– ఈ పేపర్ టిష్యూగా కూడా పనికిరాదు
– చెత్త రాతలు రాస్తున్న ఈనాడు పత్రికను లైవ్ లోనే చించివేసిన అమర్నాథ్
– రాజకీయాలు చేయాలనుకుంటే పార్టీ పెట్టుకో రామోజీ!
– ఈనాడు పత్రిక సమాజానికి హానికరం…
– గ్లోబల్ సమ్మిట్ ముందు ఎందుకీ తప్పుడు రాతలు?
– బాబు అధికారంలో లేకపోతే రామోజీకి కడుపుమంట!
– రాష్ట్రానికి పరిశ్రమలు రావడం ఈనాడు రామోజీకి ఇష్టం లేదు
– బాబు హయాంలో పెట్టిన బకాయిలు రామోజీకి గుర్తుకు రావా..?
–మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపాటు.
-విశాఖపట్నంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్‌మీట్
మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే..
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకును అడ్డుకోవాలన్నది రామోజీ కుట్ర
పారిశ్రామిక రాయితీలు ఆగస్టులో కాదు, ఫిబ్రవరిలో ఇవ్వబోతున్నాం.. అని మా ప్రభుత్వం ముందుగానే చెప్పింది. ఫిబ్రవరిలో తీరా ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నందువల్ల, కోడ్ ఆఫ్ కాండక్ట్ ముగిసినపోయిన తర్వాత ఇస్తాం అని అందరికీ తెలుసు. పారిశ్రామిక రాయితీలను ఎగ్గొట్టిన చంద్రబాబు ప్రభుత్వాన్ని గురించి ఏనాడూ విమర్శించిన రామోజీ పత్రిక, క్రమం తప్పకుండా పారిశ్రామిక రాయితీల్ని విడుదల చేస్తున్న ప్రభుత్వం మీద ఎందుకిలా తప్పుడు రాతలు రాస్తుందంటే.. అందుకు కారణాలు రెండు. అవి ఏంటంటే..
1- ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసుగా ఏపీకి నంబర్ వన్ ర్యాంకు వస్తున్న మీదట ఆ ర్యాంకును అడ్డుకునే కుట్రలకు తెరలేపడం వారి మొదటి కుతంత్రం.
2- మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో జరగనున్న పారిశ్రామికవేత్తల సదస్సు నేపథ్యంలో తప్పుడు వార్తలతో పారిశ్రామికవర్గాలను రెచ్చగొట్టడం వారి రెండో ప్లాన్.
మరి, ఇంతగా రోజూ దిగజారుతున్న ఈనాడును ఏమనాలి..?
ఈనాడు సమాజానికి హానికరం
ధూమపానం ఆరోగ్యానికి హానికరం…అంటూ సిగరెట్‌పెట్టెలపై రాసినట్లుగానే..”ఈనాడు పత్రిక సమాజానికి హానికరం…రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు హానికరం…” అంటూ రాయాల్సిన అవసరముంది. రాష్ట్రంలో పరిశ్రమలు వస్తే రామోజీరావుకు కడుపుమంట… తనకు ఇష్టమైన వ్యక్తి అధికారంలో లేకుంటే ఆ కడుపుమంట మరింతగా పెరిగిపోతుంది. ఆ దుగ్ధతోనే ఈ రోజు తన పత్రికలో ‘పారిశ్రామిక రాయితీ జాడేది?’ అంటూ ఒక తప్పుడు కథనాన్ని ప్రచురించారు. ఈ పత్రికాధిపతికి, చంద్ర బాబు పారిశ్రామిక వేత్తలకు ఇవ్వాల్సిన రాయితీ బకాయిలు ఎగ్గొట్టిన విషయం మాత్రం గుర్తుకు రాదు. బాబు ఇవ్వకుండా వెళ్లిపోయిన బకాయిలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తీరుస్తూ వస్తున్నారు. ఇవేవీ ఆ పత్రికలో ప్రచురించరు. ఎందుకంటే రాష్ట్రంలో పారిశ్రామిక వికాసం జగన్ గారి ప్రభుత్వంలో జరగడం ఈ పత్రికకు ఇష్టం లేదు.
