హైదరాబాద్ :- నందమూరి తారకరత్న పార్థివ దేహానికి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. మోకిలాలోని తారకరత్న నివాసానికి సతీమణి భువనేశ్వరితో కలిసి వెళ్లిన టీడీపీ అధినేత…. తారకరత్న పార్థివ దేహానికి పూలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం తారకరత్న భార్య అలేఖ్య, కుటుంబ సభ్యులను పరామర్శించారు. తామంతా ఉన్నామని ధైర్యంగా ఉండమని అలేఖ్యకు చంద్రబాబు చెప్పారు. అనంతరం మీడియాతో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. తారకరత్న మృతి చాలా దురదృష్టకరం, బాధాకరం. తారకరత్న కోలుకుని మళ్లీ తిరిగి వస్తారని ఆశించాం.
23 రోజులు మృత్యువుతో పోరాడి తారకరత్న చనిపోయారు. గత నెల 27వ తేదీ యువగళం కార్యక్రమంలో తారకరత్న హార్ట్ ఎటాక్ కు గురయ్యారు. స్థానికంగా ట్రీట్మెంట్ అందించి తారకరత్నను బెంగుళూరు తరలించాం. బతికించుకునేందుకు ఎంతో ప్రయత్నించినా తారకతర్న మాకు దక్కలేదు. చిన్న వయసులో తారకరత్న చనిపోవడం బాధేస్తోంది. సినీ రంగంలో మంచి భవిష్యత్తు ఉన్న వ్యక్తి తారకరత్న.
ఒకేరోజు తొమ్మిది సినిమాలు ప్రారంభోత్సవం చేసిన రికార్డు కూడా ఆయన దక్కించుకున్నారు. అమరావతి అనే సినిమాకు తారకరత్న నంది అవార్డు పొందారు. ఎప్పుడూ రాజకీయాలపట్ల ఆలోచన ఉన్న
వ్యక్తి…ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన ఉందని తారకరత్న చెప్పారు. సమయానుకూలంగా నిర్ణయం తీసుకుందాం అని నేను తారకరత్నకు చెప్పాను. తారకరత్న ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా అని చంద్రబాబు నాయుడు అన్నారు.