Suryaa.co.in

Editorial

కాసానితో.. కష్టమేనా?

– ఖమ్మం సభ తర్వాత తెలంగాణలో ఊపందుకోని టీడీపీ
– నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్‌లో బహిరంగసభలేవీ?
– కమిటీలు రద్దు చేయడంతో పట్టించుకోని నేతలు
– కాసాని ఏకపక్ష నిర్ణయాలపై నేతల అసంతృప్తి
– కార్యాలయంలో కుటుంబపాలనపై ఫిర్యాదులు
– ఇప్పటిదాకా జిల్లా పర్యటనలు చేయని కాసాని
– బాబుకు ఇచ్చిన హామీలు అమలుచేయటం లేదంటున్న సీనియర్లు
– పరిగెత్తించకున్నా కనీసం నడిపించడం లేదంటున్న తమ్ముళ్లు
– కుల సంఘం మాదిరిగా పార్టీని నడిపిస్తే కష్టమంటున్న నేత లు
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఖమ్మం సభ సూపర్ హిట్‌తో తెలంగాణలో టీడీపీపై.. నాయకత్వం-క్యాడర్ పెట్టుకున్న ఆశలు, ఆవిరవడం ఆ పార్టీ నేతలను నిరాశపరుస్తోంది. ముదిరాజ్ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్‌కు తెలంగాణ టీడీపీ పగ్గాలు అందించిన తర్వాత, తెలంగాణలో పార్టీ మళ్లీ పరుగులు తీస్తుందని తమ్ముళ్లు తొలుత అంచనా వేశారు. కానీ ఇప్పుడు పరిగెత్తడం మాట అటుంచి, కనీసం సక్రమంగా నడిచే పరిస్థితి కూడా లేకపోవడంపై సీనియర్లు పెదవి విరుస్తున్నారు.

తెలంగాణలో టీడీపీని మళ్లీ గాడిలో పెడతానని, అందుకు తన సొంత వనరులు వినియోగిస్తానన్న హామీతో, కాసాని పార్టీ పగ్గాలు తీసుకున్నారని తమ్ముళ్లు చెబుతున్నారు. ఆ ప్రకారంగా పగ్గాలందుకున్న కాసాని ప్రమాణ స్వీకారోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత నగరంలో.. ఆరోజు, టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు రెపరెపలాడాయి. ఆ హడావిడి చూసిన తమ్ముళ్లు, ఇక తెలంగాణలో పార్టీ పరుగులు తీస్తుందని అంచనా వేశారు.

అందుకు తగినట్లే.. ఆ తర్వాత ఖమ్మంలో నిర్వహించిన భారీ బహిరంగసభ అంచనాలకు మించి సూపర్‌హిట్టయింది. అది తెలంగాణలో టీడీపీ ఆశలకు మొగ్గతొడిగేలా చేసింది. దానితో తెలంగాణలో టీడీపీ విస్తరణపై పార్టీ వర్గాల్లో అంచనాలు పెరిగాయి. నిజానికి ఖమ్మం సభ సక్సెస్‌లో కాసాని పాత్రమేలేదని, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కమ్మ సామాజికవర్గ ప్రముఖులు, కొందరు బీసీ నేతలు విరాళాలు పోగేయడంతో సభ సక్సెస్ అయిందని, పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే పార్టీ అధ్యక్షుడు కావడంతో, ఆ క్రెడిట్ సహజంగా కాసానికే దక్కిందని విశ్లేషిస్తున్నారు.

ఆ ఊపులో నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్‌లో బహిరంగసభలు నిర్వహిస్తామని ప్రకటించారు. కానీ అది ఇప్పటిదాకా ఫలించలేదు. రకరకాల సాకులతో కాసాని సభలు నిర్వహించడం లేదని నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరిగే పార్టీ వ్యవస్థాపక దినోత్సవం కూడా చంద్రబాబు మందలిస్తేనే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్నారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది.

ఖర్చు విషయంలో కాసాని చెప్పేది ఒకటి-చేసేది మరొకటి ఉంటుందన్న విషయం, బహుశా తమ అధినేతకు తెలియక, పార్టీ పగ్గాలు ఆయనకు అప్పగించినట్లున్నారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా సికింద్రాబాద్‌లో కాసాని పోటీ చేసినప్పటి అనుభవాలు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం పార్టీని పూర్తిగా కాసాని ఇష్టానికే అప్పగించారని, అందువల్ల అధినేత చంద్రబాబు జోక్యం చేసుకోవడం లేదన్న వ్యాఖ్యలు సీనియర్ల నుంచి వినిపిస్తున్నాయి.

ఇక కాసాని పార్టీని రాజకీయ పార్టీ మాదిరిగా కాకుండా, ఒక కలసంఘం మాదిరిగా నడిపిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన నడిచేందుకు సహకరించే కొడుకు, పార్టీ రోజువారీ కార్యక్రమాల్లో కూడా జోక్యం చేసుకోవడంపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్లు కాసానితో మాట్లాడే సమయంలో కూడా కొడుకు, అధ్యక్షుడి గదిలో ఉండటంతో తమకు ఇబ్బందిగా ఉందని సీనియర్లు చర్చించుకుంటున్న పరిస్థితి.

కాగా పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా.. పత్రికలకు ఇచ్చిన ప్రకటనలో , తెలంగాణకు చెందిన ముగ్గురు పొలిట్‌బ్యూరో సభ్యులయిన రావుల చంద్రశేఖర్‌రెడ్డి, అరవింద్‌కుమార్, బక్కని నర్శింహులు, రాష్ట్ర ఇన్చార్జి కంభంపాటి రామ్మోహన్‌రావు ఫొటోలు లేకుండా, కేవలం కొడుకు ఫొటోతో ప్రకటన ఇవ్వడంపై కార్యకర్తల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీన్నిబట్టి కాసానికి పార్టీ నిర్మాణంపై, ఎంత అవగాహ న ఉందో అర్ధమవుతోందని ఓ నాయకుడు వ్యాఖ్యానించారు.

కాసాని అధ్యక్షుడయ్యాక, ప్రస్తుతం ఉన్న కమిటీలను రద్దు చేయటం వివాదంగా మారింది. ఒక పెద్ద పార్టీని నడిపించే అనుభవం లేకపోతే, ఫలితాలు ఇలాగే ఉంటాయని తమ్ముళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం నత్తనడక నడవడానికి, కమిటీల రద్దు కూడా ఒక కారణమంటున్నారు. సభ్యత్వ కార్యక్రమానికి సంబంధించి ఇచ్చిన కిట్లను కూడా, సక్రమంగా పంపిణీ చే యలేని నాయకత్వం ఉందని సీనియర్లు పెదవి విరుస్తున్నారు.

పార్టీ నిర్వహణకు కావలసిన ఆర్ధిక వనరులు, తానే సమకూరుస్తానని హామీ ఇచ్చిన కాసాని.. ఇప్పటిదాకా జిల్లా పార్టీ కార్యాలయ నిర్వహణకు, ఆర్ధిక వనరులు కూడా సమకూర్చలేదని జిల్లా నేతలు చెబుతున్నారు. సహజంగా వారికి పార్టీ కార్యాలయం నుంచే వేతనాలు చెల్లిస్తుంటారు. కానీ ఇప్పుడు వారికి కాసాని, ఎలాంటి వేతనాలు ఇవ్వడం లేదన్న ప్రచారం జరుగుతోంది.

ఇక కాసాని అధ్యక్షుడయిన తర్వాత, ఇప్పటిదాకా జిల్లా పర్యటనలు కూడా చేయలేదని సీనియర్లు గుర్తు చేస్తున్నారు. పార్టీ కార్యాలయం, ఇల్లు తప్ప మరొకచోటకు కదలడం లేదంటున్నారు. చివరకు తన రంగారెడ్డి జిల్లాలో కూడా, పర్యటనలు చేయడం లేదని చెబుతున్నారు. జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ వ్యక్తిని పార్టీ ఆఫీసుకు రావద్దని గతంలో ఆదేశిస్తే, ఇప్పుడు అదే వ్యక్తిని కాసాని కొడుకు మళ్లీ తీసుకువచ్చారని చెబుతున్నారు.

కాసానిని కలిసేందుకు నగరం, జిల్లాల నుంచి వచ్చే వారిని లోపలికి పంపించే సరైన వ్యవస్థ లేదని, ఓ సీనియర్ నేత ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా నేతల మధ్య జరుగుతున్న కుమ్ములాటలు, ఫిర్యాదులనే పరిష్కరించలేని కాసాని, ఇక పార్టీని ఎలా నడిపిస్తారో అర్ధం కావడం లేదని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

LEAVE A RESPONSE