– బాబోయ్… బాబాయ్ హత్య కేసు విచారణ
– వివేకా హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు
– గుండెపోటు నుంచి గొడ్డలిపోటు
– చంద్రబాబు నుంచి వివేకా అల్లుడి వరకూ
– మధ్యలో వివేకా వివాహేతర సంబంథం
– కేసు పుణ్యాన మారిపోయిన వివేకా పేరు
– హిందూ-క్రైస్తవ నుంచి ముస్లిం అయిన వివేకానందరెడ్డి
– తాజాగా తెరపైకి యాదవ్ తల్లి కథనం
– కామాంధుడిగా మగిలిపోయిన వివేకానందరెడ్డి
– విజయవంతంగా వెళ్లిపోయిన సీబీఐ ఎస్పీ
– ఇంతకూ ‘హూకిల్డ్ బాబాయ్’?
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఇంగ్లీషు క్రైమ్-హర్రర్- సస్పెన్స్- థ్రిల్లర్ సినిమాలకు మించి.. ట్విస్టుల మీద ట్విస్టులతో మలుపుతిరుగుతున్న, మాజీ ఎంపి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ భలే ఆసక్తికలిగిస్తోంది. దీనిని పోలీసు అకాడెమీలో ఒక సబ్జెక్టుగా చేర్చడం ద్వారా, కొత్తగా ఉద్యోగాల్లోకి వచ్చే ఐపిఎస్‌లకు, ఒక మార్గదర్శి అవుతుందన్న సూచనలు అటు పోలీసు వర్గాల్లోనూ వినిపిస్తోంది.
తెలుగు సినిమాలకు కథలు దొరకడం లేదని.. తరచూ వాపోయే దర్శక-నిర్మాతలకు, వివేకా హత్య కేసు కథ ఒక రోల్‌మోడల్. వివేకానందరెడ్డి హత్య నుంచి.. ఇప్పటి విచారణ తీరు వరకూ దొర్లుతున్న ట్విస్టులు, వాదనలు, రాజకీయ నేతల ప్రకటనలు, మీడియా కథనాలను కథావస్తువుగా తీసుకుని సినిమా తీస్తే… బాహుబలి, ఆర్ఆర్ఎస్ సినిమాలకు మించిపోతుంది. హాలీవుడ్‌కు వెళ్లి అవార్డుల కోసం పైరవీలు చేసుకోకుండానే, ‘హుకిల్డ్బాబాయ్’ కథకు.. ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశం ఉందన్నది సినీజీవుల ఉవాచ.
అసలు వివేకా కేసే.. మొదటి నుంచి యమా సస్పెన్స్‌తో మొదలయింది. ఆయన గుండెపోటుతో మృతి చెందారని అధికార వైసీపీ నేతలతోపాటు, ఆయనను అమితంగా ప్రేమించే వైఎస్ కుటుంబసభ్యులు మీడియాకు వెల్లడించారు. అసలు ఆయన గుండెపోటుతో బాల్చీ తన్నేశారని బయట ప్రపంచానికి, కోడి కూయకముందు చెప్పిందే వైసీపీ అధికార మీడియా! అయితే ఆ తర్వాత తూచ్.. అది గుండెపోటు కాదు, గొడ్డలి పోటేనని సెలవిచ్చింది. అది వేరే విషయం. ఆ గొడ్డలి పోటు వేసింది కూడా.. అప్పటి అధికార టీడీపీ వారేనని, అన్ని వేళ్లూ చంద్రబాబునాయుడు వైపే చూపించారు. దానితో ఆ హత్యపై విచారణకు బాబు సర్కారు సిట్ వేసింది.
అయితే బాబు సర్కారు విచారణను నమ్మే ప్రసక్తి లేనందున, సీబీఐ విచారణ జరిపించాలని వివేకాను అమితంగా ప్రేమించే జగన్ డిమాండ్ చేశారు. జగన్ అసెంబ్లీలో చెప్పినట్లు.. ఆయనకు వివేకా-అవినాష్ రెండు కళ్లు. కాబట్టి బాబాయ్‌ను ఎవరు లేపారో తెలుసుకోవాలన్న కోరిక, అబ్బాయికి సహజంగా ఉంటుంది. కాబట్టి జగన్ సీబీఐ విచారణ డిమాండ్‌ను తప్పు పట్టాల్సిన పనిలేదు.
అబ్బాయ్ జగన్ అధికారంలోకి వచ్చేసినందున.. బాబాయ్ హత్య కేసును, పంచకల్యాణి గుర్రం కూడా ఈర్య్యపడే స్థాయిలో పరుగులు తీయిస్తారని, మెడపై తల ఉన్నవారంతా అనుకున్నారు. అది అత్యాశ కాదు కదా? అయితే సిట్ అధికారులను మార్చేసిన జగనన్న .. చివరాఖరకు, ఇక సీబీఐ కేసు అవసరం లేదని, మా సిట్ అన్నీ చూసుకుంటుందని కోర్టుకు విన్నవించారు. అసలు కథ అక్కడి నుంచే మొదలయింది.
అన్నయ్య తీసుకున్న నిర్ణయంతో, డాక్టర్ చెల్లెమ్మ సునీత ఖంగుతింది. ఆ తర్వాత సొంత మీడియా
కథనాలన్నీ అల్లుడు రాజశేఖర్‌రెడ్డి చుట్టూ అల్లడంతో, అప్రమత్తమైన డాక్టర్ చెల్లెమ్మ.. తండ్రి వివేకా హత్య కేసును మరో రాష్ర్టానికి అప్పగించాలని కోరుతూ, కోర్టు గుమ్మమెక్కడంతో కథ కొత్త మలుపు తిరిగింది. ఆ తర్వాత సొంత మీడియాలో వివేకా రెండో పెళ్లి, అసలు నిందితుడు అల్లుడేనంటూ అపరాధ పరిశోథన కథనాలొచ్చాయి.
సుప్రీంకోర్టు కూడా డాక్టర్ చెల్లెమ్మ అభ్యర్ధన మన్నించి, కేసును తెలంగాణ రాష్ర్టానికి బదిలీ చేసింది. కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ ఎస్పీ రాంసింగ్, పులివెందుల వెళ్లి నానా హడావిడి చేశారు. సీబీఐ సినిమాల మాదిరిగా, ఆయన తీగ లాగే ప్రయత్నంలో చాలా విషయాలు తెలుసుకున్నారు. దానితో ఆయనపైనే పోలీసు కేసు పెట్టడం మరో విశేషం.
ఈలోగా మళ్లీ సీబీఐ కేసు కథకు, ఎవరో ఆదేశించినట్లు బ్రేక్ పడిపోయింది. అసలు వివేకా కేసు ఎందుకు ఆలస్యమవుతోందని మళ్లీ కోర్టు అక్షింతలు వేయడంతో, ఫలానా తేదీలోగా కేసును తేల్చేస్తాం అని సీబీఐ అభ్యర్ధించింది. పనిలో పనిగా.. సీబీఐ రాంసింగ్ సరిగా పనిచేయడం లేదని జడ్జి గారు కూడా గ్రహించి, ఆయన పనోడు కాదని తేల్చి, పక్కనపెట్టాలని తీర్పునిచ్చారు. రోగి కోరిందీ-వైద్యుడు ఆశించిందీ అదేకాబట్టి.. అంతా హ్యాపీస్!
ఆ ప్రకారం విచారణ చేస్తున్న సీబీఐ ఎస్పీ రాంసింగ్‌ను, విజయవంతంగా విచారణ నుంచి బయటకు పంపించడంలో విజయం సాధించారు. ఆ తెర వెనుక శక్తులెవరన్నది ఒక సస్పెన్స్. ఇక వివేకా రెండో పెళ్లి చేసుకున్నారని, కేసు విచారణ మధ్యలో తెరపైకి వచ్చిన కొత్త కథనం. ఆయన ఆస్తి రెండో భార్యకు వెళ్లిపోకుండా.. వివేకానంద అల్లుడు రాజశేఖర్‌రెడ్డి దగ్గరుండి, సుపారీ ఇచ్చి బాబాయ్‌ను లేపాశారన్నది మరో కథనం బయటకు వచ్చింది.
వివేకా నుంచి చెక్ పవర్ కూడా డాక్టర్ చెల్లెమ్మ గుంజేసుకున్నందున, చేతిలో చిల్లిగవ్వ లేక.. ముస్లిం మహిళ ద్వారా పుట్టిన వారసుడికి ఏమీ ఇవ్వలేక.. బాబాయ్ డబ్బుల కోసం బహు బాధపడేవారన్నది మరో ఉప కథనం.
అసలు పులివెందుల ప్రపంచానికి సైతం తెలియని, మరో అసలు రహస్యం కోర్టు వాదనలో బయటపడటం ఇంకో ఆశ్చర్యం. వివేకానంద ఒక ముస్లిం మహిళను మారు మనువు చేసుకున్నారని, దానితోపాటు ఆయన పేరు కూడా మార్చుకున్నారన్నది.. ‘అపరాధ పరిశోధకులు’ కోర్టు వాదనలో తేల్చిన మరో కొత్త కోణం.
అసలు వివేకా ముస్లిం మహిళను ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? ఎప్పుడు పేరు మార్చుకున్నారు? మరి పేరు మార్చుకున్న ‘షేక్ వివేకా ఖాన్’ ఆ పేరుతో ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు? ఆ పేరుతో ఎందుకు బ్యాంక్ అకౌంటు తీసుకోలేదు? పోనీ.. లోటస్‌పాండ్‌లో క్రైస్తవులకు గుర్తుగా శిలువ గుర్తు ఉన్నట్లు… వివేకా కనీసం తన పులివెందుల ఇంటి మీద, ముస్లిముల ‘చాంద్ గుర్తు’ ఎందుకు తగిలించుకోలేదన్నది డౌటనుమానం.
ఒకవేళ ఆయన ‘షేక్ వివేకా ఖాన్’ అయినట్లయితే.. ఆయన అంత్యక్రియలు ముస్లిం మతాచారం ప్రకారం కాకుండా, క్రైస్తవ మతాచారం ప్రకారం ఎందుకు జరిపించినట్లు? వివేకా మతం మారారని ఇప్పడు చెబుతున్న గొంతులు.. ఆయన అంతిమ సంస్కారం రోజు, ఆ విషయం వివేకా కూతురు-అల్లుడికి చెప్పి, ముస్లిం మతాచారం ప్రకారం.. అంతిమ సంస్కారం ఎందుకు చేయించలేదన్నది బుద్ధిజీవుల సందేహం.
ఇక ఇప్పుడు మరొక ట్విస్టుతో, వివేకా కేసు కొత్త మార్గం పట్టింది. సునీల్ యాదవ్ తల్లిని వివేకా, లైంగిక వేధింపులకు గురిచేసేవారట. దానితో కక్ష కట్టిన యాదవ్.. అదను చూసి వివేకాను గొడ్డలితో వేసేశారన్నది కొత్త కథనం. అంటే.. ముస్లిం మహిళను పెళ్లి చేసుకున్న వివేకా.. ఆమెతో సరిపెట్టుకోకుండా, మరో మహిళపై కన్నేసిన కామాంధుడిగా కొత్త కథ తెరపైకొచ్చిందన్నమాట. చివరాఖరకు ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసిన వివేకానందరెడ్డిని.. ఒక కామాంధుడి పాత్రలో స్థిరపరిచినట్లు కనిపిస్తుంది. కేసు తుది తీర్పు వచ్చేనాటికి ఇలాంటి కథలు, కొత్త కోణాలు ఇంకెన్ని వస్తాయో చూడాలి.
కోర్టుల్లో ఎలాగూ భగవద్గీతపై ప్రమాణం చేస్తారు కాబట్టి… మాయలు-మంత్రాలుండే భగవద్గీత మాదిరిగానే… అసలు వివేకాను ఎవరూ హత్య చేయలేదని, ఆయనంతట ఆయనే, అర్ధరాత్రి నిద్రలేచి గొడ్డలితో వేటు వేసుకున్నారన్న మరో కొత్త కథను, తెరపైకి తెచ్చినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. రాంగోపాల్‌వర్మ లాంటి రసికత ఉన్న దర్శకుడు ఇలాంటి కథతో సినిమా తీస్తే, అది సిల్వర్ జూబ్లీ ఖాయమే కదా?!