Suryaa.co.in

Andhra Pradesh

పోలీసు ఉద్యోగాల భర్తీకి గరిష్ట వయోపరిమితి ఐదేళ్లు సడలించాలి

ఏపీ పోలీస్ నియామకాల బోర్డు చైర్ పర్సన్ కి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి జాతీయ నారా లోకేష్ లేఖ

ఎట్టకేలకు వైసీపీ సర్కారు పోలీస్ ఉద్యోగాలకు జారీ చేసిన నోటిఫికేషన్ నిబంధనలతో చాలా మందికి అందని ద్రాక్షలా మారింది. టిడిపి ప్రభుత్వ హయాంలో 2018లో పోలీసు ఉద్యోగాల భర్తీకి చివరి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రతీ ఏటా పోలీసుశాఖలో ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టిన వైసీపీ సర్కారు, మూడున్నరేళ్ల తర్వాత పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నాలుగేళ్ల విరామం తర్వాత పోలీసు శాఖలో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ వెలువడడంతో ఉద్యోగార్థులు సంతోషపడ్డారు. అయితే వారి ఆనందం గరిష్ట వయో పరిమితి నిబంధనతో ఆవిరైంది. యువత ఏళ్ల తరబడి పోలీసు ఉద్యోగం కోసం శిక్షణ తీసుకుంటున్నారు. వారికి ఈ నోటిఫికేషన్ వేదన కలిగిస్తోంది. వయోపరిమితి నిబంధన వలన ఎంతోమంది అనర్హులుగా మారిపోయారు.

పోలీసు ఉద్యోగార్థుల గరిష్ట వయోపరిమితి కనీసం ఐదు సంవత్సరాలు సడలించాలని డిమాండ్ చేస్తున్నాను. వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నరేళ్లలో ఉద్యోగాల భర్తీకి ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో చాలా మంది అభ్యర్థులు వయస్సు దాటిపోయి అనర్హులుగా మారారు. మన పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రం పోలీస్ శాఖ ఉద్యోగాలకు 5 సంవత్సరాల గరిష్ట వయో పరిమితి సడలింపును ఇచ్చిన విషయం పరిగణనలోకి తీసుకుని ఏపీలో కూడా వయోపరిమితి సడలింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. ఏటా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామనే హామీ వైసీపీ సర్కారు విస్మరించడం, నాలుగేళ్లుగా పోలీస్ శాఖ జాబ్స్ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల చాలా మంది అనర్హులయ్యారు. వయోపరిమితి దాటి అర్హత కోల్పోయిన వారందరకూ ఉద్యోగార్థ పరీక్షలు రాసేందుకు వీలుగా గరిష్ట వయోపరిమితిని ఐదేళ్లకు పెంచాల్సిన అవసరం ఉంది.

LEAVE A RESPONSE