Suryaa.co.in

Andhra Pradesh

విపక్షాలకు “సంక్రాంతి అస్త్రం”గా మద్యం విక్రయాలు

– గత ఏడాది కేసినో సరసనా నిలిచే అవకాశం
– గుండాట, పేకాట, కోళ్ళ బరులే లక్ష్యంగా మద్యం స్టాల్స్
– కోతముక్క కేంద్రాలకు భారీగా తరలించేందుకు ఏర్పాట్లు
– రూ.30లక్షల మద్యం విక్రయాలు జరుగుతాయని అంచనా
– బార్ల నుండి భారీగా మద్యం కొనుగోళ్ళకు సన్నాహాలు

కృష్ణాజిల్లా గుడివాడలో సంక్రాంతికి నిర్వహించే గుండాట, కోతముక్క, కోళ్ళ బరులే లక్ష్యంగా జరిగే మద్యం విక్రయాలు ఈ ఏడాది ప్రతిపక్షాలకు ఒక అస్త్రంగా మారే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. గతేడాది “గుడివాడ కేసినో” వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అదేస్థాయిలో ఈ ఏడాది అక్రమ మద్యం విక్రయాలు కూడా కేసినో సరసన నిలిచే పరిస్థితులున్నాయని అనుమానిస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా ఈ మద్యం విక్రయాలపై ఒక కన్నేసి ఉంచినట్టుగా విశ్వసనీయ సమాచారం.

గుడివాడ రూరల్ మండలం లింగవరంలోని కే. కన్వెన్షన్ లో గత కొన్నేళ్ళుగా జాతీయస్థాయిలో ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీలు జరుగుతూ వస్తున్నాయి. ఈ పోటీలకు సమీపంలోనే ప్రతి ఏటా కోతముక్క, కోడిపందాలు, గుండాట వంటివి భారీ ఎత్తున జరుగుతుంటాయి. ఒక్క గుండాట పెట్టుకోవడానికి గత ఏడాది రూ.49లక్షలకు పర్మిషన్ ఇచ్చారంటే ఈ ఆట ఏ స్థాయిలో జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఈ కోడిపందాల కోసం రెండు బరిలను సిద్ధం చేస్తుంటారు. పండుగ మూడు రోజుల పాటు నిరంతరాయంగా కోళ్ళ పందాలు జరుగుతూనే ఉంటాయి.

రాష్ట్ర నలుమూలల నుండి పందెం కోళ్ళతో పందాలు వేసేందుకు ఇక్కడకు వస్తుంటారు. వీటిని వీక్షించేందుకు కూడా వేలాది మంది తరలివస్తుంటారు. వీటితో పాటు కోతముక్క బరి కూడా పేకాట రాయుళ్ళతో కళకళలాడుతుంటుంది. ఇంకా వీటి పక్కనే బిర్యానీ స్టాల్స్ కూడా ఉంటాయి. ఈ బిర్యానీ స్టాల్స్ పర్మిషన్ కు కూడా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. వీటన్నింటికీ అనుబంధంగా రెండు, మూడు మద్యం స్టాల్స్ కూడా నిరంతరంగా నడుస్తుంటాయి. మద్యం ఏరులై పారడమంటే ఏంటో ఇక్కడ చూసి అర్ధం చేసుకోవచ్చు.

ఇదిలా ఉండగా గుండాట, కోతముక్క, కోళ్ళ బరిల దగ్గరకు వేలాది మంది పందెం రాయుళ్ళు మూడు రోజుల పాటు కదం తొక్కుతుంటారు. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసే మద్యం స్టాల్స్ కు భారీగా మద్యాన్ని తరలించేందుకు గత ఏడాది మాదిరిగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక్కడకు స్కాచ్ దగ్గర నుండి చీప్ లిక్కర్ వరకు అన్నిరకాల మద్యం బ్రాండ్లను సమకూర్చుకుంటున్నారు. ఈ ఏడాది సంక్రాంతి పండుగ రోజుల్లో దాదాపు రూ.30లక్షల మేర అక్రమ మద్యం విక్రయాలు జరగనున్నాయని అంచనా వేస్తున్నారు.

ఈ మద్యాన్ని గుడివాడ పట్టణంలోని బార్ అండ్ రెస్టారెంట్ల నుండి భారీగా కొనుగోలు చేసి సంక్రాంతి బరిల దగ్గర ఏర్పాటు చేసుకున్న స్టాల్స్ కు తరలించే ఏర్పాట్లలో పలువురు నిమగ్నమైనట్టుగా తెలుస్తోంది. గత ఏడాది కేసినో వ్యవహారం మాదిరిగా ఈ ఏడాది సంక్రాంతికి అక్రమ మద్యం విక్రయాలు జరుగుతాయని భావిస్తున్న ప్రతిపక్షాలకు మాత్రం బంపరాఫర్ దొరికినట్టే కన్పిస్తోంది.

కేసినో వ్యవహారంలో ఏడాది పాటు ప్రతిపక్షాలు చేసిన రాద్దాంతం అంతా ఇంతా కాదు. ఏడాది తర్వాత కేసినో ఆరోపణలు చేసిన ప్రతిపక్షాలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుండి నోటీసులను కూడా అందుకున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వం కూడా గుడివాడలో కేసినో జరిగిందో, లేదో అనే దానిపై స్పష్టత ఇవ్వలేకపోయింది. కేసినో వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మాత్రం వాటన్నింటినీ తనదైన శైలిలో ఎదుర్కొనగలిగారు.

ఈ నేపథ్యంలో మళ్ళీ జనవరి నెల వచ్చేసింది. ప్రతి ఏటా మాదిరిగా ఈ ఏడాది కూడా సంక్రాంతికి గుడివాడ పట్టణం పేకాట, గుండాట, కోడిపందాలు వంటి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిపోనుంది. సంక్రాంతి పండుగ ముందు వరకు కోతముక్క కేంద్రాలు, కోళ్ళ బరిలపై దాడులు చేసి కేసులు పెట్టే పోలీసులు పండుగ మూడు రోజులు మాత్రం పట్టించుకోని పరిస్థితి ఉంది. అలాగే అక్రమ మద్యం విక్రయాలను అరికట్టాల్సిన ఎస్ఈబీ అధికారులు కూడా చేతులెత్తేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.

మద్యం ఎలాగూ బార్ అండ్ రెస్టారెంట్లు, ప్రభుత్వ వైన్ షాపుల్లో దొరుకుతున్నప్పుడు పేకాట, కోళ్ళ బరిల దగ్గర ఎందుకు విక్రయించాల్సి వస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల అనవసర గొడవలు కూడా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది మాదిరిగా కాకుండా ఈ ఏడాదైనా కనీసం అక్రమ మద్యం విక్రయాలు జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

LEAVE A RESPONSE