* సమసిన జాతీయ హ్యాండ్‌బాల్ సంఘం వివాదం
* భారత్‌లో అధికారిక హ్యాండ్‌బాల్ సంఘం హెచ్ఏఐ ఒక్కటే
* అంతర్జాతీయ, ఆసియా సంఘాల గుర్తింపు తమకే ఉంది
* ఇదే విషయాన్ని భారత ఒలింపిక్ సంఘానికి కూడా వారు స్పష్టం చేశారు
* దక్షిణాది, తెలంగాణ వ్యక్తినని అణగదొక్కడానికి ప్రయత్నించారు
* కుట్రలన్ని ఛేదించి బయటపడ్డాం
* టార్గెట్ ఒలింపిక్స్‌నే లక్ష్యంగా ఇకపై అడుగులు
* జూన్‌లో ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్
* హెచ్ఏఐ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు
హైదరాబాద్: జాతీయ హ్యాండ్‌బాల్ సంఘం పేరిట గత కొంతకాలంగా జరుగుతున్న రాజకీయాలు, కుట్రలకు శాశ్వతంగా ముగింపు పలికామని హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు వెల్లడించారు. అంతర్జాతీయ హ్యాండ్‌బాల్ సమాఖ్య, ఆసియా హ్యాండ్‌బాల్ సమాఖ్య గుర్తింపు తన సారథ్యంలోని హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు మాత్రమే ఉందని, తమదే అధికారిక సంఘమని జగన్మోహన్ రావు స్పష్టం చేశారు. ఆదివారం ఫిలింనగర్‌లోని ఎఫ్ఎన్సీసీ క్లబ్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో జాతీయ హ్యాండ్‌బాల్‌కు సంబంధించిన పలు విషయాలను ఆయన తెలియజేశారు. దిగ్విజయ్ చౌతాల నేతృత్వంలోని హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (హెచ్ఎఫ్ఐ) ఇక, నుంచి దేశంలో హ్యాండ్‌బాల్ కార్యకలాపాలు నిర్వహిస్తే భారత్‌పై ఐహెచ్ఎఫ్ బ్యాన్ విధించనుందని జగన్మోహన్ రావు చెప్పారు.
మూడేళ్లలో రెండు ఆసియా ట్రోఫీలు..
”ఒక జాతీయ ఒలింపిక్ క్రీడా సంఘానికి అధ్యక్షుడిని కావడమంటే సాధారణ విషయం కాదు. అనేక సవాళ్లతో కూడుకున్నటువంటిది. భారత హ్యాండ్‌బాల్ తురుపుముక్క, గురు సమానులు ఆనందీశ్వర్ పాండే ఆశీస్సులు, సహకారంతో అనతికాలంలోనే రాష్ట్ర అధ్యక్షుడు నుంచి జాతీయ అధ్యక్షుడిగా ఎదిగా. జాతీయ హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి దాదాపు మూడేళ్లు కావస్తోంది. ఈ ప్రస్థానంలో హ్యాండ్‌బాల్ అభివృద్ధికి అనేక విప్లవత్మాక సంస్కరణలు చేపట్టాం. పైరవీలు, రాజకీయ నాయకుల సిఫార్సులకు తలొగ్గకుండా దేశంలోని అత్యుత్తమ క్రీడాకారులను అన్వేషించి, ఎంపిక చేసి హిమాచల్‌ప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన ఎక్స్‌క్లూజివ్ హ్యాండ్‌బాల్ అకాడమీలో వారికి శిక్షణ ప్రారంభించాం. ఫలితంగా గడిచిన మూడేళ్లలో రెండు ఆసియా ట్రోఫీలు సాధించడంతో పాటు పలు అంతర్జాతీయ టోర్నీల్లో మెరుగైన ఫలితాలు సాధించాం. 2022 మార్చిలో జరిగిన ఆసియా మహిళల జూనియర్ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్ ట్రోఫీని కైవసం చేసుకున్నాం. 2022లోనే ఆసియా మహిళల యూత్ బీచ్ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచాం. ఈ ఏడాది ఆసియా మహిళల ప్రెసిడెంట్ కప్‌ను దేశానికి తీసుకొచ్చాం. ఈ ఏడాది జరగనున్న ఆసియా క్రీడలకు భారత మహిళల జట్టు అర్హత సాధించింది” అని జగన్మోహన్ రావు చెప్పారు.
ఇక అన్‌స్టాపబుల్..
”అతి తక్కువ కాలంలోనే ఇన్ని మంచి ఫలితాలు సాధిస్తే.. ఓర్వలేని కొందరు తనపై కుట్రలకు తెర తీశారు. నేనుంటే వారి కుంభకోణాలు, అక్రమ దందాలు సాగడం లేదని నన్ను తప్పించాలని శతవిధాలా ప్రయత్నాలు చేశారు. అందులోనూ దక్షిణాది, తెలుగు వ్యక్తికి జాతీయ సంఘం అధ్యక్షుడి బాధ్యతలు ఎలా ఇస్తారని నన్ను అధ్యక్ష పీఠం నుంచి దింపేందుకు కొందరు ఇంటిదొంగల సహాయంతో రకరకాల పన్నాగాలు పన్నారు. వాటన్నింటిని ఛేదించి హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చాం. హెచ్ఏఐ ఇక అన్‌స్టాపబుల్. దేశంలో హ్యాండ్‌బాల్ కార్యకలాపాలు హెచ్ఏఐ మాత్రమే నిర్వహించేలా భారత ఒలింపిక్ సంఘానికి అంతర్జాతీయ సంఘం లేఖ కూడా రాసింది. వైరి సంఘాలు ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి ఒక్క తాటిపైకి వచ్చి హెచ్ఏఐతో కలిసి పనిచేయాలి. ఒలింపిక్ క్రీడైన హ్యాండ్‌బాల్ రాణించడానికి ప్రతిభ ఉంటే చాలూ. ఎవరి సిఫార్సులు, పైరవీలు అవసరం లేదు. ప్రతిభావంతులైన పేద క్రీడాకారులకు అన్ని విధాలా అండగా ఉంటాం. హిమాచల్‌ప్రదేశ్‌లో వంటి ఎక్స్‌క్లూజివ్ హ్యాండ్‌బాల్ అకాడమీలను దేశం నలుదిక్కులా తెరుస్తాం. త్వరలో ఇలాంటి అకాడమీ ఒకటి రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో హైదరాబాద్‌లో కూడా ఏర్పాటు చేస్తాం” అని జగన్మోహన్ రావు చెప్పారు.
జూన్‌లో పీహెచ్ఎల్, జూలైలో ఆసియా చాంపియన్‌షిప్
”వచ్చే జూన్‌లో ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ తొలి సీజన్ పోటీలను నిర్వహించబోతున్నాం. జూన్ 8 నుంచి 25 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. జూలైలో ఆసియా మహిళల యూత్ చాంపియన్‌షిప్‌కు ఆతిథ్యమిస్తున్నాం. న్యూఢిల్లీ వేదికగా వచ్చే జూలై 15 నుంచి 24 వరకు ఈ పోటీలను నిర్వహిస్తున్నాం. జపాన్, చైనా, చైనీస్తైఫీ, ఇరాన్ సహా మొత్తం పది దేశాలు ఇందులో పాల్గొంటున్నాయి. గత ఏడాది హైదరాబాద్ వేదికగా ఆసియా పురుషుల క్లబ్ చాంపియన్‌షిప్‌ను విజయవంతంగా నిర్వహించడంతో ఈ ఆతిథ్య హక్కులు లభించాయి” అని జగన్మోహన్ రావు తెలిపారు.
మిషన్ ఒలింపిక్స్‌పై ఫోకస్
”2028 ఒలింపిక్స్‌కు భారత జట్లు అర్హత సాధించాలనేది నా స్వప్నం. ఇందుకోసం ఇప్పటినుంచే ప్రణాళికబద్ధంగా పని చేయాల్సి ఉంది. మిషన్ ఒలింపిక్స్‌ను విజయవంతం చేసేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నాం. టాలెంట్ హంట్ పెట్టి మెరికల్లాంటి క్రీడాకారులను గుర్తించి వారికి ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఇస్తే తప్పకుండా ఈ లక్ష్యం నెరవేరుతుంది. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఐఓఏ, సాయ్ సహకారంతో లక్ష్యం దిశగా అడుగులు వేస్తాం” అని జగన్మోహన్ రావు చెప్పారు. హ్యాండ్‌బాల్ సంఘంలో సంక్షోభం నెలకొన్నప్పుడు తనకు అండగా నిలిచిన ప్రస్తుత హెచ్ఎఫ్ఏ ప్రధాన కార్యదర్శి తేజ్‌రాజ్ సింగ్, ఇతర కార్యవర్గ సభ్యులు, 29 రాష్ట్రాల హ్యాండ్‌బాల్ సంఘాల అధ్యక్ష, కార్యదర్శలకు జగన్మోహన్ రావు కృతజ్ఞతలు తెలిపారు.
హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు మాత్రమే గుర్తింపు ఉంది: ఐహెచ్ఎఫ్
”భారత్ నుంచి హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (హెచ్ఏఐ)కు మాత్రమే అంతర్జాతీయ హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ (ఐహెచ్ఎఫ్) నుంచి గుర్తింపు ఉంది. భారత్‌లో హ్యాండ్‌బాల్ కార్యకలాపాలు నిర్వహించే అధికారం హెచ్‌ఏఐకే ఉంది. ఒకవేళ హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (హెచ్ఎఫ్ఐ) అనే సంస్థ భారత్‌లో దౌర్జన్యంగా కనుక కార్యకలాపాలు నిర్వహిస్తే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనకుండా సస్పెన్షన్ విధిస్తాం. భారత్‌లో అక్రమంగా హ్యాండ్‌బాల్ కార్యకలాపాలు నిర్వహించే వారిని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అడ్డుకోవాలి. అలానే తమ గుర్తింపు ఉన్న హెచ్ఏఐ స్వేచ్ఛగా పనిచేసేందుకు సహకరించాలి” అని ఐఓఏకు రాసిన లేఖలో ఐహెచ్ఎఫ్ జనరల్ డైరెక్టెర్ అమల్ ఖలీఫా స్పష్టం చేశారు.
హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకే హక్కు ఉంది: ఏహెచ్ఎఫ్
”భారత్‌లో అంతర్జాతీయ, ఆసియా హ్యాండ్‌బాల్ సంఘం గుర్తింపు హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (హెచ్ఏఐ)కు మాత్రమే ఉంది. ఈ సంఘానికి మాత్రమే ఐహెచ్ఎఫ్, ఏహెచ్ఎఫ్ లోగాలు, పేర్లను వినియోగించే హక్కు ఉంది. ఇతర సంఘాలు ఏవైనా తమ లోగాలు, పేర్లు అక్రమంగా ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలకు ఉపక్రమించేందుకు హెచ్ఏఐకు అధికారం ఉంది” అని ఆసియా హ్యాండ్‌బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి మహ్మద్ షఫిఖ్ తన లేఖలో పేర్కొన్నారు.