Suryaa.co.in

Features

సొంత ఆస్తులను అమ్ముకుని రూపాయి లేని ముఖ్యమంత్రి!

“నాన్నగారికి మందులు తీసుకురావాలి..ఓ ఐదు రూపాయలు ఉంటే సర్దుతారా..?” తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ అడిగాడు ఆయన ! ఈ మాటలు అన్నది సాదా సీదా వ్యక్తి అయితే పెద్దగా ఆశర్యం ఉండేది కాదేమో ! కానీ ఐదు రూపాయలు చేబదులు అడిగిన వ్యక్తి టంగుటూరి ప్రకాశం గారి రెండో కుమారుడు హనుమంతరావు గారు! అప్పు అడిగింది తుర్లపాటి కుటుంబరావు గారిని !

సాక్షాత్తు ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి కొడుకు నోటినుంచి కన్నీటితో వచ్చిన మాటలు విన్న తరువాత ఎవరికైనా కంట తడి రాక మానదు !

ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన టంగుటూరి ప్రకాశం పంతులు గారి చివరి రోజుల్లో ఆర్థిక భారంతో ఆయన పడిన ఇబ్బందులకు ప్రత్యక్ష సాక్షి ఈ ఐదు రూపాయలు !

చెన్నైలో క్షణం తీరికలేని పనులు ముగించుకుని నివాసానికి చేరుకున్న టంగుటూరి ప్రకాశం గారికి కొద్దిగా అస్వస్థత గా ఉందని తెలిసి ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న తుర్లపాటి కుటుంబరావు గారు వారి నివాసానికి చేరుకున్నారు !

లోపలి నుంచి బయటకు వచ్చిన టంగుటూరి కుమారుడు తుర్లపాటి కుటుంబరావు గారి దగ్గరకు వచ్చి గద్గద స్వరంతో ” నాన్న గారికి మందులు తీసుకురావాలి..ఓ ఐదు రూపాయలు సర్దుతారా..” అనంటంతో షాక్ తో తుర్లపాటి కుటుంబరావు గారి నోటెంబట క్షణ కాలం మాట రాలేదు ! వెంటనే తేరుకుని ఉబికి వస్తున్న కన్నీటిని అతి ప్రయత్భం మీద ఆపుకుంటూ జేబులోనుంచి ఐదు రూపాయిలు తీసి ఆయన చేతిలో పెట్టాడు ! ఈ చేదు నిజాల్ని తుర్లపాటి కుటుంబరావు గారు స్వయంగా తన పుస్తకంలో కళ్ళకు కట్టినట్టు వివరించారు !!

దేశం కోసం తన ఆస్తినంతా ధారపోసి చివరి రోజుల్లో కటిక దారిద్రాన్ని అనుభవించిన టంగుటూరి లాంటి మహోన్నత వ్యక్తులను నేటి భారతంలో ఆశించగలమా ? ముఖ్యమంత్రి పదవి అంటే తర తరాలకు సరిపడా ఆస్తులను దోచుకుని తమ వారసులకు పంచి పెట్టే ఒక అద్భుత దీపంగా భావించే ప్రస్తుత రోజుల్లో దేశం కోసం సొంత ఆస్తులను అమ్ముకుని రూపాయికి లేని అటువంటి ముఖ్యమంత్రిని చూడగలమా ?
చూడగలమా ? అంటే చూడలేమనే సమాధానం వస్తుంది !

ఆ తరం వేరు
నేటి తరం వేరు !
ఆనాటి రాజకీయాలు వేరు
ఈనాటి అరాచకీయాలు వేరు !

డియర్ రాజకీయ నాయకులూ / పాలకులూ మీ మీ ఓటు బ్యాంకు రాజకీయాలు ఎలా ఉన్నా సంవత్సరంలో ఒకసారైనా ఇటువంటి మహానీయుడి పేరున మంచి కార్యక్రమాలు చేపట్టండి !
దేశం కోసం నిస్వార్థంగా సేవ చేయగలిగారు కాబట్టే టంగుటూరి నేటికీ ప్రజల గుండెల్లో చిరస్మరనీయుడు అయ్యారు !

గోదావరి రైల్వే స్టేషన్ లో ఆకలితో అలమటిస్తూ , తినబోయే అరటి పండును , చేయి చాచిన బిక్షగానికి ఇచ్చి , మంచినీరు తాగుతుంటే ,చూడలేక స్టేషన్ మాష్టారు కు వారి వెన్నంటి వున్న సెక్రటరీ చెబితే , ఆయన తన క్యారేజీని ఇద్దరికి పెట్టాడట. ఇలాంటి దాత టంగుటూరి గారు ( ఏమి లేని కటిక పేదరికం నుంచి, కోట్లు సంపాదించి ప్రజలకు పంచి ముఖ్యమంత్రి పదవి చేసి, అలా మరలా కటిక దరిద్రం అనుభవించిన వారికి నమఃసుమాంజలి. సరే , వారి పిల్లలు ఎలావున్నారో ఎవరికి తెలియదు , కూతురు కుమారుడు సినీ యాక్టర్ . ఏ రాజకీయ నాయకుడు వారి పిల్లల గురించి పట్టలేదు నాడు నేడు కూడా. ఇంకో దారుణం. వారు పదవిలో ఉండగా కట్టిన కృష్ణా బ్యారేజ్ కి వారి పేరు పెట్టారుకదా ! 2015 లో ఆ శిలాఫలకాల మీద డిజైన్ బొమ్మలతో, పేరు కనపడకుండా చేసారు మన గొప్ప పాలకులు. వారికి అభిమానులు మెండులే నేటికీ! ప్రకాశం గారికే లేరు!

– రవీంద్ర.కె

LEAVE A RESPONSE