Suryaa.co.in

Telangana

కళాఖండాలు, పురావస్తు శాఖ విభజనపై కమిటీ వేయని ఏ పీ సర్కారు

– కొన్ని కళాఖండాలు ఆంధ్రాలోనే ఉన్నాయి
– ఇంకొన్ని తెలంగాణలో ఉన్నాయి
– స్నేహపూర్వకంగా విభజన జరగాలి
– తెలంగాణ మంత్రి శ్రీనివాసగౌడ్‌

రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తో హైదరాబాదులోని తన క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన సర్వీసులు, ఆర్కియాలజీ శాఖల ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి వాణి మోహన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పురావస్తు శాఖ కు చెందిన పురావస్తు సంపద, చారిత్రక, వారసత్వ, కళా ఖండాలు విభజన పై చర్చించారు.

తెలంగాణ రాష్ట్ర మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రం విభజన జరిగినా తరువాత తెలంగాణ రాష్ట్రానికి చెందిన చారిత్రక, వారసత్వ సంపద, కళా ఖండాల విభజన అసంపూర్తిగా జరిగిందన్నారు. తెలంగాణ కు చెందిన కొన్ని అద్భుత కళా ఖండాలు అంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని పలు మ్యూజియం లలో ఉన్నాయన్నారు. అలాగే, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొంత పురావస్తు సంపద, చారిత్రక, వారసత్వ, కళా ఖండాలు కొన్ని తెలంగాణ లోనీ పలు మ్యూజియం లలో ఉన్నాయన్నారు.
ఇరు రాష్ట్రాల పురావస్తు శాఖల విభజన పూర్తి స్థాయిలో రాష్ట్రాల మధ్య విభజన జరిగేలా తెలంగాణ రాష్ట్రం నుండి గతంలోనే ఒక కమిటీ నీ రూపొందించామన్నారు. కానీ, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పురావస్తు శాఖ విభజన, కళా ఖండాల గుర్తింపు పై కమిటీని నియమించలేదని మంత్రి డాక్టర్ V. శ్రీనివాస్ గౌడ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శ్రీమతి వాణి మోహన్ దృష్టికి తీసుకొచ్చారు. ఇరు రాష్ట్రాల మధ్య స్నేహ పూర్వకంగా విభజన జరగాలని ఆకాంక్షించారు.

తెలంగాణ రాష్ట్ర ఆర్కియాలజీ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తో విభజన చర్యలు చేపట్టాలని టెలిఫోన్ లో ఆదేశించారు. అలాగే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పురావస్తు శాఖ పూర్తి స్థాయిలో విభజన జరిగేలా, ఇరు రాష్ట్రాల కు చెందిన కళా ఖండాలు ఆయా రాష్ట్రాలకు చెందేలా ప్రత్యేక చోరవ చూపాలని అంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కోరారు రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్.

LEAVE A RESPONSE