Suryaa.co.in

Features

మామిడి.. మస్తు పిరం!

-మార్కెట్లలో ముద్దొస్తున్న మామిడిపండ్లు
-ఇంకా పూర్తిగా రాని దిగుమతులు
-మార్చి దాటి ఏప్రిల్‌ వచ్చినా తరలిరాని మామిడి
-అయినా అప్పుడే రేట్లు అ‘ధర’హో

వేసవి అనగానే గుర్తొచ్చేది.. నోరూరించేది మామిడి. ఫలాల్లో రారాజుగా చెప్పుకునే ఈ పండ్లు ఈసారి ప్రియం కానున్నాయి. ఆలస్యంగా పూత రావడం.. దిగుబడి కూడా తక్కువగా ఉండటంతో పూర్తి స్థాయిలో సీజన్‌ ప్రారంభం కాలేదు. మార్చి నెలలో మామిడి మార్కెట్‌కు వస్తుందని బాటసింగారం ఫ్రూట్‌ మార్కెట్‌లో అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. అయితే అనుకున్న స్థాయిలో ఇంకా దిగుమతులు జరగలేదు. ఈ నెల ప్రారంభం నుంచి మామిడి దిగుమతులు ఉపందుకున్నప్పటికీ ధర మాత్రం హోల్‌సేల్‌ మార్కెట్‌లోనే మంచి రకం రూ.60-70 పలుకుతోంది. ఈ మధ్య కాలంలో వచ్చిన అకాల వర్షాల వల్ల కూడా పూత రాలిపోయి తోటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో మామిడి సీజన్‌ ఏప్రిల్‌ 20 తర్వాతే ప్రారంభమౌతుందని వ్యాపారులు అంటున్నారు.

సోమవారం నుంచి మామిడి మార్కెట్‌కు పోటెత్తింది. బాటసింగారం మార్కెట్‌కు సోమవారం 1500-1600 టన్నుల మామిడి దిగుమతి అయిందని మార్కెట్‌ అధికారులు చెప్పారు. ప్రస్తుతం రిటైల్‌ మార్కెట్‌లో కిలో మామిడి రూ. 80-100కు లభిస్తోంది. మార్కెట్‌కు దిగుమతులు పెరిగితే ధరలు కూడా తగ్గుతాయని వ్యాపారులు అంచనా. మామిడి క్రయ, విక్రయాల కోసం బాటసింగారం మార్కెట్‌లో 19.27 ఎకరాల్లో మార్కెట్‌ కమిటీ ఏర్పాట్లు చేసింది. ఈ సీజన్‌లో ప్రతి రోజూ 900 నుంచి 1100 వాహనాలు యార్డుకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా. ఈ నేపథ్యంలో యార్డు పక్కనే ఉన్న 7 ఎకరాల స్థలాన్ని పార్కింగ్‌కు కేటాయించడంతో పాటు ట్రాఫిక్‌ నియంత్రణకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.

మామిడి సీజన్‌ కోసం మరో లక్ష ఎస్‌ఎఫ్‌టీలో 5 షెడ్లు నిర్మించారు. తాగునీటి కోసం ప్రస్తుతం ఉన్న 5 ట్యాంకులకు అదనంగా మరో 2 ట్యాంకులు ఏర్పాటు చేశారు. విద్యుత్‌తో పాటు జనరేటర్‌నూ అందుబాటులో ఉంచారు. రైతులు, వ్యాపారుల కోసం రైతు విశ్రాంతి గదులుతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ సీజన్‌లో లక్ష మెట్రిక్‌ టన్నులకు పైగా మామిడి సరుకు యార్డుకు వచ్చే అవకాశం ఉందని మార్కెటింగ్‌ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతి ఏటా ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కృష్ణా, చిత్తూరు జిల్లాలు, తెలంగాణలోని కొల్లాపూర్, ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి మామిడి దిగుమతి అవుతుంది.

కొల్లాపూర్‌ మామిడికి దేశంలోనే అధిక డిమాండ్‌ ఉంది. బాటసింగారం మార్కెట్‌ నుంచి ఉత్తరాది రాష్ట్రాలైన ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్తాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. అయితే ప్రస్తుతం సీజన్‌ ప్రారంభ దశలో ఉన్నా బాటసింగారం మార్కెట్‌ యార్డుకు రోజు రోజుకూ మామిడి దిగుమతి పెరుగుతోందని మార్కెటింగ్‌ అధికారులు పేర్కొన్నారు.

– బోయిని బాలరాజు

LEAVE A RESPONSE