40 నియోజకవర్గాల్లో 10 లక్షల టీడీపీ ఓటర్లకు ఎసరు?

– ఒక్కో నియోజకవర్గానికి 25 వేల ఓట్ల వరకూ తొలగింపు?
– కుప్పంతో సహా ప్రముఖ నేతల నియోజకవర్గాలపై ైవె సీపీ కన్ను?
– స్థానికంగా లేని టీడీపీ సానుభూతిపరుల ఓట్లపైనే వైసీపీ దృష్టి?
– వాలంటీర్ల నివేదికలే కీలకం?
– ఫారం-7 అస్త్రంతో ఓటర్ల తొలగింపు?
– దానిని ఎదుర్కొనేందుకు మున్సిపాలిటీ స్థాయిలో టీడీపీ ప్రత్యేక యంత్రాంగం
– వైసీపీ వ్యూహంతో టీడీపీ అప్రమత్తం
– ఓటర్ల జాబితాపై టీడీపీ ప్రత్యేక కమిటీ
– ‘తిరుపతి ప్రయోగం’ అడ్డుకునేందుకు కసరత్తు ప్రారంభం
– ఓట్లు తొలగించడం, పక్క నియోజకవర్గాల వారిని చేర్పించే ‘తిరుపతి వ్యూహం’ అడ్డుకునేందుకు పార్టీ ఆఫీసు నుంచే మానిటరింగ్ కమిటీ
– ఎన్నికలకు ముందే వాలంటీర్లపై ఎక్కడికక్కడ కలెక్టర్లకు ఫిర్యాదుకు సిద్ధమవుతున్న టీడీపీ
– 25 వేల ఓట్లకు ఒక క్లస్టర్ ఇన్చార్జి
– 5 వేల ఓట్లకు ఒక యూనిట్ ఇన్చార్జి
– వీరిద్దరికీ నెలవారీ రిపోర్టులు పంపే వ్యవస్థ ఏర్పాటు
– 30 కుటుంబాలకు ఒక కుటుంబ సాధికార సారథి
– ఓటర్ల తొలగింపును అడ్డుకునేందుకు టీడీపీ ప్రత్యేక డ్యాష్‌బోర్డ్
– వైసీపీ వేగుల సమాచారంతో టీడీపీ అప్రమత్తం?
– కొద్దిరోజుల నుంచి పార్టీ నేతలతో బాబు ప్రత్యేక సమావేశాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

రానున్న ఎన్నికల్లో తమ పార్టీ సానుభూతి పరుల ఓట్లను వైసీపీ సర్కారు తొలగిస్తుందని టీడీపీ నాయకత్వం అనుమానిస్తోందా? అందులో భాగంగా కుప్పం సహా, 40 నియోజకవర్గాల్లో 25 వేల తన పార్టీ సానుభూతిపరుల ఓట్లను వాలంటీర్ల సాయంతో తొలగించేందుకు, వైసీపీ సిద్ధమవుతోందని టీడీపీ అనుమానిస్తోందా? ఆ మేరకు వైసీపీలోని తమ వేగుల నుంచి వస్తున్న సమాచారంతో అప్రమత్తమవుతోందా? వైసీపీ వ్యూహం ఎదుర్కొనేందుకు ప్రతి వ్యూహం రచిస్తోందా? అందులో భాగంగా జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులపై ఒత్తిడి వ్యూహం పెంచేందుకు సిద్ధమవుతోందా? ఈ మొత్తం వ్యూహంలో వాలంటీర్లు ఉక్కిరిబిక్కిరి కానున్నారా? ఆ మేరకు వాలంటీర్ల పనితీరుపై ప్రత్యేక నిఘా వ్యవస్థకు టీడీపీ నాయకత్వం ప్రాణం పోసిందా? వైసీపీ వ్యూహం ఎదుర్కొనేందుకు, మంగళగిరి పార్టీ ఆఫీసు కేంద్రంగా ప్రత్యేక వ్యవస్థ పనిచేస్తోందా?