అంత దురద ఉంటే పార్టీ పెట్టుకో!
మీకంత ఎల్లో దురద ఉంటే, రాజకీయాలు చేయాలనుకుంటే, ఈనాడు రామోజీరావు కూడా ఒక పార్టీ పెట్టుకుని రాజకీయ పోరాటం చేయవచ్చు కదా.. బాబు పెట్టెలు మోయడం ఎందుకు..? కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పత్రిక పెట్టానని ప్రకటించిన రామోజీ, ఎన్టీఆర్ ను కొన్నాళ్లు సమర్థించి, ఆ తర్వాత బాబును గద్దెనెక్కించడానికి ఎన్టీఆర్ గురించి చెడు రాతలు రాసిన నైజం రామోజీది.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రాయితీలు
రాష్ట్రంలో పరిశ్రమలకు సంబంధించి ఎంఎస్‌ఎంఈలకు ఇవ్వాల్సిన దాదాపు రూ.726 కోట్ల ఇన్సెంటివ్ బకాయిల గురించి ‘ పారిశ్రామిక రాయితీ జాడేది?’ శీర్షిక పేరుతో ఈనాడులో వక్రంగా రాతలు రాశారు. వాస్తవానికి ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల ఈ రాయితీలు ఆగాయో తప్ప వీటిని ప్రభుత్వం ఆపలేదు. ఈ కోడ్ ముగిసిన వెంటనే ఈ రాయితీలు విడుదల చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే చెప్పారు. మా పరిశ్రమల విభాగానికి ఇప్పటికే ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. చిన్నపరిశ్రమలను ఆదుకోకపోతే చితికిపోతాయని, వాటిని ఆదుకోవాలన్న సదాశయంతో కోవిడ్ సమయంలో రూ. 900 కోట్లను అందించిన ఘనత జగన్ ది.
గ్లోబల్ సమ్మిట్ ముందు ఎందుకీ తప్పుడు రాతలు
మార్చి 3,4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ నిర్వహిస్తున్న తరుణంలో … ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం వల్ల పారిశ్రామిక వేత్తలను రాకుండా చేయాలని, ఇలాంటి కథనాలు ప్రచురిస్తే వారు పరిశ్రమల స్థాపనకు రాకుండా అడ్డుకోవచ్చన్న దుగ్ధతో రాసే రాతలు ఇవి. జగన్ కి ఎక్కడ పేరొస్తుందో అనే కడుపుమంటే తప్ప రాష్ట్రానికి మేలు జరగాలన్న ఆలోచన రామోజీలో ఏ కోశానా ఉన్నట్లు లేదు. అంటే నీకు కావాల్సిన మనిషి సీఎం స్థానంలో లేరని ఇలాంటి రాతలు రాస్తారా రామోజీ? నీకు కావాల్సిన మనిషి అధికారంలో ఉన్నప్పడు ఏమీ చేయకపోయినా చేశారని రాస్తారు. ఇదా నీ పాత్రికేయం? విశాఖలో జరగబోయే పారిశ్రామిక సదస్సు విజయవంతం కాకూడదు. పరిశ్రమలు రాకూడదు. రాష్ట్రానికి, జగన్ కి మంచి పేరు రాకూడదన్న దురాలోచనలతో ఇలాంటి రాతలు రాస్తున్నారు. పిచ్చి వార్తలు, చెత్తవార్తలు రాస్తున్నారు. ఇలాంటి పేపర్లను చించేయాలి. వీటిని బాత్రూమ్ లో టిష్యూ పేపర్లుగా వాడాలి? ఎందుకోసం, ఎవరికోసం ఈ రాతలు… మొన్ననే గన్నవరం సంఘటనలో పాత ఫొటోలు తెచ్చి బ్యానర్ వార్తలుగా ప్రచురించడం చూశాం. పరిశ్రమల గురించి అడ్డమైన రాతలు రాస్తున్నారు.. అంటూ ఈనాడు పత్రికను లైవ్ లోనే మంత్రి అమర్నాథ్ చించి వేశారు.
