– లోకేష్ పాదయాత్రలో పసుపు మాయం
– కనిపించని ఎన్టీఆర్, చంద్రబాబు ఫొటోలు
– బంటింగుల్లోనూ కనిపించని వారిద్దరి ఫొటోలు
– పసుపు చొక్కాతో కనిపించని వైనం
– సర్వం లోకేష్ మయం
– ఎరుపు రంగు మధ్యలో లోకేష్ ఫొటోలు
– లోకేష్ పాదయాత్రకు టీడీపీతో సంబంధం లేదా?
– రాబిన్‌శర్మ సలహాలపై తమ్ముళ్ల ఆగ్రహం
– పార్టీ జెండాలు లేని పాదయాత్రపై బాబు మౌనమేల?
– పాదయాత్రతో లోకేష్‌లో పెరుగుతున్న పరణతి
– పబ్లిక్ పల్సు తెలుసుకుంటున్న యవనేత
– ఎన్టీఆర్-బాబు ఫొటోలు లేకుండా సొంత పబ్లిసిటీ వల్ల లాభమేంటి?
– జగన్‌కు ప్రత్యామ్నాయంగా ఇచ్చే సంకేతాలు ఫలిస్తాయా?
– ‘యూత్ ఐకాన్’ వ్యూహం పారుతుందా?
– మేము బదులు నేను అంటున్న లోకేష్
– సొంత ఇమేజ్ కోసం లోకేష్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా?
– తెలుగు క మ్యూనిస్టు పార్టీగా మార్చేస్తారా?
– కార్యకర్తలు, నేతల అసంతృప్తి
( మార్తి సుబ్రహ్మణ్యం)
యువగళం పేరుతో టీడీపీ ఉత్తరాధికారి- యువనేత లోకేష్ చేస్తున్న పాదయాత్ర, టీడీపీతో సంబంధం లేకుండా సాగుతోందా? పాదయాత్రలో పసుపు జెండాలకు బదులు, ఎరువు జెండాలు-వాటిపై ఎన్టీఆర్-బాబు ఫొటోలు లేకుండా సాగుతున్న పాద్రయాత్ర, పార్టీ క్యాడర్‌ను అసంతృప్తికి గురిచేస్తోందా? వైసీపీ అధినేత జగన్‌కు పోటీగా, ‘యూత్ ఐకాన్’ కోసం లోకేష్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? చంద్రబాబును కాకుండా లోకేష్‌ను, జగన్‌కు ప్రత్యామ్నాయంగా ప్రజలు అంగీకరిస్తారా? తనను తాను జననేతగా గుర్తించడం కోసం, సొంత టీమ్‌తో ఎన్టీఆర్-చంద్రబాబు ఫొటోలు లేకుండా సాగుతున్న పాదయాత్రను ప్రజలు అంగీకరిస్తారా? అసలు ముందు క్యాడర్ ఆమోదిస్తుందా? ఈ మొత్తం ఎపిసోడ్‌లో రాబిన్‌శర్మ వ్యూహాలు ఫలిస్తాయా? లోకేష్‌ను యువనేతగా-జగన్‌కు ప్రత్యామ్నాయ నేతగా అనుకూల మీడియా చేస్తున్న కృషిని క్యాడర్ అంగీకరిస్తుందా? .. టీడీపీలో పైనుంచి కింది స్థాయి వరకూ జరుగుతున్న చర్చ ఇది.
టీడీపీ ఉత్తరాధికారి లోకేష్ పాదయాత్ర వల్ల.. పార్టీకి అదనపు పొలిటికల్ మైలేజీ వస్తోందా? రాదా? అన్నది పక్కకుబెడితే… ఆయన పాదయాత్రలో పార్టీ గుర్తుయిన పసుపు బదులు.. ఎరుపు కనిపించడం వల్ల లాభమెంత? నష్టమెంత అన్న సరికొత్త చర్చకు పార్టీ వర్గాల్లో తెరలేచింది. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పుడు, పూర్తి పసుపు రంగుతో టీడీపీ జెండా రూపొందించారు. పసుపు శుభసూచిక మన్నది హిందువుల నమ్మకం. అసలు టీ డీపీ అంటేనే పసుపు. అందుకే రాజకీయ ప్రత్యర్ధులు, ‘ఎల్లో మీడియా’ అంటూ టీడీపీ అనుకూల మీడియాను ధ్వజమెత్తుతుంటాయి.
టీడీపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడు, పసుపు మయంతో కనిపిస్తుంటుంది. పార్టీ అధినేత చంద్రబాబు బస్సుయాత్ర, పాదయాత్ర నిర్వహించినా.. ఆయన వెనుక- ముందు నిలువెత్తు పసుపు జెండాలు రివ్వున ఎగురుతుంటాయి. పార్టీ అధినేత చంద్రబాబు నుంచి సామాన్య కార్యకర్త వరకూ, అంతా పసుపు చొక్కాలతోనే దర్శనమిస్తుంటారు. టీడీపీ ఏ కార్యక్రమం నిర్వహించినా, పసుపు జెండాలే ముందు స్వాగతిస్తుంటాయి. ఒక్కముక్కలో చెప్పాలంటే.. టీడీపీ అంటే పసుపు. పసుపు అంటే టీడీపీ. ఇది జనం మదిలో నిలిచిపోయిన నిశ్చితాభిప్రాయం.
