డెడ్ బాడీలను ఎత్తికెళ్లే నీచమైన సర్కార్ కేసీఆర్ దే

-సీఎం బిడ్డ చేతి వాచీకున్న విలువ తెలంగాణ మహిళలకు లేదా?
-ప్రీతి హత్య కేసును ప్లాన్ ప్రకారమే నీరుగారుస్తున్న ప్రభుత్వం
-తప్పులేకుండా సిట్టింగ్ జడ్జితో ఎందుకు విచారణ జరిపించడం లేదు?
-మహిళల తరపున పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే
-బీజేపీ అధికారంలోకొస్తే యూపీ తరహా పాలన అందిస్తాం
-మహిళలపై అఘాయిత్యాలు చేసే వాళ్ల ఇండ్లను బుల్డోజర్లతో కూల్చేస్తాం
-కేసీఆర్ సర్కార్ పై నిప్పులు చెరిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్
-మహిళలపై అఘాయిత్యాలకు నిరసనగా పార్టీ కార్యాలయంలో ‘నిరసన దీక్ష’ చేపట్టిన బండి సంజయ్

‘‘దేశంలో ఇప్పటి వరకు బంగారం, డబ్బును ఎత్తికెళ్లే దొంగలను చూసినం. కానీ డెడ్ బాడీని ఎత్తికెళ్లే నీచమైన వాళ్లను కేసీఆర్ ప్రభుత్వంలోనే చూస్తున్నం. కేసీఆర్ పాలనలో మహిళలు రోడ్డు మీద తిరగలేని పరిస్థితి నెలకొంది’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మహిళల మాన, ప్రాణాలకు విలువ లేకుండా పోయిందని, సీఎం బిడ్డ చేతికున్న వాచీకున్న విలువ మహిళలకు లేకుండా పోయిందన్నారు. సీఎం బిడ్డ చేతి వాచీ విలువ రూ. 20 లక్షలైతే… మెడికో విద్యార్థి ప్రీతి చనిపోతే రూ.10 లక్షల పరిహారం ఇస్తాననడం సిగ్గు చేటని విమర్శించారు.

తెలంగాణలో మహిళలపై కొనసాగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ‘‘నిరసన దీక్ష’’ చేపట్టారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్, తమిళనాడు సహ ఇంఛార్జీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు ఎన్.ఇంద్రసేనారెడ్డి, ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్ రావు, విజయశాంతి మాజీమంత్రి విజయరామారావు, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రాష్ట్ర అధికార ప్రతినిధులు సీహెచ్. విఠల్, ఎన్వీ సుభాష్, రాణి రుద్రమదేవి తదితరులు ఈ దీక్షకు హాజరై ప్రసంగించారు. బండి సంజయ్ చేపట్టిన నిరసన దీక్షకు పెద్ద ఎత్తున స్పందన లభించింది. వివిధ సంఘాల నేతలు తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు. పలు విద్యార్థి, యువజన, మహిళా, ప్రజా, న్యాయ వాదుల సంఘాల నాయకులు బండి సంజయ్ ను కలిసి మద్దతు ప్రకటించారు. ఈ దీక్షకు భారీ ఎత్తున తరలివచ్చిన మహిళలు.. జై బీజేపీ, జై బండి సంజయ్ అంటూ నినాదించారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు….
మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు ఎక్కువైనయ్. శాంతి భద్రతలను కాపాడటంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అందుకే దీక్ష చేస్తున్నాం. ఈ దీక్షకు హాజరైన పెద్దలందరికీ ధన్యవాదాలు. వారం రోజుల క్రితం మెడికో విద్యార్థి ప్రీతి నాయక్ హత్యను నిరసిస్తూ బీజేపీ వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నాం. ప్రజల పక్షాన మొదటి నుండి కొట్లాడుతోంది బీజేపీ మాత్రమే. తెలంగాణ వచ్చింది మహిళల వంటవార్పు నుండి కన్న పేగుల బలిదానంతోనే… తెలంగాణ వచ్చినంక మహిళలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నరు. ఎప్పుడు ఏ బీఆర్ఎస్ గూండా వచ్చి దాడి చేస్తారో… అత్యాచారం చేస్తారోననే భయం పట్టుకుంది. జూబ్లిహిల్స్, నిర్మల్, మంథని సహా రాష్రంలో మహిళలు, విద్యార్థినులపై వరుసగా అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా సీఎం పట్టించుకోవడం లేదు. పూటకో అత్యాచారం…రోజుకో హత్య జరుగుతున్నా నోరు విప్పడు.

