హైదరాబాద్, ఏప్రిల్ 6 :: రాష్ట్రంలో రెండవ విడత గొర్రెల పంపిణి పధకాన్ని ప్రభుత్వం ప్రారంభించనున్న నేపథ్యంలో గొర్రెల యూనిట్ల సేకరణ, రవాణా, లబ్ధిదారుల నుండి డిపాజిట్ల సేకరణ తదితర కార్యాచరణ ప్రణాలికను సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. రెండవ విడత గొర్రెల పంపిణి, హైదరాబాద్ లో అతిపెద్ద బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో నేడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పశు సంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా , పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, రోడ్లు , భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఎస్సీ అభివృద్ధి శాఖ కమీషనర్ యోగితా రాణా తదితర అధికారులు ఈవీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.
ఈ సందర్బంగా సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, రాష్ట్రంలో రెండవ విడతలో 3.38 లక్షల మందికి గొర్రెలను పంపిణి చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా ప్రణాళికను సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. కలెక్టర్ల నాయకత్వంలోనే ఈ గొర్రెల పంపిణి కార్యక్రమం నిర్వహించాలని స్పష్టం చేశారు. అత్యధిక లబ్దిదారులున్న 12 జిల్లాల కలెక్టర్లు ఈ పధకంపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. రవాణా సంబంధిత టెండర్లను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్లను కోరారు. హైదరాబాద్ సచివాలయ సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 125 అడుగుల ఎత్తైన డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఈనెల 14 న నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి కలెక్టర్లందరూ వారి జిల్లా ప్రజలతో హాజరవ్వాలని సి.ఎస్ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు మున్సిపల్ పరిపాలన శాఖ కమీషనర్ సత్యనారాయణ, పంచాయతీ రాజ్ కమీషనర్ హనుమంత రావు, TSIIC MD నర్సింహా రెడ్డి, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్ తదితరులు హాజరయ్యారు.