Suryaa.co.in

Andhra Pradesh

ఒక్కో హత్యకు ఎన్నికల్లో బదులు చెబుతాం

ఏలూరు దళిత గర్జన సభలో బహుజన నేతల ప్రతిజ్ఞ

నాలుగేళ్ల వైకాపా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తీరని ద్రోహం చేసిందని, ఎంతో మందిని హత్య చేసిందని, ఒక్కో దాడికి, ఒక్కో హత్యకు రాబోవు ఎన్నికల్లో బదులు చెబుతాం అని పలువురు దళిత, బహుజన నాయకులు ప్రతిజ్ఞ చేశారు. సోమవారం జాతీయ మాల మహాసభ అధ్యక్షులు అలాగ రవికుమార్ అధ్యక్షతన దళిత వర్కు షాపు నిర్వహించారు.

ఈ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ప్రసంగించారు. ప్రభుత్వ పాలనా తీరుపై నిప్పులు చెరిగారు. ప్రతి దాడికి, ప్రతి హత్యకు, ప్రతి అత్యాచారానికి భవిష్యత్తు ఎన్నికల్లో బదులు చెప్తామని హెచ్చరించారు. మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ ను, మాస్క్ లేనందుకు చీరాల కిరణ్ ను, చంపేశారు అన్నారు. శవాన్ని డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు ఎమ్మెల్సీ పదవిని కొనసాగించటం క్షమించరాన్ని నేరంగా పేర్కొన్నారు.

నవరత్నాల పేరు చెప్పి రోజుకు రూ.20, రూ.30 రూపాయలు ఇస్తే, దళితుల బతుకుల్లో వెలుగులు రావని స్పష్టం చేశారు. 27 రకాల సంక్షేమ పథకాలను ఎత్తివేసే హక్కు ముఖ్యమంత్రి లేదన్నారు. ఉపాధి లేక దళిత బిడ్డలు ఇతర ప్రాంతాలకు పాలమూరు లేబర్ లా వలసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.దళితుల భుజాలపై ఎక్కి తొక్కుతున్న ప్రభుత్వాన్ని మరో ఆరేడు నెలల్లో కింద పడేస్తామని హెచ్చరించారు. రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి చాగంటి సంజీవయ్య మాట్లాడుతూ దళితుల బలం లేకుండా ఏ ప్రభుత్వం అధికారంలోకి రాదన్నారు.

దశాబ్దాలుగా అమలవుతున్న పథకాలను నిలిపివేసి హక్కు ఎవరికీ లేదన్నారు. మాల మహాసేన నాయకులు ఎరికిపాటి విజయ్, నల్లమిల్లి శంకర్ ,పల్లెం ఏడుకొండలు, కాపుదాసి రవికుమార్,మొత శైలజ, కర్లకోటి దిలీప్ ,కొమిన ఆగస్టీన్, నెట్టెం శ్రీను తదితర నాయకులు పాల్గొని ప్రసంగించారు. మే 14వ తేదీన లక్ష మందితో రాష్ట్రస్థాయి మాల మహా సేన సభ ఏలూరులో నిర్వహిస్తున్నట్లు రవికుమార్ ప్రకటించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా పలువురు నాయకులు, మహిళా నాయకులు శాలువాలు, పుష్ప గుచ్ఛాలతో ఘనంగా సన్మానించారు. నిర్వాహకులు బాలకోటయ్య, సంజీవయ్య లను ఘనంగా సత్కరించారు.

LEAVE A RESPONSE