ఎక్కడో కర్నాటకలో హిజాబ్ అంశం వస్తే నోరు విప్పిన కేసీఆర్ తెలంగాణలో జరుగుతున్న ఘోరాలపై మాట్లాడలేదు. అత్యాచారాలు చేసేవాళ్ల కళ్లు పీకుతా.. గుడ్లు పీకుతానన్న మాటలేమైనయ్.. యూపీలో మహిళలపై కన్నెత్తి చూస్తే వాళ్ల ఇండ్లను బుల్డోజర్లు పెట్టి కూల్చేస్తారు.. తెలంగాణలోనూ అదే పని చేస్తాం.. యూపీ తరహా పాలన తీసుకొస్తాం… మహిళల జోలికి వస్తే వాళ్ల ఇండ్లను బుల్డోజర్లతో కూల్చేసి ఆడబిడ్డలకు రక్షణ కల్పిస్తాం… ప్రీతి హత్య కేసును ప్రభుత్వం ప్లాన్ ప్రకారం నీరుగారుస్తోంది. ఎస్టీ కుటుంబానికి చెందిన విద్యార్ధిని ఉన్న పొలం అమ్మి మెడిసిన్ చదివిస్తే… హత్య చేశారు. అయినప్పటికీ సీఎంఓ నుండి వచ్చిన ఆదేశాల మేరకు ప్రీతి కేసును నీరుగారుస్తున్నారు. నిందితుడిని హీరోగా చూపే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రీతి కష్టపడి చదువుకుంది. ర్యాగింగ్ పై ప్రీతి సహా కుటుంబ సభ్యులంతా పలుమార్లు పోలీసులకు, కాలేజీలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.. ప్రీతి భయస్తురాలు కానేకాదు. ఏదైనా డేర్ గా మాట్లాడే అమ్మాయి. రాత్రి పూట నవ్వుతూ మాట్లాడిన ప్రీతి తెల్లవారగానే ఆత్మహత్య చేసుకున్నారంటే ఎట్లా నమ్మేది? ప్రీతి చనిపోయాక డెడ్ బాడీ ఫింగర్ తో ఆమె మొబైల్ ను ఓపెన్ చేసి ఆధారాలన్నీ ధ్వంసం చేశారు. ఈరోజుకు ప్రీతి ఎట్లా చనిపోయిందో ప్రభుత్వం ఇంతవరకు క్లారిటీ ఇయ్యలేదు. ప్రీతి ఎంజీఎంలోనే చనిపోయినప్పటికీ డెడ్ బాడీని నిమ్స్ కు తరలించి 4 రోజులపాటు ట్రీట్ మెంట్ చేసిన దుర్మార్గుడు కేసీఆర్. నేను వరంగల్ లో పర్యటిస్తున్నానని తెలిసి డెడ్ బాడీని నిమ్స్ కు తరలించారు. ఈ అంశంపై ధర్నా చేసిన మహిళా మోర్చా కార్యకర్తలను అరెస్ట్ చేసి దురుసుగా ప్రవర్తించారు. ప్రీతి డెడ్ బాడీని తల్లిదండ్రులకు ఇవ్వలేదు. బంధువులు చివరి చూపు చూడకుండానే ఆదరబాదరాగా తీసుకెళ్లి ఖననం చేశారు. కేసీఆర్…మీ తప్పు లేకుంటే సిట్టింగ్ జడ్జితో ఎందుకు విచారణ జరిపించలేదు?