పాత్రికేయ విలువల వలువలూడుస్తున్న ఈనాడు
ఈనాడు పత్రికను అడ్డుపెట్టుకుని రామోజీరావు పాత్రికేయ విలువలకు వలువలూడుస్తున్నాడు. మీరు పత్రిక, పచ్చళ్ల వ్యాపారం, విశాఖలో ప్రారంభించలేదా? ఈ రాష్ట్రంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించుకుని, ప్రభుత్వంపై బురదజల్లుతారు… బాబుతో కలిసి వ్యాపారాలు చేసి, ఆయనతో కలిసి మరింతగా రాష్ట్రాన్ని దోచుకోవాలని, దీనికోసం ఏరకంగానైనా మా ప్రభుత్వంపై బురదజల్లుతామని అనుకుంటే మేం ఊరుకోం. ఆంధ్రప్రదేశ్‌లో తమకు నచ్చిన బాబు అధికారంలో ఉండాలని రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీయాలనుకోవడం సమంజసం కాదని గట్టిగా చెబుతున్నాను. రాష్ట్ర ప్రజలకు మంచిచేయాలన్న జగన్ ఆలోచనలకు, ఆశయాలకు ఈ పత్రిక వక్రపూరిత రాతలు అవరోధాలుగా మారుతున్నాయి.
బాబు హయాంలో రూ.3600 కోట్ల బకాయిలు…
బాబు హయాంలో రూ. 3600 కోట్ల బకాయిలు పెట్టి పారిశ్రామిక వేత్తలను ఇబ్బంది పెడితే… జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగాను, పవర్ టారిఫ్ కింద రూ.3000 కోట్లను చెల్లిస్తే అది కన్పించలేదా రామోజీ? పారిశ్రామిక వేత్తలకు ఇవ్వాల్సిన రాయితీలన్నీ ఇచ్చాం. ఇవేవీ మీ పత్రికకు కన్పించలేదా? అని అడుగుతున్నాను.
పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయి
మార్చి 3,4 తేదీల్లో విశాఖపట్నంలో పెద్ద ఎత్తున గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ప్రభుత్వం నిర్వహించబోతోంది. దేశ వ్యాప్తంగా అనేక మంది పారిశ్రామిక వేత్తలను ఈ సదస్సుకు ఆహ్వానించి, రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ఉన్న వనరులు, అవకాశాల గురించి వివరించబోతున్నాం. తద్వారా లక్షల కోట్ల పెట్టుబడులకు, లక్షలాది మంది యువతకు ఉద్యోగాల కల్పనకు ఇప్పటికే పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారు. ఈ గ్లోబల్ సమ్మిట్‌కు సన్నాహకంగా, గత నెల 31న ఢిల్లీలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు దాదాపు 50 దేశాల ప్రతినిధులు వచ్చారు. వీరే కాకుండా దేశంలోని వివిధ పారిశ్రామిక వేత్తలు, పారిశ్రామిక పెద్దలు కూడా హాజరయ్యారు. వారందరితో ముఖ్యమంత్రి జగన్ సమావేశమై రాష్ట్రంలో ఉన్న వనరులు, అవకాశాల గురించి వివరించి, పరిశ్రమల స్థాపనకు వారిని ప్రోత్సహిస్తూ ప్రసంగించారు. తద్వారా వారంతా ప్రపంచానికి మన రాష్ట్ర వనరులు, అవకాశాల గురించి చాటాలన్నది ముఖ్యమంత్రి జగన్ ఆశయం. ఈ క్రమంలోనే అదే రోజు ముంబయి, చెన్నై , బెంగళూరు, హైదరాబాద్ వంటి చోట్ల కూడా గ్లోబల్ సమ్మిట్ సన్నాహక సదస్సులు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. పరిశ్రమల స్థాపనకు అనువైన ప్రదేశంగా పారిశ్రామిక వేత్తలూ గుర్తిస్తున్నారు. ఈ సమ్మిట్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మార్చి 3,4 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ ఎందరికో అవకాశాలు కల్పించబోతోంది. రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రం మారబోతోంది.
ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో మూడేళ్లుగా మొదటిస్థానం
ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో రాష్ట్రం మూడేళ్లుగా మొదటి స్థానంలో నిలుస్తోంది. ఇది రాష్ట్రం పరిశ్రమలకు, పారిశ్రామిక వేత్తలకు ఇస్తున్న గుర్తింపునకు నిదర్శనంగా భావించాల్సిన తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు స్థాపించాలని దేశ విదేశాల నుంచి అనేక మంది పారిశ్రామిక వేత్తలు ఉత్సాహపడుతున్నారు. ఇందుకోసం జగన్ ఒక మంచి వాతావరణాన్ని సృష్టిస్తూ, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్లాలని తపిస్తుంటే…తద్వారా రాష్ట్రానికి ఎక్కడ మంచి పేరొస్తుందోనని ఈనాడు పత్రిక తన కడుపు మంట కొద్దీ తప్పుడు రాతలతో వక్రభాష్యాలు చెబుతోంది.
గ్లోబల్ సమ్మిట్‌కు 6500 మంది ప్రతినిధుల రిజిస్ట్రేషన్…
మన రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన కోసం పారిశ్రామిక వేత్తలు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 6500 మంది ప్రతినిధులు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. దేశ, విదేశాల్లోని పారిశ్రామిక దిగ్గజాలు తరలి వస్తున్నారు. ముకేశ్ అంబానీ, కుమార మంగళం బిర్లా, జీఎంఆర్ సంస్థ అధినేత, టాటా గ్రూప్, అదానీ గ్రూపుల నుంచి పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు రాబోతున్నారు.వీరంతా రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే పరిశ్రమల గురించి ఇప్పటికే వివిధ సదస్సుల్లో వివరించారు. అయినా ఇదేదీ ఈనాడుకు కన్పించడం లేదు. ఇప్పటికైనా ఈ పత్రికను దూరంగా పెట్టాలని, సమాజానికి , రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని ప్రజలంతా గమనించాలి.ఇటువంటి తప్పుడు రాతలు మానుకోవాలని హితవు చెబుతున్నా.
మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ…
దేశంలోనే రెండో అతి పెద్ద సముద్రతీరమున్న ప్రాంతంగా, సహజ వనరులు ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు గుర్తింపు ఉంది. గుజరాత్ కన్నా ఎక్కువగా వినియోగించుకోగలిగే సముద్రతీర ప్రాంతం ఉన్నది ఆంధ్రప్రదేశ్‌లో…మారిటైమ్ బోర్డు ద్వారా రూ. 15 వేల కోట్లను వెచ్చించి, రాష్ట్ర ప్రభుత్వం
ఇప్పటికే మూడు పోర్టులు నిర్మిస్తోంది. 9 ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నాం. పోర్టులకు ఆనుకుని ఉన్న చెన్నై, విశాఖ పారిశ్రామిక కారిడార్లలో 26,000 నుంచి 30,000 ఎకరాలు పరిశ్రమల స్థాపనకు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, పెట్రోకెమికల్స్, పర్యాటక, వైద్య తదితర రంగాలలో పెట్టుబడులకు అనువైన వనరులున్నాయి. వీటన్నిటినీ పారిశ్రామిక వేత్తలకు వివరించబోతున్నాం. పునరుత్పాదక ఇంధనం ద్వారా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రాబోతున్నాయని మరో ప్రశ్నకు సమాధానం గా చెప్పారు. మనది మిగులు విద్యుత్తు రాష్ట్రమని…పవర్ హాలిడే రాదని, ఆ అవకాశమే ఉండదని చెప్పారు. గత ఏడాదిలో విప్రో సంస్థను విశాఖలో ప్రాజెక్టును ప్రారంభించాలని కోరామని, ఆ సంస్థ ఏప్రిల్, మేలో వచ్చే అవకాశముందన్నారు.