‘వైసీపీ తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక వ్యూహం’ అడ్డుకునేందుకు పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తోందా? ఆ మేరకు ‘వైసీపీ విభీషణుల’ నుంచి ఎ్పటికప్పుడు వస్తున్న హెచ్చరికలతో, పార్టీ వ్యవస్థలను టీడీపీ నాయకత్వం అప్రమత్తం చేస్తోందా? ఓటర్లను తొలగించే ఫారం-7పై, దృష్టి సారించేందుకు మున్సిపాలిటీ స్థాయిలో యంత్రాంగం సమకూర్చుకునే పనిలో ఉందా? .. గత కొద్దిరోజుల నుంచి కేవలం ఓటర్ల జాబితా, కొత్త ఓటర్లు, చనిపోయిన ఓటర్లు ఎంతమంది అన్న అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ యంత్రాంగంతో నిర్వహిస్తున్న భేటీలు.. ఇలాంటి సందేహాలనే తెరపైకి తీసుకువస్తున్నాయి.

టీడీపీ వర్గాల సమాచారం ప్రకారం… తాజా ఎమ్మెల్సీల విజయంతో ఉత్సాహం ఉరకలేస్తున్న టీడీపీ నాయకత్వం.. వచ్చే ఎన్నికల్లో తనను అడ్డుకునేందుకు ఓటర్ల జాబితాపై కన్నేసిందన్న సమాచారంతో అప్రమత్తమయింది. ఆ ప్రకారంగా ఒక్కో నియోజకవర్గానికి 15 నుంచి 25 వేల టీడీపీ సానుభూతిపరులు, నాయకుల కుటుంబాల ఓట్లపై కన్నేసినట్లు టీడీపీకి సమాచారం అందినట్లు తెలిసింది. దానితో అప్రమత్తమైన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ప్రతిరోజూ రెండుగంటలు కేటాయించి, వాటిని ఎదుర్కొనే వ్యూహంపైనే పార్టీ నేతలతో చర్చిస్తున్నారు.

ఆ మేరకు పార్టీ కార్యాలయంలోనే ఎన్నికల వ్యవస్థ- శాసనసభ వ్యవహారాలపై అవగాహన-నైపుణ్యం ఉన్న ఓ కీలక నాయకుడికి, ఆ బాధ్యత అప్పగించినట్లు సమాచారం. ఆ బృందంతో చంద్రబాబు రోజుకు రెండు గంటలు మాట్లాడుతున్నారు. వైసీపీ తొలగించబోయే నియోజకవర్గాలు, నేతలు-సానుభూతిపరుల కుటుంబాలను అంచనా వేసి, ఆ మేరకు ఇప్పటినుంచే వారిని అప్రమత్తం చేస్తున్నారు.

తిరుపతి ఎన్నికల్లో వైసీపీ చేసిన ఓటర్ల మార్పుచేర్పుల ప్రయోగం విజయవంతం కావడంతో, ఆ ప్రయోగాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలుకాకుండా చూడాలని టీడీపీ పట్టుదలతో ఉంది. ఆ మేరకు నిపుణులు, న్యాయవాదులతో ఒక కమిటీ వేసింది. ప్రధానంగా మృతి చెందిన ఓటర్ల వివరాలతోపాటు, కొత్తగా చేర్పించిన ఓటర్ల వివరాలను వార్డు స్థాయిలో తెప్పించుకునే పనిలో ఉంది.

ఆ మేరకు ప్రతి 30 కుటుంబాలకు ఒక కుటుంబ సాధికార సారథి నుంచి, క్షేత్రస్థాయి సమాచారం తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నుంచి.. ప్రముఖ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో, వైసీపీ ఓటు ప్రయోగం చేస్తుందన్న సమాచారం రావడంతో టీడీపీ నాయకత్వం అపమత్తమయింది.

