పది ఫలితాల్లో స్టేట్ 2 ర్యాంకర్‌ను సన్మానించిన అచ్చెన్నాయుడు
ఎస్ఎస్సి-2023 ఫలితాల్లో 596 మార్కులు సాధించిన బి.లక్ష్మీచేతనను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు సన్మానించారు. ఈ మేరకు తల్లిదండ్రులు, స్కూల్ కరస్పాండెంట్ వికాస్ హరికృష్ణ, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తితో కలిసి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో అచ్చెన్నాయుడు ని కలిశారు.
పేద కుటుంబంలో పుట్టినప్పటికీ చదువులపై మక్కువ ఏ స్థాయిలో ఉందో ఈ మార్కులు చూస్తేనే అర్ధమవుతోందని, ఏం చదవాలి అనుకున్నా పార్టీ అండగా నిలుస్తుందన్నారు. మరిన్ని విజయాలు సాధించి తల్లిదండ్రులు, జన్మనిచ్చిన నేలకు గుర్తింపు తీసుకురావాలని సూచించారు. ఐఐటి ఇంజనీరింగ్ పూర్తిచేసుకుని, తర్వాత సివిల్స్‌లో రాణించాలనుకుంటున్నట్లు లక్ష్మీ చేతన తెలుపగా, ఎప్పుడు ఏ సాయం కావాలన్నా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా లక్ష్మీ చేతనను అచ్చెన్నాయుడు సన్మానించారు. ఉన్నత ప్రమాణాలు, మెరుగైన విద్యా బోధనతో విద్యార్ధుల జీవితాలను తీర్చిదిద్దుతున్న వికాస్ విద్యా సంస్థల కరస్పాండెంట్ వికాస్ హరికృష్ణను అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నరేగా ఫిర్యాదుల విభాగం కమిటీ సభ్యులు పోతుగంటి పేరయ్య తదితరులు పాల్గొన్నారు.