– మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాం
– మనం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిద్దాం
– జగన్ అంటే ప్రజల్లో నమ్మకం, విశ్వాసం
– వెంటిలేటర్‌పై తెలుగుదేశం పార్టీ
– శ్వాస అందించేందుకు పవన్ కళ్యాణ్ తాపత్రయం
– అనంత కార్పొరేషన్లో ప్రతిపక్షం లేదంటే అది కార్యకర్తల కృషే
– మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స ప్రత్యేక చొరవతోనే అనంతలో అభివృద్ధి పనులు
– 2024 ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరడమే లక్ష్యంగా పనిచేద్దాం
– ట్రబుల్ షూటర్.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
– పదవుల్లో మా నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇవ్వండి
– అనంతపురం నియోజకవర్గ విస్త్రృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే అనంత
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం..బలగం కార్యకర్తలేనని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ రోజు వైసీపీ దేశంలోనే బలమైన శక్తిగా అవతరించిందంటే అందులో కార్యకర్తలు, నాయకుల కృషి ఎనలేనిదని అన్నారు. సోమవారం నగరంలోని గుత్తి రోడ్డులో ఉన్న విద్యుత్ కళాభారతిలో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడి ఆధ్వర్యంలో అనంతపురం నియోజకవర్గ వైసీపీ విస్త్రృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆవిర్భవించి ఈరోజు బలమైన శక్తిగా అవతరించిందన్నారు. ట్రబుల్ షూటర్‌గా పేరుగాంచిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వంలో 2024 ఎన్నికల్లో అనంతపురం జిల్లాలోని అన్ని స్థానాల్లో వైసీపీ విజయం సాధించేలా అందరూ కృషి చేస్తామని చెప్పారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి అధికారంలోకి వచ్చాక వైసీపీ పని అయిపోయిందని అంతా అనుకున్నారని, కానీ పార్టీ గట్టిగా నిలబడిందంటే అది కార్యకర్తల బలం వల్లేనని అన్నారు.
2019 ఎన్నికలకు ముందు రావాలి జగన్ కావాలి జగన్ పేరుతో ప్రజల్లోకి వెళ్లి నవరత్నాల హామీలు ఇచ్చామని, వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రతి హామీని అమలు చేశామన్నారు. కార్యకర్తల కష్టం వల్లే 151 స్థానాల్లో వైసీపీ జెండా ఎగిరిందని అన్నారు. అతిరథ మహారధులు కూడా ఆ ఎన్నికల్లో గాలికి పోయారన్నారు. గతంలో తాను ఎంపీగా కూడా పని చేశారని, కానీ ఇప్పుడు జరుగుతున్నంత సంక్షేమం, అభివృద్ది ఎన్నడూ జరగలేదన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఉచిత విద్యుత్‌పై సంతకం చేస్తే.. జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే మేనిఫెస్టోను అమలు చేస్తున్నారన్నారు.
జగన్ అంటే నమ్మకం.. విశ్వాసం
ఎక్కడైనా అధికారంలో ఉన్న పార్టీ ప్రజల్లోకి వెళ్లాలంటే కొంచెం భయం ఉంటుందని, కానీ తాము ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాం కాబట్టే ధైర్యంగా గడప గడపకు వెళ్తున్నామని ఎమ్మెల్యే అనంత తెలిపారు. ఎన్నికల్లో ఓటు అడిగాం.. అధికారంలోకి వచ్చాక ప్రతి ఇంటికి సంక్షేమ పథకాన్ని అందిస్తున్నాం అనే సంతోషం వైసీపీ కార్యకర్తలుగా మనకు ఉందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం ప్రజల్లో ఉందని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయన్నారు.
ట్రబుల్షూటర్.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
సంస్థాగతంగా పార్టీని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం అందరిపై ఉందని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. అందుకే ట్రబుల్షూటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన సుదీర్ఘ అనుభవంతో జిల్లాకు ఇన్చార్జ్గా అటు పార్టీ, ఇటు ప్రభుత్వ బాధ్యతలు తీసుకున్నారన్నారు. జిల్లాకు ఆయన రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలే కాకుండా ఓ వర్గం మీడియా కూడా కుట్రలు చేస్తోందని, అందరూ కలిసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.
వెంటిలేటర్‌పై తెలుగుదేశం పార్టీ
తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్‌పై ఉందని, దానికి ఊరిపి అందించడానికి పవన్‌కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే అనంత తెలిపారు. అనంతపురం నియోజకవర్గంలో రూ.800 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయని, సీఎం జగన్మోహన్రెడ్డి చొరవ వల్లే ఇది సాధ్యమైందన్నారు. మనం చేసిన పనులను ప్రజలకు వివరిద్దామని పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల్లో అనంతపురం నియోజకవర్గంలో 29 వేలకు పైగా మెజార్టీ వచ్చిందని గుర్తు చేశారు. ఆ తర్వాత జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ ఒక్క డివిజన్ కూడా గెలవలేదని.. ఇది కార్యకర్తల కృషి, ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్లే సాధ్యమైందన్నారు.
మా కార్యక్తలకు ప్రాధాన్యత ఇవ్వండి
పార్టీ కోసం కష్టపడి పని చేసిన కార్యకర్తలకు పదవులు ఇచ్చే విషయంలో ఇతర నియోజకవర్గాలకు, అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి తేడా ఉందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తీసుకెళ్లారు. ఇతర నియోజకవర్గాల్లో మండలాలు ఉంటాయని.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచ్‌లు ఇలా ఎన్నో పదవుల్లో కార్యకర్తలకు చోటు కల్పించే అవకాశం ఉందన్నారు. కానీ అనంతపురం నియోజకవర్గంలో 50 డివిజన్లు మాత్రమే ఉన్నాయని, ఇలాంటి తరుణంలో వివిధ కార్పొరేషన్లు, ఇతర పదవుల్లో అనంతపురం నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలకు చోటు కల్పించాలని విన్నవించారు.
మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స ప్రత్యేక చొరవతోనే అభివృద్ధి
మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ ప్రత్యేక దృష్టి పెట్టడం వల్లే అనంతపురం నగరంతో పాటు నియోజకవర్గంలోని నాలుగు పంచాయతీల్లో అభివృద్ధి పనులు జరిగాయని ఎమ్మెల్యే అనంత తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని నిధులు కేటాయించి అనంతపురం నియోజకవర్గ అభివృద్ధికి సాయం అందించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు ఎంపీ, 14 ఎమ్మెల్యే స్థానాల్లోనూ వైసీపీ గెలిచితీరుతామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్రెడ్డి చెప్పిన వైనాట్ 175 నినాదానికి అనంతపురం ముందుంటుందని, ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు. వైసీపీ జెండా రెపరెపలాడడమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు.