– అత్యవసరంగా దాఖలు చేసిన పిటిషన్ మరొక బెంచ్ కు వెళ్లడం వెనుక మర్మం ఏమిటో
– రెండు కోట్ల ఆస్తి కోసం ఎవరైనా 40 కోట్లు వెచ్చించి హత్య చేయిస్తారా??
– కోర్టులో అభియోగాలను మోపడానికి అవినాష్ రెడ్డి ఎవరు? తన స్టేట్మెంట్లను సిబిఐ అధికారులు మార్చారని అవినాష్ రెడ్డికి ఎలా తెలుసు?
– రాజశేఖర్ రెడ్డి పై అభియోగం మోపడానికి అవినాష్ రెడ్డి ఎవరు?
– సీబీఐ అధికారి రామ్ సింగ్ సూట్ కేస్ యుద్ధాలను తట్టుకొని నిలబడ్డాడు
– ప్రజాధనం 17 నుంచి 1800 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంటే ప్రశ్నించారా?
– జనసేనకు పవర్ స్టార్, టిడిపికి యువ రత్న ఉంటే…మా పార్టీకి ఫ్లవర్ స్టార్ ఉన్నాడు…!
– నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
పార్లమెంట్ సభ్యులు దాఖలు చేసే కేసు పిటీషన్లన్నీ ప్రధాన న్యాయమూర్తి బెంచ్ విచారిస్తుందన్న నియమావళికి భిన్నంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి అత్యవసరంగా దాఖలు చేసిన పిటిషన్ మరొక బెంచ్ కు వెళ్లడం వెనుక మర్మం ఏమిటో అంతుచిక్కడం లేదని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘు రామకృష్ణంరాజు విస్మయం వ్యక్తం చేశారు . గతంలో ఆంధ్ర, తెలంగాణ పోలీసులు కలసి కుట్ర చేసి తనపై నమోదు చేసిన కేసును సవాలు చేస్తూ,తాను పిటిషన్ దాఖలు చేయగా ప్రధాన న్యాయమూర్తి బెంచ్ కు విచారణకు వెళ్ళింది. ఎంపీగా రఘురామకృష్ణం రాజుకు ఒక నిబంధన… అవినాష్ రెడ్డికి మరొక నిబంధనా? అని ఆయన ప్రశ్నించారు.
శుక్రవారం నాడు రచ్చబండ కార్యక్రమం భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…. అవినాష్ రెడ్డి లంచ్ మోషన్ లో అత్యవసరంగా కేసు మూవ్ చేయగా, జస్టిస్ విజయసేన్ రెడ్డి బెంచ్ పైకి వెళ్ళింది. రోస్టర్ విధానంలో ఈ కేసు సంబంధిత బెంచ్ పైకి వెళ్లాల్సి ఉండగా, తన బెంచ్ పైకి రావడం పట్ల న్యాయమూర్తి ఒకింత అసహనాన్ని వ్యక్తం చేశారు. అవినాష్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి తన శాయశక్తులను ఒడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసులో డాక్టర్ సునీత కూడా ఇంప్లిడ్ కావడంతో, ఆమె తరపు న్యాయవాది కూడా వాదనలు వినిపించనున్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు.
నిరంజన్ రెడ్డి తన వాదనలను వినిపిస్తూ… మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుతో తన క్లైంట్ అవినాష్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. గతంలో సిబిఐ 161 కింద నోటీసులు ఇచ్చి, అవినాష్ రెడ్డి ని విచారణకు పిలిచింది. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి ఇచ్చిన సమాధానాలకు సిబిఐ అధికారులు ఆయన సంతకాలను తీసుకోలేదు. సంతకాలను తీసుకోకపోవడం వల్ల, ఆ సమాధానాలను మార్చే అవకాశం ఉంది. ఒకవేళ మార్చినా, మార్చకపోయినా గతంలో సిబిఐ అధికారులకు అవినాష్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్లను పరిగణలోకి తీసుకోవద్దని న్యాయస్థానాన్ని నిరంజన్ రెడ్డి కోరారని రఘురామకృష్ణం రాజు తెలిపారు.
గతంలో సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్లను కోర్టుకు సమర్పించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని, అందులో నిజాలేమిటో, అబద్ధాలేమిటో తాము చెప్పిన తర్వాత ఒక నిర్ధారణ రావాలని న్యాయస్థానాన్ని కోరారు. తమలాంటి మహానుభావులను విచారణ చేయవచ్చా? అనే రీతిలో నిరంజన్ రెడ్డి వాదనలు కొనసాగాయని రఘురామకృష్ణం రాజు అపహస్యం చేశారు . సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డి దృష్టికి కొన్ని ఫోన్ నెంబర్లను తీసుకువచ్చి, ఈ ఫోన్ నెంబర్లు ఎవరివని ప్రశ్నించగా… ఫలానా వ్యక్తులవని ఆయన చెప్పి ఉంటారు. సిబిఐ కి అవినాష్ రెడ్డి ఇచ్చిన సమాధానం తెలిసి, అవతలి వ్యక్తులు కోపోద్రిక్తులయి ఉంటారు. అవినాష్ స్టేట్మెంట్ ఆధారంగా అరెస్టు ఖాయమని తేలడంతో, తన స్టేట్మెంట్ సిబిఐ అధికారులు మార్చే అవకాశం ఉందనే కొత్త వాదన ఆయన తెరపైకి తెచ్చారని రఘురామకృష్ణం రాజు తెలిపారు .
తన స్టేట్మెంట్లను సిబిఐ అధికారులు మార్చారని అవినాష్ రెడ్డికి ఎలా తెలుసు అన్నది ప్రశ్నార్ధకమే. తన స్టేట్మెంట్లను పరిగణలోకి తీసుకోవద్దనడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణకు ఆదేశించగా , వేగంగా విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన తరువాత కూడా, అవినాష్ రెడ్డి అత్యవసర పిటీషన్ పై న్యాయస్థానం వాదనలు వినడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు.
గతంలో తన ఇంటి వద్ద అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఒక వ్యక్తిని, తనకు సెక్యూరిటీ గా ఉన్న సిఆర్పిఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ అనుమానాస్పద వ్యక్తి, సిఆర్పిఎఫ్ పోలీసులు ప్రశ్నించగా, అతని వివరాలేమీ చెప్పలేదు. దీనితో సిఆర్పిఎఫ్ పోలీసులు అతన్ని హైదరాబాదులోని స్థానిక పోలీసులకు అప్పగించారు.
పోలీసుల విచారణలో సదరు వ్యక్తి తాను ఆంధ్ర పోలీసునని, ప్రధానమంత్రి మోడీ రక్షణ నిమిత్తం హైదరాబాదుకు వచ్చానని చెప్పగానే, తెలంగాణ పోలీసులు తనపై, తన రక్షణగా ఉన్న సిఆర్పిఎఫ్ పోలీసులపై కేసులు నమోదు చేశారు. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసును సవాల్ చేస్తూ, తాను పిటీషన్ దాఖలు చేయగా విచారించాల్సిందేనని అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారన్నారు. ఆ తరువాత సుప్రీం కోర్టులో స్టే పొందడం జరిగిందన్నారు.
వైయస్ వివేకాను అల్లుడే హత్య చేశాడన్నది అవినాష్ అభియోగం
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి హత్య చేశారని వైయస్ అవినాష్ రెడ్డి కోర్టులో అభియోగం మోపారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. రాజశేఖర్ రెడ్డి పై అభియోగం మోపడానికి అవినాష్ రెడ్డి ఎవరు?, వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేశారన్న అభియోగాన్ని మోపాల్సింది సిబిఐ. కోర్టుకు వచ్చి అవినాష్ రెడ్డి అభియోగాన్ని మోపుతున్నారంటే దాని వెనుకనున్న ఆంతర్యాన్ని అర్థం చేసుకోవచ్చునని అన్నారు.
వైయస్ వివేకానంద రెడ్డికి రెండవ భార్య ఉన్నదని ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడని, అతనికి రెండు కోట్ల రూపాయల ఆస్తి ఇస్తానని వివేకా చెప్పారని అవినాష్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది తెలిపారు. రెండు కోట్ల ఆస్తి కోసం ఎవరైనా 40 కోట్ల రూపాయలు వెచ్చించి హత్య చేయిస్తారా? అన్నది ప్రశ్నార్థకమే. తన చిన్నాన్నను ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి హత్య చేయించారని అవినాష్ రెడ్డి తన న్యాయవాది ద్వారా వాదనలు వినిపించారన్నారు.
వైయస్ వివేక ఇంట్లో అదే రాజశేఖర్ రెడ్డి, అవినాష్ రెడ్డికి చెప్పి రక్తపు మరకలు తూడ్చమని, కట్లు కట్టమని, సీఐ శంకరయ్యను కూడా మేనేజ్ చేయమని చెప్పారా? అంటూ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. దస్తగిరి కి హత్య చేయమని వారే చెప్పారని అంటున్న అవినాష్ రెడ్డి ఇంట్లో హత్యకు ముందు, తరువాత దస్తగిరి తో పాటు ఇతర నిందితులంతా ఎందుకు ఉన్నారని నిలదీశారు.