అలాంటి పొలిటికల్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న టీడీపీ పసుపు కలర్ స్థానంలో.. లోకేష్ పాదయాత పుణ్యాన , కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన ఎరుపు దర్శనమివ్వడం పార్టీ క్యాడర్‌ను విస్మయపరుస్తోంది. ఇదేదో కార్పొరేట్ లుక్ మాదిరిగా ఉంది తప్ప, టీడీపీ ప్రోగ్రామ్‌గా లేదన్న భావన క్యాడర్‌లో నెలకొంది. లోకేష్ యువగళం పాదయాత్రలో, టీడీపీ పసుపు జెండాలకు బదులు… లోకేష్ ఫొటోలున్న ఎరుపు జెండాలు దర్శనమివ్వడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. లోకేష్ పాదయాత్రతో టీడీపీ చివరకు తెలుగు కమ్యూనిస్టు పార్టీగా మారిందన్న వ్యాఖ్యలు సీనియర్ల నుంచి వినిపిస్తున్నాయి.
లోకేష్ పాదయాత్రలో ఏర్పాటుచేస్తున్న వేదికలపై కూడా, పార్టీ పసుపు జెండాలకు బదులు, లోకేష్ ఫొటోలున్న ఎరుపు జెండాలు కనిపించడాన్ని పార్టీ క్యాడర్ స్వాగతించలేకపోతోంది. ఎన్టీఆర్-చంద్రబాబు ఫొటోలు, పసుపు జెండా లేకపోతే, లోకేష్ చేసే పాదయాత్ర వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని సీనియర్లు సైతం స్పష్టం చేస్తున్నారు.
పాద యాత్రలో కూడా టీడీపీ పసుపు జెండాలు పెద్దగా కనిపించకపోవడాన్ని పార్టీ సీనియర్లు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా లోకేష్ తన ప్రసంగంలో ‘మేము’ అనే పదం బదులు.. ‘నేను’ అనే పదం ఎక్కువగా వాడటాన్ని సీనియర్లు ప్రస్తావిస్తున్నారు. కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభమైన తర్వాత, దీనిపై పార్టీ నేతల అంతర్గత సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.
ఎన్టీఆర్-చంద్రబాబు ఫొటోలు లేకుండా, ఎరుపు జెండాలతో లోకేష్ చేస్తున్న పాదయాత్రపై వ స్తున్న అభ్యంతరాలను, ఆ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. అయితే పార్టీ జెండాలు లేకుండా, ఎరుపు రంగు జెండాలు ఎలా ఏర్పాటుచేస్తారని చంద్రబాబు ప్రశ్నించినప్పటికీ… పాదయాత్రలో పార్టీ జెండాలు లేకుండా చూడటంలో, పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు విఫలమయ్యారన్న వ్యాఖ్యలు పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది.
‘పాదయాత్రలో లోకేష్ పరణితి చెందుతున్నారు. కష్టపడుతున్నారు. తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ హయాంలో ఏయే వర్గాలకు ఏం న్యాయం చేశాం? జగన్ సర్కారు హయాంలో ఏయే వర్గాలకు అన్యాయం జరుగుతోంది? అన్న విషయాన్ని ప్రజలకు చక్కగా వివరిస్తున్నారు. ప్రసంగాల్లో భాషాపమైన కొన్ని లోపాలున్నా, జనంతో బాగా మమేకం అవుతున్నారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ, ఆయన తన ప్రసంగాల్లో మేము అనకుండా నేను అంటున్నారు. చంద్రబాబును ఎలివేట్ చేసే బదులు, తనను ఎలివేట్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తాం అని చెప్పడం లేదు.
పార్టీ పసుపు జెండాలకు బదులు, లోకేష్ ఉన్న ఎరుపు రంగు జెండాలు కనిపిస్తున్నాయి. దీనిని ప్రజలే కాదు, మా పార్టీ కార్యకర్తలు కూడా స్వాగతించరు. కమ్యూనిస్టు పార్టీ రంగులను టీడీపీ కార్యకర్తలు ఎలా స్వాగతిస్తారు? పైగా దానివల్ల లోకేష్ పాదయాత్ర పార్టీతో సంబంధం లేదన్న తప్పుడు సంకేతాలు వెళుతున్నాయి. చంద్రబాబు ఉన్నంతవరకూ ప్రజలు ఆయననే చూస్తారు తప్ప, మిగిలిన ఎవరినీ చూడరు. ఈ లాజిక్ లోకేష్ మిస్సవుతున్నట్లు కనిపిస్తోంది’ అని ఓ పొలిట్‌బ్యూరో సభ్యుడు విశ్లేషించారు.
లోకేష్ పాదయాత్రలో ఎన్టీఆర్-చంద్రబాబు ఉన్న ఫొటోలు, పసుపు జెండాలు లేకపోతే.. ఇదంతా పార్టీకి సంబంధం లేకుండా, లోకేష్ తాను వ్యక్తిగతంగా ఎదిగేందుకు చేస్తున్న వ్యక్తిగత పాదయాత్రగా సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందంటున్నారు. జగన్‌కు చంద్రబాబు మాత్రమే ప్రత్యామ్నాయంగా ప్రజలు భావిస్తున్నారని, అప్పుడే సరైన ఫలితాలు వస్తాయంటున్నారు.
‘జనం చంద్రబాబు-జగన్‌నే చూస్తున్నారు. చూస్తారు కూడా. అదే సరైన వ్యూహం కూడా. అలా చూస్తే జనం సహజంగా చంద్రబాబు వైపే మొగ్గు చూపుతారు. ఎందుకంటే బాబు అనుభవజ్ఞుడు. కానీ జగన్-లోకేష్‌ను చూస్తే జనం సహజంగా జగన్‌వైపే చూస్తారు. అది పార్టీకి నష్టం. జగన్ అనే వ్యక్తి ఇప్పటికే ఎస్టాబిష్ అయ్యారు. ఆయనకు వైస్ పేరు మొదటి ఎన్నికల్లోనే పనికొచ్చింది. పాదయాత్ర తర్వాత తండ్రి పేరు అవసరం లేకుండానే, జగన్ నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయ్యారు.
అప్పటి టీడీపీ ప్రభుత్వ నిర్ణయాలు- వైసీపీ నియమించుకున్న పీకే వ్యూహాలు-వ్యక్తులు, బీజేపీతో శత్రుత్వం వంటి అంశాలు జగన్‌కు బాగా కలసివచ్చాయి. ఆ పరిస్థితులు ఇప్పుడు లోకేష్‌కు లేవు. చంద్రబాబు ఉన్నంతవరకూ మా పార్టీకి సంబంధించి జనం మరొకరి వైపు చూసే అవకాశం లేదని’ ఓ మాజీ మంత్రి స్పష్టం చేశారు.
జగన్‌కు ప్రత్యామ్నాయ నేతగా చూపేందుకు చేసే ప్రయత్నాలు ఫలించవని, కాకపోతే జనం పల్సు తెలుసుకునేందుకు.. ఎవరితో ఎలా వ్యవహరించాలో తెల్సుకునేందుకు, ఈ పాదయాత్ర ఉపయోగపడుతుందని మరికొందరు సీనియర్లు విశ్లేషిస్తున్నారు. ‘మా పార్టీకి ఆక్సిజన్ అందించే మీడియా సంస్థలు పాదయాత్రను ఎంత ఎంకరేజ్ చేసినా దానిని ఆమోదించాల్సింది ముందు మా పార్టీ క్యాడర్, తర్వాత జనం మాత్రమే. ఆ వాస్తవాన్ని మనం విస్మరించకూడద’ని ఓ మాజీ మంత్రి విశ్లేషించారు.
చంద్రబాబు తన బస్సు యాత్రలో గానీ- పాదయాత్రలో గానీ పసుపు చొక్కాతోనే కనిపించేవారని, కానీ లోకేష్ తెల్ల చొక్కాతో కనిపించడం వల్ల.. ఆయన పాద్రయాత్రతో పార్టీకి వచ్చే అదనపు మైలేజీ రాకపోవచ్చన్న అభిప్రాయం, పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. నిజానికి పార్టీలో లోకేష్ హయాం ప్రారంభమైనప్పటి నుంచి, సొంత టీమ్-సొంత ఆలోచనలు ప్రారంభమయ్యాయని, ఎవరి టీమ్ వారిదేనన్న దురభిప్రాయం నెలకొందని, ఇది మంచిది కాదన్న అభిప్రాయం సీనియర్లలో వ్యక్తమవుతోంది. దీనిని పార్టీ అధినేత సైతం సరిదిద్ది, సరైన సంకేతాలు ఇవ్వలేకపోతున్నారన్న అభిప్రాయం సీనియర్లలో వ్యక్తమవుతోంది.
స్థానిక పరిస్థితులు తెలియని రాబిన్‌శర్మకు, పార్టీ వ్యూహకర్త బాధ్యతలు అప్పగించడం సరైన విధానం కాదంటున్నారు. రాబిన్‌శర్మ, ప్రశాంత్ కిశోర్‌తో కలసి పనిచేసిన పరిస్థితులు- ఇప్పటి పరిస్థితులకు చాలా తేడా ఉందని విశ్లేషిస్తున్నారు. నిజానికి చంద్రబాబు నాయుడు పూర్తి స్వేచ్ఛతో, నిర్మొహమాటంగా నిర్ణయాలు తీసుకుంటే, అసలు పార్టీకి వ్యూహకర్తలే అవసరం లేదని సీనియర్లు కుండబద్దలు కొడుతున్నారు. వ్యూహకర్తలు లేని రోజుల్లోనే బాబు తీసుకున్న నిర్ణయాలు సక్సెస్ అయిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు.