ఎస్సీ, ఎస్టీల సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఉప ప్రణాళిక చట్టం తీసుకువచ్చి అందరికీ మార్గదర్శకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచింది. పదేళ్ళ తరవాత ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసి… ఆ చట్టం ముఖ్యోద్దేశాన్ని నీరుగార్చారని మాట్లాడుకోవాల్సి రావడం దురదృష్టకరం.
ఎస్సీ కార్పొరేషన్ ను పరిపుష్టం చేయడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన, ఆయా వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ముందడుగు వేస్తామని ఈ చర్చ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. గిరిజనుల సంక్షేమం, అభ్యున్నతి కోసం ప్రణాళికాబద్ధమైన కార్యక్రమాలు చేపట్టడంతోపాటు ఐ.టి.డి.ఏ.లకు పూర్వ వైభవం తీసుకురావడాన్ని బాధ్యతగా తీసుకుంటాం.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు కాలపరిమితిని మరో పదేళ్ళు పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడం ఒక కంటి తుడుపు చర్యగానే ఈ సమావేశం భావిస్తోంది. సమగ్ర ప్రణాళిక తయారీ, నిధుల కేటాయింపు – వినియోగంపై దృష్టి సారించి నిర్దుష్ట కార్యాచరణతో పూర్తి స్థాయి ప్రత్యేక నిధి చట్టంగా రూపొందించాలని జనసేన పార్టీ ఎస్సీ, ఎస్టీల పక్షాన తీర్మానిస్తోంది.