ఆర్టీసీ కార్మికుల దీక్షలోనూ కేసీఆర్ మానవత్వం లేని మ్రుగంగా మారారు. ఆర్టీసీ కార్మికుడు బాబు చనిపోతే వాస్తవాలు బయటకు వచ్చేదాకా శవాన్ని తీసుకెళ్లనీయకుండా ధర్నాలు చేసినం. దేశంలో బంగారం, డబ్బును ఎత్తికెళ్లే సంఘటనలు చూసినం. కానీ డెడ్ బాడీని ఎత్తికెళ్లే సర్కార్ ను కేసీఆర్ ప్రభుత్వాన్ని చూస్తున్నం. సీఎం బిడ్డ చేతికున్న వాచీ విలువ రూ. 20 లక్షలు… ప్రతి చనిపోతే పరిహారం రూ.10 లక్షలిస్తారంట.. సిగ్గుండాలే… కేసీఆర్ బిడ్డను చూసి సిగ్గుతో తలొంచుకుంటున్నరు. దొంగ సారా దందా చేయడాన్ని అసహ్యించుకుంటున్నరు. కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లు… డ్రగ్స్ తీసుకునే ట్విట్వర్ అయినా..రోడ్ సైడ్ తిరిగే రోమియో అయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు..నన్ను విమర్శించే అర్హత లేదు. పోలింగ్ బూత్ అధ్యక్షుడైనా సీఎం, ప్రధాని అయ్యే అర్హత బీజేపీలో మాత్రమే ఉంది. మహిళలు ఎక్కడ గౌరవింపబడతారో అక్కడ దేవతలు నడయాడతారనే సంస్క్రతి బీజేపీది. మహిళలను గౌరవిస్తూ ఆదరించే పార్టీ బీజేపీ మాత్రమే. కానీ బీఆర్ఎస్ నేతలు మహిళలపై దాడులు, అత్యాచారాలతో విచ్చలవిడిగా స్వైర విహారం చేస్తున్నారు. మేం ఏం చేసినా బీఆర్ఎస్ కండువా వేసుకుంటే అన్నీ మాఫీ అయిపోతాయనే భావన ఆ నేతల్లో ఉందంటే ఏమనుకోవాలి?

సీఎం వ్యవహారం చూస్తుంటే… మళ్లా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దాడులు చేసే వాళ్లకు ప్రోత్సాహక బహుమతులు ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతటి నిక్రుష్ట పార్టీ బీఆర్ఎస్. మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా బీఆర్ఎస్ పోరాడుతోంది. అండగా ఉంటూ భరోసా ఇస్తోంది. వాళ్లలో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తున్నాం. వారికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలతోపాటు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నం. ఈసారి బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలకు గుణపాఠం చెప్పాలని మహిళలు నిర్ణయించుకున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ఉన్నరు. వాళ్లకు భరోసా ఇచ్చేందుకు ఈ నిరసన దీక్ష. రేప్ లు, హత్యలు, దొంగతనాలు చేసే వాళ్లంతా బీఆర్ఎస్ లో ఉన్నరు. ప్రీతి కేసును ద్రుష్టి మళ్లించేందుకు దానిని చిన్న సంఘటనగా చిత్రీకరించేందుకు కేసీఆర్ యత్నిస్తున్నడు.అందుకే దేశంలో అత్యధిక హత్యలు, అత్యాచారాలు జరుగుతున్న రాష్ట్రంగా తెలంగాణ మారింది. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డు నివేదికలే ఈ విషయాన్ని చెబుతున్నాయి. ఏ ఆశయం కోసం తెలంగాణ సాధించుకున్నామో ఆ ఆశయాలు నెరవేరాలంటే… మహిళలకు రక్షణ ఉండాలంటే అది బీజేపీతో సాధ్యం.

Leave a Reply