– టీడీపీ నేతలు ఆదిరెడ్డి ఆప్పారావు, ఆదిరెడ్డి శ్రీనివాస్ ల అరెస్టు ను ఖండించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
– ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీతో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పిన టీడీపీ అధినేత
అమరావతి:-రాష్ట్రంలో రోజు రోజుకూ వైసీపీ ప్రభుత్వ రాజకీయ వేధింపులు, కక్ష సాధింపులు పెరుగుతున్నాయే తప్ప…వారిలో మార్పు రావడం లేదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రత్యర్థులను ఓడించడానికి పాలనను నమ్ముకోవాల్సిన ప్రభుత్వం….అక్రమ కేసులను,అరెస్టులను మాత్రమే నమ్ముకుందని చంద్రబాబు అన్నారు. తాజాగా రాజమండ్రిలో పార్టీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి శ్రీనివాస్ ల అరెస్టు లు అందుకు సాక్ష్యం అని చంద్రబాబు మండి పడ్డారు.
గ్రామాల్లో ఉన్న తెలుగు దేశం కార్యకర్తల నుంచి….రాష్ట్ర స్థాయి నేతల వరకు ప్రతి ఒక్కరినీ కేసులతో, దాడులతో భయపెట్టి లొంగదీసుకోవాలనే దుష్ట ఆలోచనలు మానుకోవాలని ఆయన అన్నారు. సిఐడి అనేది దర్యాప్తు ఏజెన్సీనా…లేక వైసీపీ వేధింపుల ఏజెన్సీనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సిఐడి పెడుతున్న అక్రమ కేసులు, అరెస్టులపై ఇప్పటికే అనేక సార్లు కోర్టులతో చీవాట్లు తిన్నా ప్రభుత్వ బుద్ది మారకపోవడం…సిఎం జగన్ విషపు రాజకీయ ఆలోచనలకు నిదర్శనం అన్నారు.
రాష్ట్రంలో ఎవరూ ఏ వ్యాపారం చేసుకోకూడదు అన్నట్లు సిఎం జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని….ఈ కక్షసాధింపు పాలనకు వైసీపీ ప్రభుత్వం తీవ్ర మూల్యం చెల్లిస్తుందని చంద్రబాబు నాయుడు అన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ తో ఫోన్ లో మాట్లాడిన చంద్రబాబు నాయుడు….భయపడవద్దని పార్టీ అండగా ఉంటుందని సూచించారు.