– 175 స్థానాల్లో టీడీపీ 91, వైసీపీ 77 స్థానాల్లో విజయం
– జనసేనకు 7 స్థానాలు పక్కా
– టీడీపీ-జనసేన కలిస్తే 98
– ఉత్తరాంధ్రలోని 34 స్థానాల్లో టీడీపీకి 17, వైసీపీకి 10
– సీమలో టీడీపీ కంటే వైసీపీనే పైచేయి
– 27 స్థానాల్లో వైసీపీ 27, టీడీపీ 20
– ఉభయ గోదావరి 44 స్థానాల్లో టీడీపీ 14, వైసీపీ 8, జనసేనకు 7
– గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశంలోని 55 స్థానాల్లో టీడీపీ 27, వైసీపీ 18
– సీమలో తప్ప అన్నిచోట్లా సైకిల్ పరుగు
– జనసేన 7 స్థానాలకే పరిమితం
– పవన్ ప్రభావం తక్కువేనట
– ‘ఆత్మసాక్షి’ సర్వేలో విస్మయకర ఫలితాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా మాదంటే మాదే అధికారమని అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. జనం తమవైపే ఉన్నారంటూ ప్రచారం చేసుకుంటున్నాయి. సంక్షేమ పథకాలే తమకు శ్రీరామరక్ష అని వైసీపీ చెబుతోంది. బటన్ నొక్కడం ద్వారా లబ్ధిపొందే ప్రతి ఓటరూ, తమకే జై కొడతారన్నది వైసీపీ ధీమా. సర్కారులో పాతుకుపోయిన అవినీతి, దౌర్జన్యాలు, అధికధరలు, నిలిచిపోయిన అభివృద్ధి, జీతాలకూ దిక్కులేని పాలనతో విసిగిపోయిన ప్రజలే, తమకు పట్టం కట్టబోతున్నారన్నది టీడీపీ ధీమా.
ఇలా.. ఎవరి వాదన వారిదే. ఎవరి ధీమా వారిదే. కానీ.. పబ్లిక్ పల్స్ ఏమిటి? జనం గుండెచప్పుడు ఎవరివైపు ప్రతిధ్వనిస్తోంది? అన్నదే ప్రశ్న. ఈ ప్రశ్నలకు ప్రముఖ సర్వే సంస్థ ఆత్మసాక్ష్మి సమాధానం ఇచ్చింది. పబ్లిక్ పల్స్ ఎలా ఉందో.. ఎవరి వైపు ఉందో ‘ఆత్మసాక్షి’ తేటతెల్లం చేసింది. ‘ఆత్మసాక్షి’ సర్వే ఫలితాల ప్రకారం.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఏపీలో తెలుగుదేశం పార్టీకే ఎక్కువ స్థానాలొస్తాయని స్పష్టం చేసింది.
వైసీపీ 63, టీడీపీ 78 స్థానాలు సాధిస్తాయని పేర్కొంది. అయితే.. 27 స్థానాల్లో పోటాపోటీ ఉన్నప్పటికీ.. అందులో 14 వైసీపీ, 13 సీట్లు టీడీపీ గెలిచే అవకాశాలుంటాయని స్పష్టం చేసింది. ఆ ప్రకారంగా చూసినా టీడీపీ 91, వైసీపీ 77 స్థానాల్లో విజయం సాధిస్తాయని అర్ధమవుతోంది. మరో లెక్క ప్రకారం.. టీడీపీకి వచ్చే ఆ 91 స్థానాలతో పాటు, జనసేనకు వచ్చే 7 స్థానాలు కలిపితే 98 స్థానాలు, టీడీపీ ఖాతాలో కలుస్తాయని ఆత్మసాక్షి సర్వేబట్టి స్పష్టమవుతోంది.
అయితే.. ఏపీలో జనప్రభంజనం సృష్టిస్తున్న జనసేనాధిపతి పవన్ కల్యాణ్ ప్రభావం వచ్చే ఎన్నికల్లో తక్కువగానే ఉంటుందని ఆత్మసాక్షి సర్వేతో అర్ధమవుతుంది. జనసేన బలం, పవన్ ప్రభావం కేవలం ఉభయ గోదావరి జిల్లాలకే పరిమితయి, 7 స్థానాల వద్ద నిలిచిపోయే అవకాశాలున్నట్లు సర్వే ఫలితం చెబుతోంది.
ఇదిలా ఉండగా వైసీపీ హవా కేవలం రాయలసీమకే పరిమితం అయినట్లు కనిపిస్తోంది. సీమలోని 27 స్థానాల్లో వైసీపీకి 27, టీడీపీకి 20 సీట్లు వస్తాయన్నది సర్వే ఫలితం. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలో కూడా, మరోసారి వైసీపీ అధిపత్యం ఉన్నట్లు కనిపిస్తోంది. చిత్తూరు జిల్లాలో టీడీపీకి 4, వైసీపీకి 8 స్థానాలు వచ్చే అవకాశాలున్నట్లు సర్వే ఫలితం చెబుతోంది. అంటే సర్వే ఫలితాలు మొత్తం రాష్ట్రంలో టీడీపీకి ఆశాజనకంగా ఉండగా, పార్టీ అధినేత సొంత జిల్లా ఫలితాలు మాత్రం నిరాశాజనంగానే ఉన్నట్లు స్పష్టమవుతోంది. అయితే టీడీపీ ఇప్పటి స్థానాల కంటే , అదనపు స్థానాలు సాధించబోతున్నట్లు అర్ధమవుతుంది.
ఉత్తరాంధ్రలో మొత్తం 34 స్థానాలు ఉండగా, టీడీపీకి 17, వైసీపీకి 10 స్థానాలు వస్తాయని సర్వే చెబుతోంది. ఇది విశాఖ రాజధానిగా ప్రచారం చేసుకుంటున్న వైసీపీకి షాక్ వంటిదే. అంటే వైసీపీ విశాఖ రాజధాని నినాదాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు వ్యతిరేకించినట్లు స్పష్టమవుతోంది.
ఉభయ గోదావరి జిల్లాల్లోని 44 స్థానాల్లో టీడీపీ 14, వైసీపీ 8 స్థానాలు గెలుస్తాయని చెప్పిన ,సర్వే.. పవన్ కల్యాణ్ సారధ్యంలోని జనసేన మాత్రం మొత్తం 7 స్థానాలు గెలుస్తుందని జోస్యం చెప్పింది. ఈ రెండు జిల్లాల్లో మాత్రమే పవన్ ప్రభావం, జనసేనకు బలం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. దానికి కారణం కాపు సామాజికవర్గమేనని స్పష్టమవుతోంది.
ఇక గుంటూరు-కృష్ణా-ప్రకాశం-నెల్లూరు జిల్లాల్లోని మొత్తం 55 స్థానాల్లో.. టీడీపీకి 27, వైసీపీకి 18 సీట్లు లభిస్తాయని సర్వే ఫలితం చెబుతోంది. ఇక్కడ రాజధాని అమరావతి ప్రభావం ఫలితాలపై ఉన్నట్లు స్పష్టమవుతోంది. టీడీపీ అనుకూలతకు-వైసీపీ వ్యతిరేకతకు రాజధాని అంశమే కారణమని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కాగా.. రాష్ట్రంలోని ఎస్సీ-ఎస్టీ నియోజకవర్గాల్లో వైసీపీ బాగా ఉన్నట్లు కనిపిస్తోంది.
ఈ మొత్తం పరిణామాలలో.. ఏపీ ప్రజల మనసులో బీజేపీకి ఎక్కడా స్థానం లేదని, ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేసింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని.. బలగుద్ది వాదిస్తున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అండ్ కోకు, ఆత్మసాక్షి సర్వే ఫలితాలు శరాఘాతమే.
జాతీయ పార్టీ అయిన బీజేపీ కంటే.. పవన్ కల్యాణ్ జనసేనకే జనంలో ఆదరణ ఉందని సర్వే ఫలితం చాటింది. కాపుల సంఖ్య ఎక్కువగా ఉన్న.. ఉభయ గోదావరి జిల్లాల్లో 7 స్థానాలు సాధించేంత స్థాయికి, జనసేన ఎదగడం విశేషమే. దానికితోపాటు ఉత్తరాంధ్ర, గుంటూరు, కృష్ణాలోని కాపులు- నెల్లూరు సహా రాయలసీమలోని బలిజలు, జనసేన ప్రభావంతో టీడీపీకి పట్టం కట్టబోతున్నట్లు సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
ఓటమి బాటలో ఉన్న మంత్రులు వీరే..
కాగా ఆత్మసాక్షి సర్వే ఫలితం ప్రకారం.. ప్రస్తుత క్యాబినెట్‌లోని 12 మంది మంత్రులు పరాజయ ప్రస్థానంలో ఉన్నట్లు అర్ధమవుతుంది. వారిలో రోజా, కొట్టు సత్యనారాయణ, గుడివాడ అమర్నాధ్, కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేష్, తానేటి వనిత, మేరుగ నాగార్జున, విడదల రజని, విశ్వరూప్, ఉషాచరణ్, అప్పలరాజు, గుమ్మనూరు జయరాం
అదే బాటలో ఉన్న మాజీలు వీరే..
అనిల్‌కుమార్ యాదవ్, ఆళ్ల నాని, బాలినేని శ్రీనివాసరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, శ్రీరంగనాధ రాజు, అవంతీ శ్రీనివాస్, పేర్ని నాని, శంకరనారాయణ