసీపీ నేత ‘అన్నయ్యతమ్ముడు’ హవాకు, రేపల్లెలో ఎదురులేకుండా పోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గుడ్‌విల్ పేరుతో కోట్లు సంపాదిస్తున్న ఆయనపై, చర్యలు తీసుకునేందుకు పోలీసు పెద్దలు భయపడుతున్నారన్న విమర్శలున్నాయి.

ఇదే ప్రభుత్వంలో గతంలో దాడి చేసిన సందర్భంగా సూత్రధారులు పరారయ్యారు. అప్పట్లో నిజాయితీ, ధైర్యం గల ఎస్‌ఈబీ , అక్కడ దాడి చేయించే సాహసం చేసింది. అయితే వారిపై సదరు వైసీపీ ప్రజాప్రతినిధి ఏకంగా సీఎం జగన్‌కు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ సీఎం జగన్, సదరు వైసీపీ నేతపైనే అక్షింతలు వేశారు. గుడివాడలో అధికార పార్టీ నేతల పేకాట శిబిరాలపైనా, అదే ఎస్‌ఈబీ దాడులు చేయించింది. అప్పుడు కూడా ఎస్‌ఈబీపై నాటి మంత్రి ఫిర్యాదు చేసినా, సీఎం పట్టించుకోలేదన్న ప్రచారం పోలీసు వర్గాల్లో వినిపించింది. ఇప్పుడు ఆ ధైర్యం ఉన్న మొనగాళ్లు కరువయ్యారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఈ పేకాట పర్వంపై రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, ఇటీవల సీఎం జగన్‌కు లేఖ రాశారు. రేపల్లె నియోజకవర్గంలో.. వైసీపీ ఎంపీ కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న పేకాట శిబిరాల వివరాలను, ఎమ్మెల్యే తన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. పేకాట క్లబ్బులు ఎవరు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని, 2020 డిసెంబర్ 1న అసెంబ్లీలో మీరిచ్చిన హామీ ఏమైందని తన లేఖలో ఎమ్మెల్యే ప్రశ్నించారు.

LEAVE A RESPONSE