-సభలకు అనుమతి కోరినా పోలీసులు స్పందించడం లేదు.
-యువగళంతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి
– టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి
వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. లోకేష్ పాదయాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు ఎన్నిసార్లు అనుమతి కోరినా నిరాకరిస్తున్నారు. చిత్తూరు పట్టణంలో పెట్టిన సభకు అడ్డంకులు సృష్టించారు. ఐదు రోజులుగా పోలీసుల వెనక అనుమతి కోసం 30 సార్లు తిరిగాం. అయినా స్పందించడం లేదు. వైసీపీ నాయకులు, మంత్రులు ప్రభుత్వం అడ్డుకోవడం లేదని చిలకపలుకులు పలుకుతూ ప్రజల ముందు నాటకాలాడుతున్నారు.
పోలీసులు చెప్పిన చోట మీటింగ్ పెట్టుకుంటామని చెప్పినా స్పందన లేదు. చిత్తూరులో పాలిటెక్నిక్ కాలేజీలో సభ పెట్టుకోండని చెప్పి..కాలేజీ యాజమాన్యానికి మాత్రం ఇవ్వొద్దని చెప్పారు. దీంతో వాళ్లు కూడా సభ పెట్టడానికి అవకాశం లేదన్నారు. దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఉంది. అనుమతి కోసం లేఖ ఇస్తుంటే తీసుకోవడానికి వెనకాడుతున్నారు. మెయిల్ ద్వారా లేఖ పంపాము. దీన్ని బట్టి వైసీపీ ప్రభుత్వం లోకేష్ వేసే ప్రతి అడుగుకు అడ్డంకలు కల్పిస్తోంది.
వైసీపీ నేతలు కూడా సిగ్గుపడాలి. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ర్యాలీ పెట్టుకున్నారు. మైకులు పెట్టుకున్నారు. అక్కడ జీవో-1 ఆ రూల్స్ వర్తించవా.? మాకు అంబేద్కర్ రాజ్యాంగం..మీకు రాజారెడ్డి రాజ్యాంగమా.? వైసీపీ గడపగడపకు తిరుగుతోంది. వారికి అడ్డంకులు లేవు. సీఎం సభ పెడితే ట్రాఫిక్ ఆపి, స్కూళ్లకు సెలవులు ఇస్తున్నారు.
కానీ మా మీడియా వాహనాలు మాత్రం లాక్కుంటున్నారు. ఒక్కో అడుక్కు ఒక్కో అడ్డంకి పెడుతున్నారు. బ్రిటిష్ పాలకులు కూడా ఇంతటి అడ్డంకులు సృష్టించలేదు. వైసీపీకి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నదానికి ఈ అడ్డంకులే నిదర్శనం. వైసీపీ కుట్రలు ప్రజలు గమనించాలి. యువత ముందుకు రావాలి. రాజ్యంగాన్ని కాపాడుకోవాలి. మన హక్కులు మనమే కాపాడుకోవాలి. రాష్ట్రం నుండి రాజారెడ్డి రాజ్యాంగాన్ని సాగనంపాలి.