Suryaa.co.in

Telangana

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులపై ఒక్క కేసు అయినా పెట్టారా?

-సీఎం కేసీఆర్‌ కుటుంబ ఆస్తి రూ.లక్ష కోట్లకు
-కేసీఆర్‌ అవినీతిపై ఇప్పటి వరకు 50 ఫిర్యాదులు చేశా
-రాష్ట్రంలో 80శాతం మంది కేసీఆర్‌కు వ్యతిరేకం
-కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు 80 సీట్లు ఇస్తారు
-కేసీఆర్‌కు 25 సీట్లు లోపే
-పరిశీలనలో 6 నెలల ముందే టికెట్లు
-టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ కుటుంబ ఆస్తి రూ.లక్ష కోట్లకు చేరిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబ ఆస్తులపై ఒక్క కేసు అయినా పెట్టారా? అని ప్రశ్నించారు. భాజపా, భారాస మధ్య సంబంధాలు ఉన్నాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. సంబంధం లేకపోతే కేసీఆర్‌ ఆస్తులపై ఎందుకు విచారణ చేయట్లేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ అవినీతిపై ఇప్పటి వరకు 50 ఫిర్యాదులు చేశానని.. ఒక్క దానిపై కూడా చర్యలు తీసుకోలేదన్నారు.

‘‘రాష్ట్రంలో 80శాతం మంది కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారు. ప్రజలు తమ వ్యూహాన్ని రూపొందించుకుంటున్నారు.. దానికి అనుగుణంగా రాజకీయ పార్టీలు అడుగులు వేస్తున్నాయి. పదేళ్లలో .. రాష్ట్రంలో భారాస, కేంద్రంలో భాజపా చేసిందేమిటో ప్రజలకు చెప్పగలరా? నీటిపారుదల విషయంలో కేసీఆర్‌ అబద్ధాలు చెబుతున్నారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను కాంగ్రెస్‌ పార్టీ మొదలు పెట్టింది. ఇప్పుడు దాన్ని కేసీఆర్‌ మార్కెటింగ్‌ చేసుకున్నారు. పాదయాత్రలో అనేక విషయాలు స్థానిక ప్రజలకు సవివరంగా చెప్పగలిగాం. ప్రజలు అడిగినవి పక్కనపెడితే.. కేసీఆర్‌ ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా? టీచర్‌ నియామకాలు చేపట్టారా? తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ కోసం రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఇప్పుడు ఆ స్వేచ్ఛనే కేసీఆర్‌ గుంజుకున్నారు.

కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు 80 సీట్లు ఇస్తారు. కేసీఆర్‌కు 25 సీట్లు లోపే ఉంటాయి. భాజపా సింగిల్‌ డిజిట్‌లో ఉంటుంది. నేను ఏ సర్వేలు చూడను.. ప్రజలతో అనుబంధం, వారితో మాట్లాడిన తర్వాతే ఈ విషయం చెబుతున్నా. ఈసారి కొడంగల్‌లో పోటీ చేయాలని అనుకుంటున్నా. ఇదే విషయాన్ని పార్టీకి చెప్పా. 6 నెలల ముందే టికెట్లు ప్రకటించాలని మిత్రుల నుంచి సూచనలు వచ్చాయి. పరిశీలనలో ఉంది’’ అని రేవంత్‌రెడ్డి వివరించారు.

LEAVE A RESPONSE