-తెలంగాణకు హరితహారం, అటవీ పునరుద్దరణ, అర్బన్ ఫారెస్ట్ పార్కుల అధ్యయనం
-కొత్త రాష్ట్రమైనా పచ్చదనం పెంపులో అద్భుత ప్రగతి సాధించిందని ట్రెయినీల ప్రశంస
ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడెమీ, డెహ్రాడూన్ లో శిక్షణలో ఉన్న 33 మంది (2021 బ్యాచ్) ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారులు తెలంగాణలో పర్యటించారు. జాతీయ ఫారెస్ట్ అకాడెమీలో రెండేళ్ల శిక్షణలో ఉన్న ఈ అధికారుల బృందం క్షేత్ర పర్యటనలు, విజయవంతమైన అటవీ పద్దతులను అధ్యయనం చేయటంలో భాగంగా హైదరాబాద్, సిద్దిపేట, మేడ్చల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రెండు రోజుల పాటు పర్యటించారు.
పర్యావరణ మార్పులను ఎదుర్కోవటంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం, అటవీ శాఖ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని ట్రెయినీ ఐఎఫ్ఎస్ ల బృందం ప్రశంసించింది. కొత్త రాష్ట్రమైనా అడవుల నిర్వహణ, పచ్చదనం పెంపును ఒక ప్రాధాన్యతా పథకంగా అమలు చేస్తూ గొప్ప ఫలితాలు రాబట్టారని రాష్ట్ర అటవీ అధికారులను అధ్యయనం బృందం సభ్యులు మెచ్చుకొన్నారు. తెలంగాణలో చూసిన, నేర్చుకున్న అటవీ పద్దతులు తమ సర్వీసులో చాలా ఉపయోగపడతాయని ట్రెయినీ అధికారులు తెలిపారు.
ముందుగా అరణ్య భవన్ లో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్ & హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం.డోబ్రియాల్, ఇతర ఉన్నతాధికారులతో ఈ టీమ్ సమావేశమైంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత గత ఎనిమిదేళ్లుగా అటవీశాఖ అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలను పీసీసీఎఫ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ముఖ్యమంత్రి కేసీయార్ సంకల్పం, పట్టుదలతో పాటు అటవీశాఖకు ఇచ్చిన ప్రోత్సాహంతో తెలంగాణకు హరితహారం విజయవంతం అయిందని, 270 పైగా కోట్ల మొక్కలు నాటి, 7.7 శాతం పచ్చదనం వృద్దిని రాష్ట్రమంతటా సాధించామని ఆయన వెల్లడించారు.
ఆ తర్వాత ఈ అధికారుల బృందం మేడ్చల్ కండ్లకోయ అర్బన్ ఫారెస్ట్ పార్క్, ఔటర్ రింగ్ రోడ్డు, రాజీవ్ రహదారిపై పచ్చదనం, రహదారి వనాల అభివృద్ది (అవెన్యూ ప్లాంటేషన్), సిద్దిపేట జిల్లా నర్సంపల్లి బ్లాక్ ప్లాంటేషన్, అటవీ పునరుద్దరణ పనులు, ములుగు మోడల్ నర్సరీలను పరిశీలించారు. ప్రతిపాదిత ఫారెస్ట్ యూనివర్సిటీ క్యాంపస్ సందర్శించి, డీన్ ప్రియాంక వర్గీస్ తో సమావేశమై ఫారెస్ట్ కాలేజీ విశిష్టతలను చర్చించారు.
రెండవ రోజు (17/01/2023) ట్రెయినీ ఐఎఫ్ఎస్ ల బృందం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ ప్రాంతాల్లో పర్యటించింది. క్షేత్ర స్థాయిలో అటవీ అధికారులకు ఎదురయ్యే సమస్యలు- పరిష్కార మార్గాలు, వన్యప్రాణుల భద్రత, అటవీ రక్షణ, అగ్ని ప్రమాదాలు అరికట్టే పద్దతులను కొత్తగూడెం అటవీ అధికారులు వివరించారు.
కార్యక్రమంలో పీసీసీఎఫ్ (కంపా) లోకేశ్ జైస్వాల్, పీసీసీఎఫ్ (ఎఫ్ సీఏ) ఎం.సీ. పర్గెయిన్, పీసీసీఎఫ్ (విజిలెన్స్) ఏలూసింగ్ మేరు, అటవీ శాఖ నోడల్ అధికారి శాంతారామ్, డెహ్రాడూన్ అకాడెమీ ఫాకల్టీ గోక్రా వాట్మే, ఆయా జిల్లాలకు చెందిన చీఫ్ కన్జర్వేటర్లు, అటవీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.