వైఎస్ వివేకానంద మరణం తర్వాత ఆయన ఇంట్లో ని రక్తపు మరకలను ఎందుకు తుడిపించారు . ఈ చిన్న లాజిక్కు మిస్ అయి, పెద్ద పెద్ద న్యాయవాదులను పెట్టుకుని వాదనలు వినిపించినంత మాత్రాన ప్రయోజనం ఏమిటి. వైఎస్ వివేకా హత్య అనంతరం ఇంట్లోని రక్తపు మరకలను తుడిపించింది నిజం కాదా?, గాయాలకు కట్లు కట్టించింది నిజం కాదా?, గుండెపోటుతో మరణించారని చెప్పింది వాస్తవం కాదా? రాజశేఖర్ రెడ్డి ఏమైనా తన మామ గుండెపోటుతో మరణించారని చెప్పమని మీకు చెప్పారా? అంటూ ప్రశ్నించిన రఘురామకృష్ణం రాజు… సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడని, సాక్షి దినపత్రికలో అడ్డగోలు రాతలు రాస్తే అబద్ధం నిజం అవుతుందా అంటూ నిలదీశారు.
వైఎస్ వివేకానంద రెడ్డి వ్యక్తిత్వహననం ఎందుకు చేస్తున్నారన్న ఆయన, వైయస్ కుటుంబంలో ఎంతోమందికి రెండవ భార్యలు ఉన్నారని గుర్తు చేశారు. గతంలో సిబిఐ కి అవినాష్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా అరెస్టులు ఉండకూడదని అంటే, అందులో ఏదో మతలబు ఉండి ఉందని అర్థమవుతుంది.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా గత రెండు రోజులుగా ఢిల్లీలో పెద్దవారి అపాయింట్మెంట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసి విఫలమైనట్లు తెలిసింది. సీబీఐ అధికారి రామ్ సింగ్ సూట్ కేస్ యుద్ధాలను తట్టుకొని నిలబడ్డాడు. తమ పార్టీ పెద్దలు ఎంత వారినైనా సూట్ కేసులతో లోబర్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసు సీబీఐ కి ఎంతో ప్రతిష్టాత్మకం. సిబిఐతో పాటు, కోర్టులకు కూడా పరీక్షనేనని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు.
సునీత, రాజశేఖర్ లను గతంలోనే ప్రశ్నించిన సిబిఐ
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె డాక్టర్ సునీత తో పాటు, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలను కూడా గతంలోనే సిబిఐ ప్రశ్నించిందని రఘురామకృష్ణం రాజు గుర్తు చేశారు. హైకోర్టు ఆదేశాలతో, సుప్రీంకోర్టు ఉత్తర్వులతో సీబీఐ విచారిస్తున్న ఈ కేసులో, కేసు వేసిన వారినే దోషి అని అభియోగాలను ఎదుర్కొంటున్న వ్యక్తులు ఆరోపించడం విడ్డూరంగా ఉంది.
కేసు దర్యాప్తును ఎక్కడైనా న్యాయస్థానాలు చేస్తాయా?, సీబీఐ దర్యాప్తు చేసి, కోర్టుకు ఆధారాలను సమర్పిస్తుంది. అంతేకానీ నిరంజన్ రెడ్డి వాదిస్తున్నారని, అవినాష్ రెడ్డి కేసు ఫైల్ చేశారని, వీరి వెనుక జగన్మోహన్ రెడ్డి ఉండి మేనేజ్ చేస్తున్నారంటే మాత్రం… అబద్ధం, నిజం అవుతుందా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.
నేరం ఎవరు చేశారన్నది సిబిఐ చెప్పాలని, ఎవరు చేశారన్నది అభియోగాలను ఎదుర్కొంటున్న వారే చెబితే అది నిజమని నమ్మడానికి న్యాయస్థానాలు, ప్రజలు పిచ్చివారేమి కాదని అన్నారు. సీబీఐ ఇప్పటికే పోయిన తన పరపతిని నిలుపుకోవాలని, న్యాయస్థానాలు కూడా తమ ఉనికిని కాపాడుకోవాలి. తన తండ్రి హత్య కేసులో అసలు సూత్రధారులు ఎవరో తెలుసుకోవడానికి సునీత న్యాయ పోరాటం చేసి ఉండి ఉండకపోతే, కోర్టులో ఈ స్థితికి కేసు వచ్చి ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డి, పీవీ సునీల్ కుమార్ కలిసి సునీత, ఆమె భర్త పైనే కేసులు నమోదు చేసి అరెస్టు చేసి ఉండేవారని రఘురామకృష్ణం రాజు అన్నారు.