గత ఎన్నికల్లో 5 వేలు, 5-10 వేలు, 10-15 వేల తేడాతో ఓడిపోయిన టీడీపీ నేతల నియోజకవర్గాల పోలింగ్ సరళిని సమీక్షిస్తోంది. అదేవిధంగా 23 స్థానాల్లో వైసీపీ ఎంత తేడాతో ఓడిన వైనాన్ని కూడా, ఈ కమిటీ విశ్లేషిస్తున్నట్లు సమాచారం. దీని ద్వారా, వైసీపీ ఎన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ఓటర్లను తొలగించడం, తమకు అనుకూలురలైన వారిని ఓటర్లుగా చేర్పిస్తుందో తెలుసుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. దానితోపాటు ప్రత్యామ్నాయ వ్యూహం త యారుచేసుకునేందుకు ఈ ప్రక్రియ పనికివస్తుందని నాయకత్వం భావిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కాగా 25 వేల ఓట్లకు ఒక క్లస్టర్ ఇన్చార్జి, 5 వేల ఓట్లకు ఒక యూనిట్ ఇన్చార్జిని నియమించనుంది. దీనిద్వారా వీరంతా ఓటర్ల జాబితాకు సంబంధించి, తమ పరిథిలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రక్రియను ఏర్పాటు చేసుకున్నట్టవుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. దానితోపాటు రాష్ట్ర స్థాయిలో వివిధ అంశాలపై తాము నిరంతరం చేయించే సర్వే ఫలితాలు, స్థానిక పరిస్థితులు ఎలా ఉన్నాయన్న నెలవారీ రిపోర్టులు పంపే వ్యవస్థకు టీడీపీ శ్రీకారం చుట్టింది. పార్టీకి సంబంధించి ప్రజలకు చేరవేసే కరపత్రాలు-సాహిత్యాన్ని, వీరిద్వారా కుటుంబసాధికార సారథులకు పంపిణీ చేసేందుకు టీడీపీ నాయకత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఇక ప్రధానంగా.. తన పార్టీ ఓటర్లు-సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు పనికివచ్చే, ఫారం-7పై పూర్తి స్థాయి దృష్టి సారించాలని టీడీపీ నిర్ణయించింది. బీఎల్‌ఓలను వైసీపీ నేతలు బెదిరించకుండా వారికి రక్షణ కల్పించడంతోపాటు, ఎవరెవరి పేర్లు తొలగించాలన్న సమాచారాన్ని తెలుసుకోవాలని పార్టీ నేతలకు సూచించింది.

ఎలక్షన్ డిటిల సహకారంతో.. ఫారం-7తో తన పార్టీ కార్యకర్తల ఓటర్లను తొలగించేందుకు వైసీపీ సిద్ధమవుతోందని, టీడీపీ నాయకత్వానికి ‘వెసీపీ విభీషణుల’ ద్వారా సమాచారం అందినట్లు తెలుస్తోంది. దానితో ఓటరు లిస్టును ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని తన పార్టీ యంత్రానికి సందేశాలు పంపిస్తోంది. నిబంధనల ప్రకారం సంబంధిత బీఎల్‌ఓలు పంచాయతీల్లో పబ్లికేషన్ ఇచ్చి, ఇద్దరు సాక్షుల సంతకంతో ఆ ఓటును తొలగించారా? లేదా? అన్న అంశాన్ని తనిఖీ చేయాలని, పార్టీ నాయకత్వం తన శ్రేణులకు ఆదేశాలు జారీ చేసింది.

అదే సమయంలో స్థానికంగా ఉండకుండా, ఉద్యోగ-ఉపాథి-వ్యాపారాల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లిన పార్టీ సానుభూతిపరుల ఓట్లు కొనసాగుతున్నాయా? తొలగించబడ్డాయా? వారి ఓట్లు కొనసాగించేందుకు ఏం చేయాలన్న అంశాలను తనిఖీ చేసే వ్యవ స్థకు, టీడీపీ పదునుపెడుతున్నట్లు సమాచారం.

వాలంటీరీ వ్యవస్ధ ద్వారా, ఓట్ల తొలగింపు వ్యవహారం నడిపించేందుకు వైసీపీ సిద్ధమవుతోందని గ్రహించిన టీడీపీ… అందుకు ప్రతిగా, ఎక్కడికక్కడ వాలంటీర్ల చర్యలపై కలెక్టర్లకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా… ఈ ఓటర్ల తొలగింపు కుట్రను అడ్డుకునేందుకు, పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పర్యవేక్షణలో, ఒక డాష్‌బోర్డును ఏర్పాటుచేసినట్లు సమాచారం. దీని ద్వారా వైసీపీ ఓటుతొలగింపు కుట్రను అడ్డుకుంటామని టీడీపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు.

ఎన్నికల ముందు వైసీపీ ఈ కుట్రను ప్రారంభించే ప్రమాదం ఉన్నందున, ఇప్పటినుంచే తాము ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నామని వివరించారు. ఓట్లు తొలగించిన తర్వాత కలెక్టర్లు- ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం, దానిపై వారు చర్య తీసుకునేలోగా పోలింగ్ పూర్తి అవుతున్నందున.. ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, నిపుణులతో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు.

Leave a Reply