-వందే భారత్ రైలు గూర్చి సొల్లు ప్రచారం ఆపాలి
-శతాబ్ది ఎక్స్ ప్రెస్, గతిమాన్ ఎక్స్ ప్రెస్, వందే భారత ఎక్స్ ప్రెస్ , ఈ మూడు రకాల రైళ్లు ఈ కాలంలో వచ్చినవే
ఫ్రాన్స్ ,బ్రిటన్,ఇటలీ,జపాన్,చైనా లాంటి దేశాల్లో 300 కిలోమీటర్లు 400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి,అవి బుల్లెట్ రైళ్లు. పై చెప్పిన మూడు రైళ్లు వాటి వేగాన్ని గురించి ఒకసారి పరిశీలించండి. 1988లో ప్రవేశపెట్టిన శతాబ్ది ఎక్స్ప్రెస్ దాని గరిష్ట వేగం 110 నుంచి 150 kmph,అయితే ఆచరణలో గరిష్ట వేగం 98 కిలోమీటర్లు మాత్రమే.
ఆ తర్వాత,2016లో గతిమాన్ ఎక్స్ప్రెస్ వచ్చింది,దాని గరిష్ట వేగం 110 నుంచి 160 కిలోమీటర్లు అయితే ఆచరణలో అది కూడా 90 kmph. ఇప్పుడు నూతనంగా వచ్చిన వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇది 2019లోనే ప్రవేశపెట్టారు.ఆంధ్ర కు రావడానికి నాలుగేళ్లు పట్టింది. శతాబ్ది ఎక్స్ప్రెస్ ని అధిగమించడమే దీని లక్ష్యం, అయితే దీని వేగం కూడా 130 నుంచి 160 గరిష్ట పరిస్థితుల్లో 180kmph.ఇది సెమీ హై స్పీడ్, అయితే దీని ఆచరణాత్మక వేగం 90 కిలోమీటర్లు.
సామాన్యుడు దీంట్లో ప్రయాణం చేయలేడు సరిగదా కనీసం ఊహించను కూడా ఊహించ లేడు.మామూలు ఎక్స్ప్రెస్ రేటికంటే దీనిని ధర మూడు రెట్లు కంటే ఎక్కువగా ఉన్నది. రాజమండ్రి నుండి సికింద్రాబాద్ కు గౌతమి ఎక్స్ ప్రెస్ లో స్లీపర్ బెర్తు 325 రూపాయలు,వందే భారత్ రైలులో 1425 రూపాయలు, అందులో 350 రూపాయలు భోజన ఖర్చు. సామాన్యుడు ఎవరు భరించలేడు. గౌతమి ఎక్స్ ప్రెస్ లో ప్రయాణ సమయం ఎనిమిది గంటల 25 నిమిషాలు వందేభారత లో కేవలం రెండు గంటలే ముందుగా తీసుకెళ్తుంది. 6 గంటల18 నిమిషాలు.ఈ మాత్రం దానికి అంత భయంకరమైన రేటు పెట్టాలా! ఇంత సొల్లు ప్రచారం చేయాలా!
స్వదేశీ పరిజ్ఞానం అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు,సిగ్గు లేకపోతే సరి.స్వదేశీ పరిజ్ఞానాన్ని ప్రయోగాలని పూర్తిగా పక్కన పెట్టింది కేంద్ర ప్రభుత్వమే.ఆఖరికి విగ్రహాలు తయారు చేయడానికి కూడా పక్కనున్న దేశాలకి కాంట్రాక్ట్ ఇస్తున్నారు రామానుజాచార్యుల విగ్రహం ఈ దేశంలో తయారు చెయ్యగలం, పటేల్ విగ్రహాన్ని తయారు చేయగలం,కానీ రెంటికీ పక్క దేశంలోనే తయారు చేసింది. చెప్పేవి మాత్రం స్వదేశీ కబుర్లు. తెలుగు రాష్ట్రాల మీదుగా వంద రైళ్లు పైగా ప్రయాణిస్తున్నాయి. వందే భారత్ రైలు కేవలం ఒక్కటే. అది కూడా పై చెప్పిన వేగంతో. ఇతర దేశాల్లో ఉపయోగిస్తున్న గంటకు 300 నుండి 400 కిలోమీటర్ల వేగం ఏనాటికి చేరుకుంటాం.చేరుకుంటే సామాన్యుడు, ప్రయాణించగలడా !
ఈ వివరాలు చూడండి
ఈజిప్టు 230 కిలోమీటర్లు
మొరాక్కో 320 kmph
జపాన్ 374 kmph
ఫ్రాన్స్ 357 kmph
స్పెయిన్ 400 kmph
చైనా 420 kmph
ఇందులో మొరాక్కో అదేమన్నా పెద్ద దేశమా,ఆఫ్రికా దేశం.ఈజిప్టు ఇదేమన్నా అభివృద్ధిలో ఉన్న దేశమా! భారత దేశం గురించి వెనకబడి పోయి ఉన్నామని చెప్పుకోవడానికి సిగ్గుతో చచ్చిపోతున్నాము. ఇప్పటికయినా అదాని అభివృద్ధి, అంబానీ అభివృద్ధి గురించి,కార్పొరేట్ల అభివృద్ధి గురించి కాదు, దేశం అభివృద్ధి గురించి ఆలోచిస్తే మనం ముందుకు వెళ్లగలగలం.
– దువ్వ శేష బాబ్జి