నేడు కాకపోతే మరికొన్ని రోజులకు అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయం
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని శుక్రవారం నాడు కాకపోతే, మరి కొన్ని రోజుల వ్యవధిలోనే అరెస్టు చేయడం ఖాయమని రఘురామకృష్ణం రాజు తెలిపారు. సిబిఐ తరఫు వాదనలు వినక ముందే, అవినాష్ రెడ్డి గతంలో సీబీఐ అధికారులకు ఇచ్చిన స్టేట్మెంట్స్ ను, కోర్టుకు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
సిబిఐ తరపు వాదనలు విన్న తర్వాత, న్యాయస్థానం ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తుందో వేచి చూడాలి. అవినాష్ రెడ్డి అరెస్ట్ పై న్యాయస్థానం స్టే ఇవ్వకపోతే, ఈ రోజే ఆయన్ని అరెస్టు చేస్తారా? లేదా? అన్నది చూడాలన్నారు. అరెస్టుపై స్టే ఇవ్వాలని కోరుతూ హడావిడిగా అవినాష్ రెడ్డి కేస్ మూవ్ చేయడం వెనుక జగన్మాయ ఉండి ఉంటుందని అన్నారు.
పూల పిచ్చోడికి ఫ్లవర్ స్టార్ అని పేరు పెట్టాం
జనసేనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీకి యువరత్న నందమూరి బాలకృష్ణ అండగా ఉండగా, తమ పార్టీకి పోసాని కృష్ణ మురళి, ఆలీ వంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమెడియన్లు మాత్రమే అండగా ఉన్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు.
తమ పార్టీకి సరైన హీరో ఎవరు అండగా లేరని బాధపడుతున్న వారికి, రాజమండ్రిలో ఒకే ఒక షో నడిచిన ఒరేయ్ నిన్నే అనే ఏకైక సినిమా లో నటించిన హీరో ఉన్నాడని, ఆ పూల పిచ్చోడికి తాము ఫ్లవర్ స్టార్ అని పేరు పెట్టుకున్నాం. జగన్ అనుమతిస్తే పది సినిమాలలో నటించి, 10 సూపర్ హిట్ లు కొడుతాడట. పది కాదని, పదేపదే సినిమాలలో నటించి ఆస్కార్ అవార్డును అందుకోవాలని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. సినిమాలలో బూతు చిత్రాలను సెన్సార్ చేస్తారు. బూతు ముఖాలను సినిమాలలో అనుమతించే అవకాశం లేనందు వల్ల, వెబ్ సిరీస్ లలో నటిస్తే పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చునంటూ అపహాస్యం చేశారు.
తన బొమ్మల కోసం 1800 కోట్లు ఖర్చు
జగనన్న భూహక్కు పథకంలో భాగంగా రాళ్లను నాటించడానికి, వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి సుమారు 17 నుంచి 1800 కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చవుతోందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. తన తండ్రి పేరు, తన బొమ్మ కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. అయినా ప్రజలు ప్రశ్నించకపోవడం విడ్డూరంగా ఉంది. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండాలంటే, ప్రజల భూ హక్కు పత్రాలపై, హద్దురాళ్లపై బొమ్మలు వేసుకోవడం, పచ్చబొట్టు పథకాలు తీసుకురావడం కాదని, ప్రజలకు మంచి చేయాలని రఘురామకృష్ణం రాజు సూచించారు.
వేల కోట్ల రూపాయల ప్రజాధనం అడ్డగోలుగా ఖర్చు చేస్తూ, ప్రజలకు జవాబు దారి గా వ్యవహరించాల్సిన అవసరం లేదన్నట్టు వ్యవహరించడం దారుణం. అడ్డగోలు ప్రజాధనం వృధాపై ప్రజలేమని అనుకుంటున్నారని పట్టించుకోరా? అంటూ రఘురామకృష్ణం రాజు నిలదీశారు. ఒక భార్యకు 18 మంది భర్తలను సృష్టించారని, ఆ 18 మంది ఇంటి పేర్లు వేరు వేరు అని ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నమోదు చేసిన దొంగ ఓట్లను ప్రస్తావిస్తూ రఘురామకృష్ణంరాజు ఫైర్ అయ్యారు.
ఢిల్లీలో కేవలం 100 కోట్ల మద్యం కుంభకోణం జరిగితే ప్రధానమంత్రి స్పందించారని, అన్నింటికీ ఆయనే స్పందించాలనుకోవడం సరికాదు. రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేస్తున్నా ప్రజలు, న్యాయస్థానాలు స్పందించకపోవడం విడ్డూరంగా ఉంది. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఇంటింటికి వచ్చినప్పుడు ఈ విషయమై ప్రజలు వారిని నిలదీయాలని రఘురామకృష్ణం రాజు కోరారు.