జగన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యలో వెనుకబడుతున్న గిరిజన బిడ్డలు

-గిరిజన గురుకులాలలో నానాటికీ దిగజారుతున్న విద్యాప్రమాణాలు
-ఉపముఖ్యమంత్రిగా గిరిజనుడి ఉండి నాలుగేళ్లలో గిరిజన విద్యపై ఒక్కసమీక్ష చేయలేదు
-రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి ఎం. ధారు నాయక్

జగన్ రెడ్డి పాలనలో గిరిజన బిడ్డలకు విద్య అందని ద్రాక్షాగా మారిపోయింది. ఇటీవల విడుదలైన ఇంటర్, 10 వ తరగతి ఐఐటి మెయిన్స్ ఫలితాలే ఇందుకు నిదర్శనం. ఈ ఫలితాలలో ఆంధ్రప్రదేశ్ గిరిజన విద్యార్ధులు వెనబడ్డారు. ఐఐటీ మెయిన్స్ లో తెలంగాణలో 414 మంది గిరిజన విద్యార్ధులు అర్హత సాధిస్తే ఆంధ్రప్రదేశ్ లో కేవలం 141 మంది మాత్రమే అర్హత సాధించారు.

దీనికి ప్రధాన కారణం గిరిజన గురుకులాలకు శాశ్వత సెక్రటరినీ కూడ నియమించలేని స్థితిలో జగన్ రెడ్డి ప్రభుత్వం ఉంది. సాక్షాత్తు ఉపముఖ్యమంత్రిగా గిరిజనుడైన రాజన్న దొర ఉన్నప్పటికీ గిరిజన గురుకులాలపై నేటి వరకు ఒక్క సమీక్ష కూడా నిర్వహించకపోవడం శోచనీయం. నాలుగేళ్లలో ఒక్కసారి కూడా ఉపాధ్యాయ నియామకాలు చేయలేదు. శాశ్వత ప్రాతిపదికన నాలుగేళ్లలో ఒక్క భవనం నిర్మించలేదు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఆశ్రమ పాఠశాలలు అనాధలుగా మిగిలిపోతున్నాయి.

గిరిజన పాఠశాలల్లో నానాటికి విద్యాప్రమాణాలు దిగజారిపోతున్నా ఈ ప్రభుత్వం దున్నపోతుపై వర్షం పడినట్లుగానే వ్యవహరిస్తోంది. బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల పథకాన్ని రద్దు చేయడంతో 17 వేల మంది గిరిజన విద్యార్ధులు రోడ్డునపడ్డారు. ట్రైబల్ సొసైటీలలో పనిచేసే ఉపాధ్యాయులకు 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పదవీవిరమణ వయసు పెంచలేదు. ఆ స్థానాల్లో పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయ స్థానాలను భర్తీ చేయలేదు. గురుకులాలలో 1800 టీచింగ్ స్టాప్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టిడిపి హయాంలో 1100 టీచర్ పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చినప్పటికీ వాటిని అమలు చేయలేదు.

Leave a Reply