ఇండోర్ శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. మహదేవ్ మందిర్‌లో పైకప్పు కూలి మెట్లబావిలో పడి 13 మంది మృతి చెందారు..మరో 19 మందిని సురక్షితంగా కాపాడారు సిబ్బంది. మెట్లబావిపై స్లాబ్ వేసి గదిలా వాడుతున్నారు నిర్వాహకులు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే.. మృతుల్లో 10 మంది మహిళలు ఉన్నట్టు గుర్తించారు.
పటేల్‌నగర్ ప్రాంతంలో ఉన్న మహదేవ్జులేలాల్ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. వేడుకలను చూసేందుకు కొందరు భక్తులు.. ఆలయ ప్రాంగణంలో ఉన్న మెట్ల బావిపై కూర్చున్నారు. దురదృష్టవశాత్తూ ఆ బావి పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో దాదాపు 30 మంది భక్తులు బావిలో పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నిచ్చెన, తాళ్ల సాయంతో కొందరు భక్తులను కాపాడి ఆసుపత్రికి తరలించారు. బావి లోతు 50 అడుగులపైనే ఉన్నట్లు తెలుస్తోంది.