Suryaa.co.in

Telangana

కంటోన్మెంట్ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలి

-రోడ్డు వెడల్పు చేసి ఫ్లై ఓవర్ బ్రిడ్జిని నిర్మిస్తాం
-ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు హైదరాబాద్ శివారులో ట్రాఫిక్ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది
-రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
-కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు వినోద్ కుమార్ లేఖ

హైదరాబాద్ శివారులో కరీంనగర్ ఉమ్మడి జిల్లా మార్గంలో ఉన్న కేంద్ర రక్షణ శాఖ కంటోన్మెంట్ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని, కంటోన్మెంట్ భూమిని వెడల్పు చేసి ఫ్లై ఓవర్ బ్రిడ్జిని రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందని, తద్వారా హైదరాబాద్ శివారులో ట్రాఫిక్ సమస్యలు తొలగిపోయి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు హైదరాబాద్ కు సాఫీగా రాకపోకలు సాగించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి రోడ్డు మార్గాన హైదరాబాద్ నగరానికి చేరుకునే క్రమంలో… హైదరాబాద్ శివారులో ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు హకీంపేట – బొల్లారం – అల్వాల్ – తిరుమలగిరి – కార్ఖానా – జింఖానా గ్రౌండ్ మధ్యలో రోడ్డును వెడల్పు చేసి ఫ్లై ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సుముఖంగా ఉన్నారని బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. కంటోన్మెంట్ రక్షణ శాఖ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని సీఎం కేసీఆర్ సహా రాష్ట్ర మున్సిపల్, ఐ.టీ. శాఖ మంత్రి కే.టీ.ఆర్ ఇప్పటికే పలు మార్లు ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర రక్షణ శాఖకు లేఖలు రాసిన విషయాన్ని వినోద్ కుమార్ గుర్తు చేశారు. ఈ మేరకు శనివారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు వినోద్ కుమార్ లేఖ రాశారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు హైదరాబాద్ నగరానికి రాకపోకలు సాగించే క్రమంలో… హైదరాబాద్ శివారులో హకింపేట నుంచి ప్రారంభమయ్యే ట్రాఫిక్ బొల్లారం, అల్వాల్, లోతుకుంట, లాల్ బజార్, తిరుమలగిరి, కార్ఖానా, జే.బీ.ఎస్. జింఖానా గ్రౌండ్స్ మధ్య కొనసాగుతోందని, ట్రాఫిక్ ఇక్కట్ల వల్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వినోద్ కుమార్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి హైదరాబాద్ శివారు వరకు ప్రయాణానికి పట్టే సమయం ఒక ఎత్తు అయితే… శివారు నుంచి హైదరాబాద్ నగరంలోకి చేరుకునే సమయం మరో ఎత్తుగా ఉంటుందని వినోద్ కుమార్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు ట్రాఫిక్ సమస్యను అధిగమించి సులువుగా హైదరాబాద్ చేరుకునేందుకు హకీంపేట – బొల్లారం – అల్వాల్ – కార్ఖానా – తిరుమలగిరి – జింఖానా గ్రౌండ్స్ మధ్య ఫ్లై ఓవర్ నిర్మాణం ఒక్కటే పరిష్కార మార్గం అని వినోద్ కుమార్ తెలిపారు.

అయితే హైదరాబాద్ నగరం నుంచి వరంగల్ జిల్లాకు వెళ్ళే దారిలో 6 నంబర్ జంక్షన్ నుంచి ఫ్లై ఓవర్ బ్రిడ్జిని నిర్మించారని, మెహిదిపట్నం నుంచి ఎయిర్ పోర్ట్ సహా మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్లేందుకు పీ.వీ. నర్సింహా రావు ఎక్స్ ప్రెస్ వే ఉందని, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాకు వెళ్లేందుకు ఫ్లై ఓవర్ బ్రిడ్జిని నిర్మిస్తున్నామని, కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ట్రాఫిక్ నుంచి బయట పడి ప్రయాణం కొనసాగించేందుకు మాత్రం ప్రత్యేకంగా మరో దారి లేదని వినోద్ కుమార్ వివరించారు. ఈ మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సాఫీగా రాకపోకలు సాగించేందుకు, ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు కంటోన్మెంట్ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని, ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని వినోద్ కుమార్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కోరారు.

LEAVE A RESPONSE